ముగ్గురు నేపాల్‌ దొంగల అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-10-20T07:36:57+05:30 IST

ఇటీవల రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భారీ చోరీకి పాల్పడిన నేపాల్‌ దొంగల ముఠా ఆటకట్టించారు సైబరాబాద్‌ పోలీసులు.

ముగ్గురు నేపాల్‌ దొంగల అరెస్ట్‌

రూ. 4.50లక్షల సొత్తు స్వాధీనం

వివరాలు వెల్లడించిన మాదాపూర్‌ డీసీపీ 


 గచ్చిబౌలి, అక్టోబర్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఇటీవల రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భారీ చోరీకి పాల్పడిన నేపాల్‌ దొంగల ముఠా ఆటకట్టించారు సైబరాబాద్‌ పోలీసులు. సీపీ సజ్జనార్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎస్‌వోటీ పోలీసులు దొంగల కంటే ముందే భారత్‌-నేపాల్‌ సరిహద్దుకు చేరుకొని దొంగల కోసం కాపుకాశారు. ముఠాలో మొత్తం తొమ్మిది మంది సభ్యు లు ఉండగా, అక్టోబర్‌ 12న ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 5.2లక్షల నగదు, 300గ్రాముల బంగారం సహా మొత్తం రూ. 20లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు దొంగలు పోలీసులకు పట్టుబడలేదు. సీపీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు వారి కోసం సైబరాబాద్‌ స్పెషల్‌ పోలీస్‌ బృందం  పదిరోజులుగా అక్కడే ఉన్న  నిందితుల కోసం వేట కొనసాగించింది. నేపాల్‌ దొంగలు తిరిగి రహస్యంగా హైదరాబాద్‌ చేరుకున్నారు. సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌తో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఎట్టకేలకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో మరో ముగ్గురు దొంగలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 4.50లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.


ఈనెల 5న రాయదుర్గం పీఎస్‌ పరిధిలో బోర్‌వెల్‌ వ్యాపారి రాజారెడ్డి ఇంట్లో నేపాలీ ముఠా సభ్యులు భారీ ఎత్తున నగదు, బంగారు ఆభరణాలు దోచుకువెళ్లిన సంఘటన తెలిసిందే. ఈ ముఠాలో ఇప్పటికే ముగ్గురు సభ్యులను అరెస్టుచేసి వారి నుండి రూ.20లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 18న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. జానకీ, చక్రబుల్‌, అఖిలే్‌షకుమార్‌ను అరెస్టు చేసి వారి నుంచి రూ.17వేలు నగదు సహా, రూ.4.50విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ముఠాలోని మరో నలుగురు  రాజేందర్‌ అలియాస్‌ రవి, వినోద్‌ కమల్‌సాయి, అభిరామ్‌, మనోజ్‌ బహుదూర్‌సాయి పరారీలో ఉన్నారని, వారి కోసం రెండు బృందాలు గాలిస్తున్నాయన్నారు. త్వరలో వారిని కూడా పట్టుకుంటామన్నారు.


ఈ ముఠా సభ్యులు బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌ వంటి నగరాల్లో  ధనవంతుల ఇళ్లలో పనిమనుషులుగా చేరి సమయం దొరికినప్పుడు ఇంటివారికి మత్తు పదార్థాలు ఇచ్చి స్పృహకోల్పోయిన తర్వాత దోపిడి చేస్తున్నారని డీసీపీ వివరించారు.  పనిమనుషుల వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే పనిలో పెట్టుకోవాలని డీసీపీ సూచించారు. సమావేశంలో రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌, ఎస్‌వోటీ అడిషనల్‌ డీసీపీ సందీప్‌, ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-20T07:36:57+05:30 IST