ముస్లిం వ్యక్తిపై దాడి కేసులో ముగ్గురికి బెయిల్.. మరో ముగ్గురు..!

ABN , First Publish Date - 2021-08-14T06:59:07+05:30 IST

ముస్లిం ఆటో డ్రైవర్‌పై దాడి చేసిన కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులకు బెయిల్ లభించింది. ప్రస్తుతం ముగ్గురు బెయిల్‌పై..

ముస్లిం వ్యక్తిపై దాడి కేసులో ముగ్గురికి బెయిల్.. మరో ముగ్గురు..!

లక్నో: ముస్లిం ఆటో డ్రైవర్‌పై దాడి చేసిన కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులకు బెయిల్ లభించింది. ప్రస్తుతం ముగ్గురు బెయిల్‌పై బయటకొచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్‌పూర్‌లో ఆటో రిక్షా డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఓ వ్యక్తిని కొందరు హిందూ వర్గానికి చెందిన వారు విచక్షణారహితంగా దాడి చేసిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కేసులో అజయ్ రాజేశ్, అమన్ గుప్తా, రాహుల్ కుమార్ అనే ముగ్గురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అయితే ఈ రోజు(శుక్రవారం) వారిని బెయిల్‌పై విడిచిపెట్టారు. అయితే ఇదే కేసులో మరో ముగ్గురిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.


వివాదం ఏంటి..?

అతడిపై దాడి చేసిన వారు చెప్పిన వివరాల ప్రకారం.. ఓ హిందూ యువతిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చబోతున్నందునే దాడి చేశామని చెబుతున్నారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. దాడికి గురైన వ్యక్తి బంధువులకు, వారి ఇంటిపక్కనే ఉండే హిందూ కుటుంబానికి కొద్ది కాలంగా న్యాయపరమైన వివాదం నడుస్తోంది. ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. హిందూ కుటుంబం తమపై దాడి చేసిందంటూ ముస్లిం కుటుంబం క్రిమినల్ కేసు పెట్టగా.. ముస్లిం కుటుంబం తమపై దాడి చేయడమే కాకుండా ఓ మహిళ ఆత్మగౌరవానికి భంగం కలిగించేందుకూ ప్రయత్నించారని ఆరోపిస్తూ కేసు పెట్టారు. ఈ క్రమంలోనే భజరంగ్ దళ్ తల దూర్చడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.


కాగా.. ఈ దాడికి కొద్ది సేపటి ముందు ఘటన జరిగిన ప్రాంతానికి అరకిలోమీటరు దూరంలో భజరంగ్ దళ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. హిందూ యువతులను ముస్లింలు బలవంతంగా మతమార్పిడులు చేస్తున్నారంటూ ఆ మీటింగ్‌లో చర్చించినట్లు సమాచారం. అనంతరం ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడి సమయంలో నిందితులు ‘జై శ్రీరాం’ నినాదాలు చేయడంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది.

Updated Date - 2021-08-14T06:59:07+05:30 IST