రూ. వందల కోట్ల విలువైన భూముల కబ్జాదారులపై అమ్రేలీలో కేసు నమోదు

ABN , First Publish Date - 2020-06-06T03:33:11+05:30 IST

ఫోర్జరీ దస్తావేజులతో వందల కోట్ల రూపాయల విలువైన భూములను

రూ. వందల కోట్ల విలువైన భూముల కబ్జాదారులపై అమ్రేలీలో కేసు నమోదు

గాంధీ నగర్ : ఫోర్జరీ దస్తావేజులతో వందల కోట్ల రూపాయల విలువైన భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన ముగ్గురిపై అమ్రేలీ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. నిందితులు సమర్పించిన దస్తావేజుల్లో భారత దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్, తొలి హోం మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, మొదటి న్యాయ శాఖ మంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సంతకాలను ఫోర్జరీ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా గుజరాత్ హైకోర్టు ఇచ్చినవంటూ బూటకపు ఆదేశాలను కూడా సమర్పించినట్లు తెలిపారు. 


ఈ కేసులో ప్రధాన నిందితుడు వాపి నివాసి అయిన వలి మెటర్. ఇతనికి పవరాఫ్ అటార్నీలుగా ఉన్న ఇద్దరు అమ్రేలీవాసులు యూసఫ్ మోతీవాలా, వినోద్ రాయ్ భాద్ ఇతర నిందితులు. 


వీరంతా అమ్రేలీలో 5 ప్లాట్లపై తమకు హక్కులు ఉన్నట్లు పేర్కొంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ 5 ప్లాట్లు వలీకి చెందినవని చెప్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ భూముల దస్తావేజులను కూడా సమర్పించారని తెలిపారు. 


ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, విమానాశ్రయం, రైల్వేలు, ప్రభుత్వ పాఠశాల, అమ్రేలీ జిల్లా పరిథిలోని భూముల్లో ఈ 5 ప్లాట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీటి విలువ రూ. వందల కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.


జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టినట్లు అమ్రేలీ పోలీస్ సూపరింటెండెంట్ నిర్లిప్త్ రాయ్  పేర్కొన్నారు. గాంధీ నగర్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ చేతివ్రాత, ఫొటోగ్రఫీ బ్యూరోకు పరీక్షల కోసం పంపించినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పరీక్షల్లో ఈ నిందితులు సమర్పించిన దస్తావేజులు ఫోర్జరీ చేసినవని వెల్లడైందని చెప్పారు. 


తమకు అనుకూలంగా గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఈ నిందితులు సమర్పించిన పత్రాలు కూడా నకిలీవేనని నిర్థరణ అయిందన్నారు. వీరిపై వివిధ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Updated Date - 2020-06-06T03:33:11+05:30 IST