UAE: ఆ కార్మికులకు 3 నెలల మధ్యాహ్న విరామం.. ఎప్పట్నుంచంటే..

ABN , First Publish Date - 2022-06-09T18:25:50+05:30 IST

యూఏఈ మానవ వనరులు, ఎమిరటైజేషన్ మంత్రిత్వశాఖ(MoHRE) తాకాగా కీలక ప్రకటన చేసింది.

UAE: ఆ కార్మికులకు 3 నెలల మధ్యాహ్న విరామం.. ఎప్పట్నుంచంటే..

అబుదాబి: యూఏఈ మానవ వనరులు, ఎమిరటైజేషన్ మంత్రిత్వశాఖ(MoHRE) తాకాగా కీలక ప్రకటన చేసింది. నిర్మాణ కార్మికులకు జూన్ 15వ తేదీ నుంచి మధ్యాహ్న విరామాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధన ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3.00 గంటల వరకు నిర్మాణ కార్మికులకు పని చేసేందుకు అనుమతించరు. ఎండతీవ్రత దృష్ట్యా కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గత 18 ఏళ్లుగా వేసవికాలంలో ఇదే నియమాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రిత్వశాఖకు చెందిన అధికారి మొహసెన్ అల్ నస్సి వెల్లడించారు. ఇది కార్మికులకు సురక్షితమైన పని వాతావరణాన్ని కలిపించడంతో పాటు వేసవి నెలల్లో వడదెబ్బకు గురికావడం వల్ల కలిగే అనారోగ్య ప్రమాదాల నుండి వారిని రక్షిస్తుందని పేర్కొన్నారు. ఇక ఈ మధ్యాహ్న విరామ నియమాన్ని సంస్థ యజమానులు ఉల్లంఘిస్తే ఒక్కొ కార్మికుడిపైన 5వేల దిర్హమ్స్(రూ.1లక్ష) జరిమానా ఉంటుందని తెలిపారు. 


ఒకవేళ నిబంధనకు విరుద్ధంగా యాజమాన్యం చాలా మంది కార్మికులతో పని చేయిస్తే గరిష్టంగా 50వేల దిర్హమ్స్(రూ.10లక్షలు) వరకు ఫైన్ ఉంటుందన్నారు. గత కొన్నేళ్లుగా ప్రైవేట్ రంగానికి చెందిన కంపెనీలు మధ్యాహ్న విరామ నియమాన్ని అమలు చేస్తూ సహకరిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇకపై కూడా ఇలాగే ప్రైవేట్ రంగ సంస్థలు ఈ నియమాన్ని పాటిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు మధ్యాహ్న విరామ నియమం అమలులో ఉంటుందని తెలిపారు. ఒకవేళ ఎవరైనా దీన్ని అతిక్రమిస్తే మినిస్ట్రీకి సంబంధించిన నం. 600590000కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ నంబర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పుకొచ్చారు. 


Updated Date - 2022-06-09T18:25:50+05:30 IST