ఆ 11 మందిలో నామినేషన్లు వేసింది ముగ్గురే..!

ABN , First Publish Date - 2021-03-03T09:28:06+05:30 IST

గతేడాది మార్చిలో నామినేషన్ల దాఖలు పర్వంలో నామినేషన్లు వేయనివ్వకపోవడం.. బలవంతంగా ఉపసంహరింపజేయడం.. ఈ క్రమంలో దాడులు, దౌర్జన్యాలు, కిడ్నాపుల వంటివి చోటుచేసుకున్న సంగతి

ఆ 11 మందిలో నామినేషన్లు వేసింది ముగ్గురే..!

గతేడాది మార్చిలో నామినేషన్ల దాఖలు పర్వంలో నామినేషన్లు వేయనివ్వకపోవడం.. బలవంతంగా ఉపసంహరింపజేయడం.. ఈ క్రమంలో దాడులు, దౌర్జన్యాలు, కిడ్నాపుల వంటివి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు అక్రమాలు నిర్ధారణ అయిన 11 వార్డుల్లో (చిత్తూరు జిల్లాలో తిరుపతి కార్పొరేషన్‌లో 6, పుంగనూరు పురపాలక సంఘంలోని 3, కడప జిల్లా రాయచోటి మున్సిపాలిటీలోని 2 వార్డులు) 11 మంది అభ్యర్థులు మళ్లీ నామినేషన్లు వేసేందుకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఎస్‌ఈసీ సమయమిచ్చింది. అయితే వారిలో కేవలం ముగ్గురే దాఖలు చేయగలిగారు. తిరుపతిలో ముగ్గురు టీడీపీ అభ్యర్థులు తిరిగి నామినేషన్లు సమర్పించగా.. మరో ఇద్దరు టీడీపీ, ఒక బీజేపీ అభ్యర్థి మాత్రం దాఖలు చేయలేదు! పుంగనూరులో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ మళ్లీ నామినేషన్లు వేసేందుకు ఎన్నికల సంఘం అనుమతించిన ముగ్గురిలో ఇద్దరి నామినేషన్లు ‘సాంకేతిక కారణాల’ రీత్యా ఇంకా ‘ఫోర్స్‌’లోనే ఉన్నాయని అక్కడి ఎన్నికల అధికారులు చెప్పారు. వారిలో ఒకరు దానిని తాజాగా ఉపసంహరించుకునేందుకు అనుమతించారు. మిగిలిన ఇద్దరితో కూడా బుధవారంవిత్‌డ్రా చేయించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.


రాయచోటిలోని ఇద్దరు అభ్యర్థులకు గాను ఒక్కరు మాత్రమే నామినేషన్‌ వేశారు. నిరుడు ఒత్తిళ్ల కారణంగా పోటీ నుంచి వైదొలిగిన ఎర్రగుంట్ల నగర పంచాయతీలోని 3 వార్డుల్లోని ముగ్గురు అభ్యర్థులు తిరిగి పోటీలో ఉన్నట్లుగా ఎన్నికల సంఘం సోమవారంనాడు ఆదేశాలిచ్చింది. 6వ వార్డులోని మద్దూరు హరిప్రసాద్‌రెడ్డి, 11వ వార్డులోని షేక్‌ రహంతుల్లా, 15వ వార్డులోని మంజుల దివ్య ధరణిల అభ్యర్థిత్వాలను పునరుద్ధరించింది. అయితే ఉపసంహరించుకోవాలని వైసీపీ నేతలు వీరిపైనా ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.

Updated Date - 2021-03-03T09:28:06+05:30 IST