గుబులు పుట్టిస్తున్న విద్యుత్‌ బిల్లులు

ABN , First Publish Date - 2020-06-06T10:58:52+05:30 IST

అసలే కరోనాతో ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రజలకు... తాజాగా మీటర్‌ రీడింగ్‌ తీసి ఇస్తున్న కరెంటు బిల్లులను చూడగానే

గుబులు పుట్టిస్తున్న విద్యుత్‌ బిల్లులు

మూడు నెలల బిల్లు ఒకేసారి 

ఎక్కువ బిల్లు వచ్చిందంటూ వినియోగదారుల గగ్గోలు 

వెల్లువెత్తిన ఫిర్యాదులు 

గ్రేటర్‌లో ఇంకా పూర్తికాని మీటర్‌ రీడింగ్‌ ప్రక్రియ


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): అసలే కరోనాతో ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రజలకు... తాజాగా మీటర్‌ రీడింగ్‌ తీసి ఇస్తున్న కరెంటు బిల్లులను చూడగానే వినియోగదారులకు షాక్‌ కొడుతోంది. మూడు నెలలకు సంబంధించిన ఇంటి బిల్లులే కొందరికి రూ.20వేల నుంచి 30వేల దాకా వచ్చాయి. కొందరు ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించినా తాజా బిల్లులో ఆ వివరాలు రావడం లేదు. దీంతో వేలల్లో వస్తున్న కరెంటు బిల్లులను చూసి లబో దిబో మంటున్నారు. రెండు రోజుల నుంచి విద్యుత్‌ సిబ్బంది గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇంటింటికీ వెళ్లి మీటర్‌ రీడింగ్‌ తీసి బిల్లులు ఇస్తున్నారు. దీంతో పెద్ద మొత్తంలో వచ్చిన కరెంటు బిల్లులతో వినియోగదారుల గుండెలు గుభేల్‌మంటున్న పరిస్థితి. మార్చి, ఏప్రిల్‌ నెలలకు సంబంధించిన బిల్లులను గతేడాది అంటే 2019 మార్చి, ఏప్రిల్‌ నెలలకు వచ్చిన బిల్లునే ప్రామాణికంగా తీసుకొని చెల్లించాలని వినియోగదారుల ఫోన్‌లకు నేరుగా సందేశాలు పంపించారు. లాక్‌డౌన్‌ సడలించడంతో ఈ నెల 2 నుంచి ఇంటింటికీ వెళ్లి మూడు నెలలు అంటే మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు కలిపి ఒకేసారి బిల్లును జారీ చేస్తున్నారు.


కొందరికి లాభం... మరికొందరికి భారం....

మూడు నెలలకు కలిపి ఒకేసారి బిల్లు ఇవ్వడం కొందరికి లాభం, మరికొందరికి భారంగా మారింది. విద్యుత్‌ వినియోగాన్ని బట్టి యూనిట్‌లను పరిగణలోకి స్లాబులను వర్తింపజేస్తున్నారు. ఎల్‌టీ కేటగిరి ‘ఏ’ విభాగంలో  0-50 యూనిట్ల వరకు రూ. 1.45పైసలు, 51-100 యూనిట్ల వరకు రూ.2.60 పైసలు వసూలు చేస్తుండగా, ఎల్‌టీ కేటగిరి ‘బి’ విభాగంలో 0-100 యూనిట్లకు రూ.3.30 పైసలు, 100-200 యూనిట్లకు రూ.4.30పైసులు వసూలు చేస్తున్నారు.


ఎల్‌టీ బీ-2 కేటగిరీలో 0-200 యూనిట్లకు రూ.5ల చొప్పున, ఇలా గృహ వినియోగదారులకు 800 యూనిట్ల వరకు స్లాబు రేట్లను అమలు చేస్తున్నాయి. అయితే 3 నెలలకు కలిపి తీసిన బిల్లును సరాసరి చేయడం వల్ల తక్కువ యూనిట్లు వాడిన వారికి లాభం  చేకూరుతుండగా, ఎక్కువ విద్యుత్‌ను వాడే వారికి స్లాబ్‌ రేటు పెరిగి ఎక్కువ మొత్తంలో  కరెంటు బిల్లు వస్తోంది. చాలా మంది వినియోగదారులు ఏ నెలకు ఆ నెల విద్యుత్‌ బిల్లులు ఇవ్వాలని కోరుతుండగా, ఇప్పటికే విద్యుత్‌ సంస్థ మాత్రం మూడు నెలలు అంటే 91, 92 రోజులకు బిల్లులను జారీ చేస్తోంది. ఈవిధానం తమకేమాత్రం అర్థం కావడం లేదంటే వినియోగదారులు విద్యుత్‌ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. కొందరు మీడియాను ఆశ్రయించి అధిక బిల్లులు వచ్చాయంటూ వాపోతున్నారు.


కరోనాతో ఆర్థిక ఇబ్బందులు.... బిల్లులు కట్టేదెలా....?

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయాం. రెండు, మూడు నెలలుగా చేతిలో సరిపడా డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అధిక మొత్తంలో వస్తున్న బిల్లులు చెల్లించేదెలా అంటూ వినియోగదారులు వాపోతున్నారు. 


సర్దుబాటుపై సందేహాలు.....

లాక్‌డౌన్‌ కారణంగా ఇంటింటికి వచ్చి మీటరింగ్‌ రీడింగ్‌ తీయలేం కాబట్టి, గతేడాది మార్చి, ఏప్రిల్‌ నెలలకు చెల్లించిన మొత్తాన్ని చెల్లించండి. తర్వాత ఇంటికి వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసి వాస్తవ బిల్లును ఇస్తాం. ఆ సమయంలో మీరు మార్చి,ఏప్రిల్‌ నెలలకు సంబంధించిన చెల్లించన బిల్లును తాజా బిల్లులులో సర్దుబాటు చేస్తామని అధికారులు చెప్పారు. అయితే  ఈనెల 2వతేదీ నుంచి ప్రారంభమైన బిల్లుల జారీలో  చూస్తే సర్దు బాటుపై చాలా మంది విద్యుత్‌ వినియోగదారులు సందేహాలు వ్యక్తం చేశారు. సర్దుబాటు సరిగా చేయడం లేదు. తాము బిల్లులు చెల్లించినా ఆ విషయం కొత్తగా జారీ చేసిన బిల్లుల్లో కనిపించడం లేదంటూ కొందరు వాపోతున్నారు. 

Updated Date - 2020-06-06T10:58:52+05:30 IST