వాగులో ముగ్గురి గల్లంతు

ABN , First Publish Date - 2022-08-12T06:00:05+05:30 IST

వాగులో ముగ్గురి గల్లంతు

వాగులో ముగ్గురి గల్లంతు
గల్లంతైన రంజిత్‌, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వెంకటేష్‌, ప్రవీణ్‌ (ఫైల్‌ఫొటోలు)

తొలుత చేపలవేటకు వెళ్లి మునిగిన ఓ వ్యక్తి 

గాలింపునకు వచ్చిన డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిలో ఇద్దరు మునక

ఒకరి మృతదేహం లభ్యం

నేలకొండపల్లి మండలం సుర్దేపల్లిలో ఘటన

నేలకొండపల్లి, ఆగస్టు 11 : చేపలవేటకు వెళ్లి ఓ వ్యక్తి వాగులో గల్లంతు కాగా.. అతడిని గాలించేందుకు వచ్చిన నలుగురు డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిలో ఇద్దరు గల్లంతైన సంఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి గ్రామంలో జరిగింది. గురువారం జరిగిన ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే గల్లంతయిన ముగ్గురికీ ఈతలో ప్రావీణ్యం ఉన్నా విధి నుంచి తప్పించుకోలేకపోవడం విషాదకరం. నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన పగడాల రంజిత్‌(25) అనే వ్యక్తి గురువారం ఉదయం చేపల వేటకని సుర్దేపల్లి వద్ద ఉన్న పాలేరు వాగుపై ఉన్న బ్రిడ్జికమ్‌చెక్‌డ్యామ్‌ వద్ద నీటిలో దిగాడు. చేపల కోసం వలను విసిరి.. దాన్ని పైకి లాగేందుకు ప్రయత్నించగా ఆ వల నీటి ఉధృతికి చెక్‌డ్యాంపై నుంచి అలుగు కిందకు జారగా.. ఆ వలతో పాటు రంజిత్‌ కూడా చెక్‌డ్యాం దిగువభాగంలో పడిపోయాడు. దీనిని గమనించిన స్థానికులు ఆ తర్వాత ఎంతకూ రంజిత్‌ పైకి రాకపోవటంతో గల్లంతైనట్లుగా భావించి మండల అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు పరిస్థితిని తెలుసుకుని.. ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. ఈక్రమంలో గల్లంతైన రంజితను గాలించేందుకు ఖమ్మం కార్పొరేషన్‌లో పనిచేస్తున్న నలుగురు డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని అక్కడికి పంపారు. ఈ క్రమంలో సుర్దేపల్లి వాగు వద్దకు చేరుకున్న వారిలో బాశెట్టి ప్రవీణ్‌ అలియాస్‌ ప్రదీప్‌(30), పడిగెల వెంకటేష్‌ (29).. రంజిత ఆచూకీ కోసం వాగులోకి దిగేందుకు సిద్ధమయ్యారు. అయితే వారు వాగులోకి దిగే క్రమంలో తొలుత ప్రవీణ్‌ కాలికి తాడు కట్టి నీటిలోకి దించారని, అలా నీటిలోకి దిగిన ప్రవీణ్‌ ఎంత సేపటికి బయటకు రాకపోవటంతో ఆ తాడును పట్టుకుని ఉన్న వెంకటేష్‌ ఆతాడును లాగుతూ నీటిలోకి దిగాడు. కానీ నీటి ప్రవాహానికి వెంకటేష్‌ కొట్టుకుపోయాడు. వీరిలో వెంకటేష్‌ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనతో గ్రామస్థులు, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న ఏసీపీ, సీఐ, తహసీల్దార్‌ ఇతర మండల అధికారులు పరిస్థితిని ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. 

‘డీఆర్‌ఎ్‌ఫ’లో పెను విషాదం

శోకసంద్రంలో ప్రవీణ్‌, వెంకటేష్‌ కుటుంబాలు

ఖమ్మం కార్పొరేషన/ఖమ్మం రూరల్‌/ చింతకాని, ఆగస్టు 11 : వారు విపత్తు సమయాల్లో సేవలందించేందుకు నియమితులైన గజ ఈతగాళ్లు. వరలు, ఇతర ఆపత్కాల సమయంలో ఉధృత నీటి ప్రవాహాల్లోనూ ఈదగల సమర్థులు. కానీ విధి వక్రీకరించి ఆ ఇద్దరు డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నీట మునిగిన సంఘటన అటు డీఆర్‌ఎఫ్‌ విభాగంలోనూ, ఇటు వారి కుటుంబాల్లోనూ పెనువిషాదాన్ని నింపింది. వరదలు, ప్రకృతి విపత్తుల సమయంలో సేవలందించేందుకు గాను రెండేళ్ల క్రితం ఖమ్మం నగరపాలక సంస్థలో 20మంది సిబ్బందితో డిసార్టర్‌ రెస్పాన్స ఫోర్స్‌ (డీఆర్‌ఎ్‌ఫ)ను ఏర్పాటు చేశారు. వర్షాలు కురిసి వరదలు వచ్చినప్పుడు వరదనీరు పారేలా చేయటం, పడిపోయిన చెట్లను తొలగించడం, ఎవరైనా నీటి ప్రవాహాల్లో చిక్కుకున్నప్పుడు వారిని రక్షించడం లాంటి సేవలందిస్తారు. అలాంటి డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిలో ఇద్దరు నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి వద్ద బ్రిడ్జికమ్‌ చెక్‌డ్యాంలో కొట్టుకుపోయిన వ్యక్తిని గాలించేందుకు నీటిలో దిగి గల్లంతవడం, వారిలో ఒకరి మృతదేహం లభ్యం కావడం ఆ విభాగంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే సుర్దేపల్లి వాగు వద్దకు వారిని ఎవరు పంపించారనే విషయంలో స్పష్టత లేదు. మొత్తం నలుగురు సిబ్బందిని పంపగా.. వారిలో వేంకటేష్‌, ప్రవీణ్‌ అలియాస్‌ ప్రదీప్‌ ప్రమాదానికి గురయ్యారు. గల్లంతయిన వారిలో పడిగెల వెంకటే్‌షది ఖమ్మం రూరల్‌ మండలం ఎం వెంకటాయపాలెం. నిరుపేద కుటుంబానికి చెందిన పడిగెల యాదగిరి, నాగలక్ష్మి దంపతుల చిన్నకుమారుడైన వెంకటేష్‌ డిగ్రీ వరకు చదువుకుని మూడేళ్ల క్రితం ఖమ్మం కార్పొరేషన్‌లోని డీఆర్‌ఎఫ్‌లో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా చేరాడు. తండ్రి మృతిచెందడంతో ప్రస్తుతం ఆయన తల్లి నాగలక్ష్మి ప్రస్తుతం ఖమ్మంలో ఇళ్లలో పనిచేస్తూ అవివాహితుడైన తన కొడుకుకు అండగా ఉంటోంది. త్వరలోనే అతడికి పెళ్లిచేయాలన్న ఆలోచనలో ఉన్న ఆ తల్లికి శోకమే మిగిలింది. ఇక వెంకటేష్‌ మృతితో తల్లి, సోదరి, సోదరుడు ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.  ఇదే ఘటనలో గల్లంతైన బాశేట్టి ప్రవీణ్‌ అలియాస్‌ ప్రదీ్‌పది చింతకాని మండలం నాగులవంచ గ్రామం. ఆయనకు భార్య, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. ఆయన మృతితో భార్య, ఇతర కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే గాలింపు చర్యలకు వెళ్లి ప్రమాదానికి గురైన డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. 



Updated Date - 2022-08-12T06:00:05+05:30 IST