Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jan 15 2022 @ 03:30AM

కన్నీళ్లు మిగిల్చిన పండుగ!

  • భవనంపై నుంచి కింద పడి మహిళ మృతి
  • గిర్నీ మోటారు బెల్టులో చీర చిక్కుకొని మరో మహిళ 
  • ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రధానోపాధ్యాయుడి దుర్మరణం
  • మరో ఘటనలో అప్పుల బాధకు కౌలు రైతు ఆత్మహత్య


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాల్సిన ఆ కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు తమవాళ్లు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. శుక్రవారం వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతిచెందితే, ఒక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కోతుల నుంచి తప్పించుకోబోయిన ఓ మహిళ పట్టుతప్పి భవనమ్మీద నుంచి పడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని బ్రాహ్మణవీధిలో ఈ ఘటన జరిగింది. మృతురాలు నారంభట్ల రాజేశ్వరి (52). ఆమె హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరు కూతుళ్లతో కలిసి పండుగ జరుపుకునేందుకు రెండ్రోజుల క్రితం ధర్మపురిలోని తన సోదరుడి ఇంటికి వచ్చారు. బ్రాహ్మణవీధిలో నిర్మాణ దశలో ఉన్న తన సోదరుని ఇల్లు చూసేందుకు శుక్రవారం ఉదయం రెండస్తుల భవనంపైకి ఎక్కారు. ఆ సమయంలో భవనంపై ఉన్న కోతులు ఒకేసారి రాజేశ్వరి పైకి రావటంతో తప్పించుకునే యత్నంలో పట్టుతప్పి కిందపడ్డారు. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లిలో మరో విషాదం జరిగింది. పిండిగిర్ని మోటారు బెల్టులో చీర చిక్కుకొని, విసిరేసినట్టుగా కింద పడటంతో తలకు గాయమై ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది.


మృతురాలు మాచర్ల కవిత (36). ఆమెకు భర్త వేణు, కుమారులు ఉమేశ్‌ చంద్ర, కార్తికేయ అనే పిల్లలు ఉన్నారు. పండుగ సందర్భంగా పిండివంటలు వండేందుకు పప్పు దినుసులతో గ్రామంలోని పిండిగిర్ని వద్దకు ఆమె వెళ్లారు. దినుసులు పడుతున్న క్రమంలో కవిత చీరకొంగు మోటారు బెల్టులో చిక్కుకోవడంతో ప్రమాదం సంభవించింది.  కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వాహనంపై ప్రయాణిస్తున్న బుక్యా రాము (42) అనే వ్యక్తి మృతిచెందాడు. మృతుడి స్వస్థలం గజ్యానాయక్‌ తండా.  సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజుపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. పండుగ కోసం అత్తమామలను తీసుకొని రావడానికి సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్‌కు ఉదయం స్కూటీపై బయలుదేరారు. మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌(ఎం) గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో రాము అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు భార్య కళావతి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.


ఖమ్మం జిల్లా చింతకాని మండలం కొదుమూరులో అప్పుల బాధకు తాళలేక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని కొణిజర్ల మండలం పెద్దగోపతి గ్రామానికి చెందిన దామాల బాలస్వామి (60) ఐదెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. దిగుబడి సరిగా రాకపోవడంతో రూ.6లక్షల అప్పు మిగిలింది. దీంతో కొన్నాళ్లుగా తీవ్ర ఆవేదన చెదుతున్న బాలస్వామి, కొదుమూరు సమీపంలోని రహదారి పక్కన ఉన్న పొలాల్లో పురుగులమందు తాగి చనిపోయారు.  

Advertisement
Advertisement