కరోనాపై గెలిచి చరిత్ర సృష్టించిన కేరళ డాక్టర్లు

ABN , First Publish Date - 2020-02-14T23:53:35+05:30 IST

ప్రాణాంతక వైరస్ కరోనాపై కేరళ వైద్యులు విజయం సాధించి చరిత్ర సృష్టించారు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌కి ..

కరోనాపై గెలిచి చరిత్ర సృష్టించిన కేరళ డాక్టర్లు

తిరువనంతపురం:  ప్రాణాంతక వైరస్ కరోనాపై కేరళ వైద్యులు విజయం సాధించి చరిత్ర సృష్టించారు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌కి గురైన ముగ్గురు రోగులు పూర్తిగా కోలుకున్నట్టు వైద్య పరీక్షల్లో తేలడంతో ఇక్కడ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. కొవిడ్ 19గా ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) దీనికి నామకరణం చేసింది. ఈ వ్యాధి బారిన ముగ్గురు వైద్య విద్యార్థులకు కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ స్వీయ పర్యవేక్షణలో వైద్యం జరిగింది. చైనాలోని వుహాన్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న ముగ్గురు విద్యార్ధినులకు కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురూ చైనా నుంచి భారత్‌కు తిరిగిరాగానే ప్రత్యేక వార్డులకు తరలించి వైద్యం అందించారు.


ఈ ముగ్గురూ పూర్తిగా కోలుకున్న నేపథ్యంలో ఇవాళ కేరళ ఆరోగ్యమంత్రి థామస్ ఐజక్ ట్విటర్లో స్పందించారు. ‘‘నిపా కేసులో మాదిరిగానే, కరోనా వైరస్‌పై పోరాటంలో కేరళ విజయం సాధించింది. కరోనా బారిన పడిన ముగ్గురూ పూర్తిగా కోలుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారులు నిర్థారించారు. క్వారంటైన్‌ పరిశీలనలో వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఆరోగ్య శాఖకు అభినందనలు..’’ అని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-02-14T23:53:35+05:30 IST