వలస బతుకుల్లో మృత్యుకేక!

ABN , First Publish Date - 2020-10-25T06:42:13+05:30 IST

పొట్ట కూటి కోసం వారంతా ఊరుగాని ఊరొచ్చారు. ఓ రైసుమిల్లులో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

వలస బతుకుల్లో మృత్యుకేక!

వేగంగా బైక్‌ను, లారీని ఢీకొన్న కారు

ముగ్గురు మృతి.. ఐదుగురికి తీవ్రగాయాలు

తడ మండలం పూడి వద్ద ఘటన


తడ, అక్టోబర్‌ 24 : పొట్ట కూటి కోసం వారంతా ఊరుగాని ఊరొచ్చారు. ఓ రైసుమిల్లులో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రెక్కలకష్టాన్నే నమ్ముకు వలస పక్షులపై మృత్యువుకు కన్నుకుట్టింది. వైద్యం కోసం వెళ్లిన వారిని కారు రూపంలో తిరిగిరాని లోకానికి చేర్చింది. తడ మండలం పూడి జాతీయరహదారి వద్ద శుక్రవారం అర్ధరాత్రి తర్వాత వేగంగా వెళ్తున్న కారు బైక్‌ను, లారీని ఢీకొనడంతో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నగర పరిధిలోని 4వ మైలు మైపాడ్‌ గేటు వద్ద ఉన్న ఓ రైసు మిల్లులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంతమంది కూలీలుగా పని చేస్తున్నారు. వారిలో జమ్ము వెంకన్న, జమ్ము అపర్ణమ్మ, కొత్తకోట వెంకటేశ్వర్లు, కొత్తకోట సరళ దంపతులు. జమ్ము వెంకన్న కుమార్తె ఢిల్లీశ్వరికి, కొత్తకోట సరళకు కొంత అనారోగ్యంగా ఉండటంతో చెన్నైలో చికిత్స చేయించుకొనేందుకు శుక్రవారం ఉదయం రెండు కుటంబాలకు చెందిన ఐదుగురు కారులో బయలుదేరి వెళ్లారు. అక్కడ పని ముగించుకుని అదేరోజు రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు.


మార్గమధ్యంలో తడ మండలం పూడి జాతీయ రహదారి మలుపు వద్ద కారు వేగంగా వస్తుండగా, పూడి గ్రామానికి చెందిన మారి, తలారి ఉదయ్‌కుమార్‌లు బైక్‌పై వెళ్తు సర్కిల్‌ వద్ద ఉన్నట్టుండి బైక్‌ను ముందుకు నడిపారు. దీంతో కారు డ్రైవ్‌ చేస్తున్న ఊటికొండ వెంకట్రావు వేగాన్ని అదుపు చేయలేక బైక్‌ను ఢీకొట్టి అక్కడే రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీని వెనుక వైపు నుంచి ఢీకొంది. దీంతో లారీ వెనుక భాగంలో కారు పూర్తిగా ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో కొత్తకోట వెంకటేశ్వర్లు (46) అక్కడిక్కడే మృతి చెందగా, మిగిలిన వారందరికి తీవ్ర గాయాలయ్యాయి.. వెంటనే వారిని సమీపంలోని శ్రీసిటీ ఆసుపత్రి, సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో జమ్ము అపర్ణమ్మ (31) మృతి చెందగా, మిగిలిన వారందరి పరిస్థితి విషమంగా ఉండటంతో  నెల్లూరు, చెన్నైలకు తరలించారు. నెల్లూరులో చికిత్స పొందుతున్న ఢిల్లీశ్వరి (13) మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, ఆర్టీవో మల్లికార్జున్‌రెడ్డి, సీఐ వేణుగోపాల్‌రెడ్డి, రవాణా శాఖ ఎంవీఐ రఫీ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  


వైద్యం కోసం వెళ్లి..

 జమ్ము వెంకన్న, అపర్ణమ్మ దంపతుల కుమార్తె ఢిల్లీశ్వరి దివ్యాంగురాలు. ఆ బాలికకు నాటు వైద్యం చేయించేందుకు నిర్ణయించుకొన్నారు. ఈ మేరకు కొత్తకోట వెంకటేశ్వర్లుకు చెన్నైలోని నాటు వైద్యుడు ఉన్నాడని తెలుసుకొని రెండు కటుంబాలు కలసి కారులో భయలుదేరి వెళ్లి తిరిగి వస్తూ ఈ ప్రమాదం భారీన పడ్డారు. దీంతో రెండు కుటంబాల్లో ఈ రోడ్డు ప్రమాదం విషాదచాయలు నింపింది. 

Updated Date - 2020-10-25T06:42:13+05:30 IST