ఒమైక్రాన్‌.. టెన్షన్‌!

ABN , First Publish Date - 2022-01-13T05:42:27+05:30 IST

జిల్లావాసులను ఒమైక్రాన్‌ టెన్షన్‌ వెంటాడుతోంది. జిల్లాలో తొలిసారిగా బుధవారం మూడు కేసులు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వజ్రపుకొత్తూరు, కంచిలి, ఇచ్ఛాపురం మండలాల్లో ఒక్కో కేసు చొప్పున బయటపడినట్టు అధికారులు నిర్ధారించారు. వీరు ముగ్గురూ విదేశాల నుంచి వచ్చారని వెల్లడించారు. ఓవైపు కరోనా కేసుల తీవ్రత పెరగ్గా.. మరోవైపు ఒమైక్రాన్‌ కేసులు కూడా నమోదు కావడంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.

ఒమైక్రాన్‌.. టెన్షన్‌!
అధికార్లతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

- జిల్లాలో తొలిసారిగా మూడు కేసులు నమోదు

- వజ్రపుకొత్తూరు, కంచిలి, ఇచ్ఛాపురం మండలాల్లో బయటపడిన లక్షణాలు

- విదేశాల నుంచి వచ్చిన వారిగా గుర్తింపు

- ఆందోళన చెందుతున్న జిల్లావాసులు

వజ్రపుకొత్తూరు/కంచిలి/ఇచ్ఛాపురం, జనవరి 12 : జిల్లావాసులను ఒమైక్రాన్‌ టెన్షన్‌ వెంటాడుతోంది. జిల్లాలో తొలిసారిగా బుధవారం మూడు కేసులు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వజ్రపుకొత్తూరు, కంచిలి, ఇచ్ఛాపురం మండలాల్లో ఒక్కో కేసు చొప్పున బయటపడినట్టు అధికారులు నిర్ధారించారు. వీరు ముగ్గురూ విదేశాల నుంచి వచ్చారని వెల్లడించారు. ఓవైపు కరోనా కేసుల తీవ్రత పెరగ్గా.. మరోవైపు ఒమైక్రాన్‌ కేసులు కూడా నమోదు కావడంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. 

- వజ్రపుకొత్తూరు మండలంలోని ఓ గ్రామంలో ఒమైక్రాన్‌ పాజిటివ్‌ కేసు నమోదైనట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ లీల తెలిపారు. జిల్లాలో మొట్టమొదటి ఒమైక్రాన్‌ పాజిటివ్‌ కేసుగా గుర్తించామని చెప్పారు. 14 రోజుల కిందట దుబాయ్‌ నుంచి స్వగ్రామానికి వచ్చిన ఓ యువకుడికి దుబాయ్‌, ముంబై విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు చేయగా నెగెటివ్‌ నమోదైంది. గ్రామానికి చేరుకున్న తర్వాత స్థానిక వైద్య సిబ్బంది మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వెంటనే ఆయనను హోం ఐసోలేషన్‌లో ఉంచి ఒమైక్రాన్‌ పరీక్షలు  చేసి... హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించారు. ఆ యువకుడికి  ఒమైక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. దీంతో  వైద్య, సచివాలయ, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తమయ్యారు. బుధవారం ఆ యువకుడి స్వగ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో కొందరికి కరోనా పరీక్షలు నిర్వహించి ఫలితాల కోసం ల్యాబ్‌కు పంపించారు. వజ్రపుకొత్తూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి బ్లీచింగ్‌ చల్లారు. 

- కంచిలి మండల కేంద్రానికి సమీపంలోని ఓ గ్రామంలో ఒమైక్రాన్‌ పాజిటివ్‌ కేసు నమోదైందని ఎంఎస్‌పల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి రమేష్‌నాయుడు తెలిపారు. గత నెలలో దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఒమైక్రాన్‌ లక్షణాలు బయటపడ్డాయన్నారు. ఆ వ్యక్తికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించి, ల్యాబ్‌కు నమూనాలు పంపించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులను అప్రమత్తం చేశామన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.  

- ఇచ్ఛాపురం మండలంలోని ఒక గ్రామంలో ఒమైక్రాన్‌ కేసు నమోదైందని పీహెచ్‌సీ వైద్యురాలు లావణ్య తెలిపారు. అరబ్‌ దేశం నుంచి సగ్రామానికి వచ్చిన ఒక వ్యక్తికి ఈ నెల 8న గన్నవరం ఎయిర్‌పోర్టులో శ్యాంపిల్స్‌ సేకరించారన్నారు. పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపగా.. ఒమైక్రాన్‌ కేసు నమోదైనట్టు నిర్ధారణ అయిందని తెలిపారు.  జిల్లాలో తొలిసారిగా మూడు కేసులు నమోదు కావడంతో ప్రజలు హడలిపోతున్నారు. 


మళ్లీ రికార్డు స్థాయిలో..

జిల్లాలో రికార్డు స్థాయిలో మళ్లీ కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం 3,461 నమూనాలు సేకరించగా.. 268 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 20,18,279 నమూనాలు సేకరించగా.. కరోనా బాధితుల సంఖ్య 1,24,288కు చేరింది. వీరిలో చాలామంది కోలుకున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 591 మంది, కొవిడ్‌ ఆస్పత్రుల్లో 9 మంది చికిత్స పొందుతున్నారు. బుధవారం 8 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. సంక్రాంతి వేళ.. కరోనా పాజిటివ్‌ కేసులు క్రమేపీ పెరుగుతుండడంతో జిల్లావాసులు భయాందోళన చెందుతున్నారు. 


సమన్వయంతో కరోనా కట్టడి : - కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

కలెక్టరేట్‌, జనవరి 12: కరోనా వైరస్‌ కట్టడికి అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లా డారు. కరోనా మూడో దశ వ్యాప్తిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే రెండు నెలలే కీలకమని తెలిపారు. ప్రతిఒక్కరూ కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘గత 24 గంటల్లో జిల్లాలో 268 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ పక్కాగా జరగాలి.  కంటైన్‌మెంట్‌ జోన్ల ఏర్పాటుపై నోడల్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి.   ఇచ్ఛాపురం నుంచి టెక్కలి వరకు సేకరించిన శాంపిళ్లను టెక్కలిలో పరీక్షిం చాలి. శాంపిళ్లు నిర్దేశిత సమయంలో ల్యాబ్‌లకు చేరేందుకు రవాణా సదుపా యం మెరుగుపర్చాలి. లోపాలు తలెత్తితే చర్యలు తప్పవు. కొవిడ్‌ ఆస్పత్రులు, హోంఐసోలేషన్‌, డ్రయేజింగ్‌, టెస్టింగ్‌, మందులు, అంబులెన్స్‌, తదితర విభాగాలు చురుగ్గా పనిచేయాలి. 104 కాల్‌ సెంటర్‌ కూడా పనిచేస్తోంది.  ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలి. మాస్క్‌లు ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటించాలి. చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆసుపత్రుల పడకల్లో 50 శాతం ‘ఆరోగ్యశ్రీ’ కింద కేటాయించాలి. సీసీ కెమెరాల పనితీరు, ఇతర అంశాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి’ అని నోడల్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీలు కె.శ్రీనివాసులు, ఆర్‌.శ్రీరాములు నాయుడు, ఇన్‌చార్జి డీఆర్వో సీతారామమూర్తి, ఆర్డీవో ఐ.కిశోర్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.జగన్నాథరావు డ్వామా పీడీ హెచ్‌.కూర్మారావు, వైద్యులు, కొవిడ్‌ అధికారులు పాల్గొన్నారు.


ఐసోలేషన్‌ కిట్లు సరఫరా చేయండి : - జేసీ శ్రీనివాసులు

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జనవరి 12: కరోనా లక్షణాలతో హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి వెంటనే ఐసోలేషన్‌ కిట్లు సరఫరా చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు ఆదేశించారు. బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో వైద్యాధికారులు, కమ్యూనిటీ ఆర్గనైజర్‌లు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులను కలిసిన వారిని తక్షణమే గుర్తించాలన్నారు. వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచాలని సూచించారు. ఒమైక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. ఇది సోకిన వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలని, బయట తిరగకూడదని తెలిపారు. ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని  స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ ఓబులేసు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-13T05:42:27+05:30 IST