Abn logo
Mar 30 2021 @ 07:49AM

పేరులోనే ‘మణి’... దోచుకోవడమే వారి పని!

 - ముగ్గురు మంత్రుల తీరుపై స్టాలిన్‌ ధ్వజం 

 - జోలార్‌పేటలో విస్తృత ప్రచారం


చెన్నై: ముగ్గురు మంత్రుల పేర్లలో ‘మణి’ ఉందని, దోచుకోవడమే వారి పని అని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ధ్వజమెత్తారు. డీఎంకేకు చెందిన జోలార్‌పేట అభ్యర్థి దేవరాజి, తిరుపత్తూర్‌ అభ్యర్థి నల్లతంబి, అంబూరు అభ్యర్థి విశ్వనాథన్‌, వాణియంబాడి ఐయూఎంఎల్‌ అభ్యర్థి మహమ్మద్‌ నయీమ్‌కు మద్దతుగా జోలార్‌పేటలో సోమవారం స్టాలిన్‌ ప్రచారం చేపట్టారు. డీఎంకే అభ్యర్థులకు ‘ఉదయించే సూర్యుడు’, మహమ్మద్‌ నయీమ్‌కు ‘నిచ్చెన’ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలకు స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పళనిస్వామి మంత్రివర్గంలో వీరమణి, తంగమణి, వేలుమణి అనే ముగ్గురు మంత్రులు వున్నారని, ముగ్గురు మంత్రులు చివరన ‘మణి’ అని పేరు వుందని, కానీ వారికి దోచుకోవడమే పని అని మండిపడ్డారు. మంత్రి వీరమణి వ్యవహారం జిల్లా ప్రజలకు తెలిసిందేనని అన్నారు. నాలుగేళ్ల క్రితం వీరమణి, ఆయన మద్దతుదారుల ఇళ్లపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారని, కానీ, ఇప్పటివరకు ఆ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. జయ మృతి అనంతరం కేంద్రప్రభుత్వం పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి బినామీదారుల ఇళ్లపై దాడులు నిర్వహించి, పలు కీలక దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారన్నారు. ఇలా దాడులు చేయించిన బీజేపీ.. మంత్రులందర్నీ తన గుప్పెట్లో ఉంచుకుందని ఆరోపించారు. మైనార్టీలకు అండగా అన్నాడీఎంకే ప్రభుత్వం ఉందని చెబుతున్నారని, కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి రద్దు, ముత్తలాక్‌ చట్టం, పౌరసత్వ చట్టం అమలుకు అన్నాడీఎంకే ఎంపీలు కేంద్రానికి మద్దతుగా నిలిచారని గుర్తుచేశారు. ప్రస్తుతం అన్నాడీఎంకే, పీఎంకే ఎంపీలు కేంద్రప్రభుత్వం అమలుచేసే అన్ని చట్టాలకు మద్దతు తెలుపుతున్నారనే విషయం ప్రజలు గుర్తించాలన్నారు. డీఎంకే అధికారం చేపడితే రాష్ట్రంలో సీఏఏ చట్టం అమలును అడ్డుకోవడంతో పాటు మైనార్టీ వర్గాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. 

Advertisement
Advertisement