3 స్కీములతో 156 కోట్లు స్వాహా

ABN , First Publish Date - 2020-07-05T09:24:11+05:30 IST

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 1,456 మందిని మోసం చేసి, రూ.156 కోట్లు కొల్లగొట్టాడు ఓ కేటుగాడు. సైబరాబాద్‌ పోలీసులు అతడి ఆటకట్టించి అరెస్టు చేశారు.

3 స్కీములతో 156 కోట్లు స్వాహా

  • 1,456 మందిని ముంచిన మోసగాడు 
  • స్వధాత్రి ఇన్‌ ఫ్రా పేరుతో దందాలు
  • ఆటకట్టించిన సైబరాబాద్‌ పోలీసులు


హైదరాబాద్‌ సిటీ, జూలై 4(ఆంధ్రజ్యోతి): ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 1,456 మందిని మోసం చేసి, రూ.156 కోట్లు కొల్లగొట్టాడు ఓ కేటుగాడు. సైబరాబాద్‌ పోలీసులు అతడి ఆటకట్టించి అరెస్టు చేశారు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. విజయవాడకు చెందిన యార్లగడ్డ రఘుబాబు అతి తక్కువ సమయంలో రూ.వందల కోట్లు సంపాదించాలని పథకం వేశాడు. హైదరాబాద్‌కు మకాం మార్చి మూడు స్కీములను రూపొందించాడు. వాటి కోసం మూడు కార్యాలయాలు తెరిచాడు. 30 మంది ఏజెంట్లు, 20 మంది టెలీ కాలర్స్‌ను నియమించి దందా మొదలుపెట్టాడు. స్వధాత్రి ఇన్‌ఫ్రా పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించి.. రూ.లక్ష, అంతకు మించి పెట్టుబడి పెట్టిన వారికి నెలకు 9శాతం వడ్డీ చెల్లిస్తామంటూ నమ్మించాడు. దీనిపై తన ఏజెంట్లు, టెలీకాలర్లతో ప్రచారం చేయించాడు. అలా 950 మంది నుంచి రూ. 87 కోట్లు కొల్లగొట్టాడు. బై బ్యాక్‌ స్కీమ్‌ పేరుతో మరో మోసానికి తెరతీశాడు. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్స్‌ వద్ద తక్కువ ధరకు ఎక్కువ మొత్తంలో ప్లాట్స్‌ను స్వధాత్రి ఇన్‌ఫ్రా ప్రాజెక్టు కంపెనీ పేరుతో కొనుగోలు చేయడం లేదా సేల్‌ అగ్రిమెంట్‌ చేసుకునేవాడు. వాటిని అమ్మకానికి పెట్టేవాడు. 


వాయిదాల్లో డబ్బు చెల్లించే సదుపాయం ఉందని, ఆ నగదుకు ప్రతి నెల 4-10 శాతం వడ్డీ ఇస్తానని నమ్మించేవాడు. పూర్తి డబ్బులు చెల్లించిన తర్వాత ఎవరు కొనుగోలు చేసిన ప్లాటు వారికే ఇచ్చేస్తానని నమ్మబలికేవాడు. అలా 300 మంది నుంచి రూ.42కోట్లు కొల్లగొట్టాడు. స్వధాత్రి ఫ్లాట్స్‌ బంపర్‌ ఆఫర్‌ పేరుతో మూడో స్కీమ్‌కు తెరతీశాడు యార్లగడ్డ రెసిడెన్షియల్‌ ఫ్లాట్స్‌ బిల్డర్స్‌తో ముందుగా కొన్ని ఫ్లాట్స్‌ కొనుగోలు చేస్తున్నట్లు ఒప్పందం చేసుకునేవాడు. 40 శాతం డబ్బులు చెల్లించేవాడు. తర్వాత వాటిని ఇతరులకు అమ్మేసేవాడు. జీఎస్టీ లేకుండానే ఫ్రీ రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని ఆఫర్‌ ఇచ్చేవాడు. ఫ్లాట్‌ కోసం 70 శాతం డబ్బులు చెల్లించిన వారికి ఫ్లాట్‌ చేతికందేవరకు ఇంటి అద్దె కింద నెలకు రూ. 10వేలు చెల్లిస్తానని బంపర్‌ ఆఫర్‌లో పేర్కొన్నాడు. ఇలా 200 మంది నుంచి రూ.27 కోట్లు కొల్లగొట్టాడు. ముచ్చటగా మూడు స్కీములు పెట్టి 1,456 మందిని ముంచేసి మొత్తం రూ.156 కోట్లు కొల్లగొట్టాడు. ప్రతి నెల అందాల్సిన డబ్బులు రాకపోవడంతో బాధితులు మాదాపూర్‌ పోలీసులను ఆశ్రయించారు. దాంతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. సీపీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు మాదాపూర్‌, ఎకనామిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌(ఈవోడబ్ల్యూ) పోలీసులు రంగంలోకి దిగారు. రఘుబాబుకు సహకరించి, వెన్నంటి ప్రోత్సహించింది శ్రీనివాసబాబుగా గుర్తించారు. వారిద్దరినీ అరెస్టు చేశారు.

Updated Date - 2020-07-05T09:24:11+05:30 IST