కూలి కోసం వచ్చి.. అనంతలో ముగ్గురు మహారాష్ట్ర కూలీల మృతి

ABN , First Publish Date - 2022-08-19T08:30:40+05:30 IST

మహారాష్ట్ర నుంచి అనంతపురం జిల్లాలో కూలి పనుల కోసం వచ్చిన ముగ్గురు వ్యక్తులు మద్యం మహమ్మారికి బలయ్యారు.

కూలి కోసం వచ్చి.. అనంతలో ముగ్గురు మహారాష్ట్ర కూలీల మృతి

  • మద్యంలో తంబాకు మిశ్రమం కలిపి తాగినట్లు అనుమానం
  • అక్కడికక్కడే ఒకరు.. ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు మృతి

అనంతపురం క్రైం, ఆగస్టు 18: మహారాష్ట్ర నుంచి అనంతపురం జిల్లాలో కూలి పనుల కోసం వచ్చిన ముగ్గురు వ్యక్తులు మద్యం మహమ్మారికి బలయ్యారు. అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఈ ముగ్గురూ.. కిక్కు కోసం మద్యంలో తంబాకు మిశ్రమం కలిపి తాగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతపురం రూరల్‌ మండలం ఆలమూరు సమీపంలోని గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. మద్యంలో తంబాకు మిశ్రమం కలిపి అతిగా సేవించడం వల్లే వారు మృతిచెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఆలమూరులో ద్రాక్ష తోటల్లో పనిచేసేందుకు మహారాష్ట్ర నుంచి కూలీలు వస్తుంటారు. ఆలమూరు వాసి పలమాసి రాజుకు చెందిన ద్రాక్షతోటలో పనిచేసేందుకు మహారాష్ట్రలోని సౌలాజి ప్రాంతానికి చెందిన భరత్‌ నామ్‌దేవ్‌ చౌహన్‌ (43), దీపక్‌  జైసింగ్‌ శిరితోడే (45), సదా (40) వచ్చారు. 


ఈ ముగ్గురు బుధవారం రాత్రి మద్యం సేవించినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం 9.30 గంటలకు యజమాని రాజు.. తోటలో నూతనంగా నిర్మిస్తున్న భవనంలోకి వెళ్లి చూసేసరికి ముగ్గురూ పడుకుని ఉన్నారు. మధ్యాహ్నం మరోసారి చూసినా అదే స్థితిలో ఉండటంతో అనుమానం వచ్చి దగ్గరికి వెళ్లి పరిశీలించగా అప్పటికే భరత్‌ నామ్‌దేవ్‌ చౌహన్‌ మృతి చెంది ఉన్నాడు. కొన ఊపిరితో ఉన్న మిగిలిన ఇద్దరిని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసుల సహకారంతో వారిని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీపక్‌ జైసింగ్‌ ‘తినాలని ఉంది’ అంటుండగా ప్రాణం పోయినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. సదాకు చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. సంఘటనా స్థలంలో దేశీదారు పేరుతో ఉన్న 10 మద్యం బాటిళ్లు, తంబాకు, సున్నం, పాన్‌ మసాలా ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు. మద్యంతో పాటు సున్నం, తంబాకు మిశ్రమం చేసి తాగి ఉంటారని భావిస్తున్నామని ఇన్‌చార్జ్‌ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత శరీరంలో ఏముందనేని తెలుస్తుందని అన్నారు. 


అక్కడి నుంచే మద్యం..

మృతిచెందిన వారిలో భరత్‌ నామ్‌దేవ్‌ చౌహన్‌ ఈ నెల 10న స్వస్థలానికి వెళ్లగా మిగిలిన ఇద్దరూ ఇక్కడే ఉన్నారు. భరత్‌ అక్కడ కుటుంబసభ్యులకు డబ్బులు అందజేసి, ఈ నెల 15న తిరిగి వచ్చాడు. ఆ సమయంలో అక్కడ దొరికే మద్యం బాటిళ్లు, తంబాకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన ‘దేశీదారు’ అనే బ్రాండ్‌ మద్యం సేవించినట్లు అక్కడ దొరికిన ఖాళీ బాటిళ్లను బట్టి తెలుస్తోంది. ఆ బాటిల్‌ (90 ఎంఎల్‌) ఖరీదు రూ.35గా ఉంది. కూలీలు కిక్కు కోసం మద్యంతో పాటు మరికొన్ని మిశ్రమాలు తాగుతారని తెలుస్తోంది. ఘటనా స్థలంలో దొరికిన పాన్‌ మసాలా ప్యాకెట్లు దీనికి బలాన్ని మరింత చేకూరుస్తున్నాయి. దీంతోపాటు తంబాకు మిశ్రమం తీసుకోవడంతో వారు ప్రాణాలు పోయినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. అక్కడే సాల్వెంట్‌ పేరుతో ఉన్న ఒక బాటిల్‌లోని (శానిటైజర్‌ తరహా) ద్రావణాన్ని కూడా కలుపుకుని తాగారా...? అదే ఎక్కువ ప్రభావం చూపిందా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-08-19T08:30:40+05:30 IST