ప్రమాదాల్లో ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2021-05-17T05:36:09+05:30 IST

ప్రమాదాల్లో ముగ్గురి మృతి

ప్రమాదాల్లో ముగ్గురి మృతి
చరణ్‌ మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ

  • విద్యుదాఘాతంతో యువకుడి మృతి

షాద్‌నగర్‌ రూరల్‌: కమ్మదనంలో ఆదివారం సాయంత్రం ఓ యువకుడు విద్యుదాఘాతంతో మృతిచెందగా మరో యువకుడు గాయపడ్డాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కమ్మదనం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌(28), మల్లేష్‌(27) అనే యువకులు హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్‌ కంపెనీలో బస్‌ డ్రైౖవర్లుగా పనిచేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4గంటల సమయంలో గ్రామ సమీపంలోని నీటి సంపు వద్ద బస్సును కడిగేందుకు తీసుకెళ్లారు. శ్రీకాంత్‌ బస్సు లోపల కడుగుతుండగా మల్లేష్‌ టాప్‌పై కడుగుతున్నాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ యువకుడు రోడ్డుపై వెళ్తూ టాప్‌పై ఉన్న మల్లేష్‌కు హలో అని పలకరించగా.. బదులుగా మల్లేశ్‌ చెయ్యి పైకెత్తడంతో పైనే విద్యుత్‌ ఉన్న తీగలకు తగిలి మల్లేష్‌ కరెంట్‌ షాక్‌తో కింద పడ్డాడు. షాక్‌తో బస్సులోపల ఉన్న శ్రీకాంత్‌ మృతిచెందాడు. గాయాలైన మల్లేష్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సర్పంచ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


  • పంప్‌హౌజ్‌లో పడి ఆపరేటర్‌ ...


ఆమనగల్లు: మిషన్‌ భగీరథ పంప్‌హౌజ్‌లో పడి ఆపరేటర్‌ మృతిచెందిన సంఘటన ఆదివారం సాయంత్రం ఆమనగల్లు మండలం అయ్యసాగర్‌ వద్ద చోటు చేసుకుంది. ఎస్సై ధర్మేష్‌ తెలిపిన వివరాల ప్రకారం... అయ్యసాగర్‌ మిషన్‌  భగీరథ ప్లాంట్‌లో ఆంధ్రపద్రేశ్‌ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా ఐపోలవరానికి చెందిన వి.వీరబాబు(23) అనే యువకుడు ఎలక్ర్టికల్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ప్లాంట్‌లోని పంప్‌హౌజ్‌ మెట్ల వద్ద అతడు ఫోన్‌ మాట్లాడుతూ వెళ్తుండగా ఫోన్‌ పంప్‌హౌజ్‌లో పడింది. ఫోన్‌ తీసుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు వీరబాబు పంప్‌హౌజ్‌లో పడిపోయాడు. గమనించిన తోటి ఉద్యోగులు పంపులను ఆపేసి వీరబాబును బయటికి తీశారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ వెంటనే ప్లాంట్‌ వద్దకు చేరుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వీరబాబును చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరబాబును పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు.


  • గండిపేట చెరువులో మునిగి యువకుడు ...


మొయినాబాద్‌ రూరల్‌: గండిపేట చెరువులో ప్రమాదవశాత్తు మునిగి ఓ యువకుడు మృతిచెందాడు. సీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని అల్వాల్‌ ప్రాంతానికి చెందిన విష్ణు, తన స్నేహితులు రామకృష్ణ, విజయ్‌కుమార్‌, ఫకీరప్ప, రమేష్‌, రాజమహేంద్రవరపు చరణ్‌(22) కలిసి శనివారం హిమాయత్‌నగర్‌ సమీపంలోని గండిపేట చెరువు ఒడ్డున మద్యం తాగారు. అనంతరం రామకృష్ణ, చరణ్‌ చెరువులోకి దిగారు. రామకృష్ణ తిరిగి వచ్చి చరణ్‌ రాకపోవడంతో మిగతా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం సాయంత్రం ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ రాజు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీయించి పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం వద్ద చరణ్‌ కుటుంబీకులు రోదించారు. ఎస్సై నారాయణసింగ్‌, నాయకులు పరిస్థితి పర్యవేక్షించారు.

Updated Date - 2021-05-17T05:36:09+05:30 IST