పాక్ జట్టు విజయంపై కశ్మీరి విద్యార్థుల సంబరాలు...కళాశాల నుంచి ముగ్గురి suspended

ABN , First Publish Date - 2021-10-27T12:57:19+05:30 IST

టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు విజయంపై సంబరాలు చేసుకున్న ముగ్గురు కశ్మీరీ విద్యార్థులను కళాశాల నుంచి సస్పెండ్ చేసిన ఘటన...

పాక్ జట్టు విజయంపై కశ్మీరి విద్యార్థుల సంబరాలు...కళాశాల నుంచి ముగ్గురి suspended

ఆగ్రా (ఉత్తరప్రదేశ్): టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు విజయంపై సంబరాలు చేసుకున్న ముగ్గురు కశ్మీరీ విద్యార్థులను కళాశాల నుంచి సస్పెండ్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది. ఆగ్రాలోని రాజా బల్వంత్ సింగ్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ముగ్గురు కాశ్మీరీ విద్యార్థులుఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్‌పై పాక్ విజయం సాధించినందుకు సంబరాలు చేసుకున్నారు. ముగ్గురు విద్యార్థులపై ఆగ్రా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురూ పాకిస్థాన్ అనుకూల నినాదాలు కూడా చేశారని హిందూ సంస్థల సభ్యులు ఆరోపించారు.ఈ వేడుకకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే కళాశాల నిర్వాహకులు ముగ్గురు విద్యార్థులను కళాశాల నుంచి సస్పెండ్ చేశారు. 


విద్యార్థులపై ఆగ్రాలోని జగదీష్‌పురా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.పాక్ విజయంపై సంబరాలు చేసుకున్న ముగ్గురు కశ్మీరీ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థలు, బీజేపీ నేతలు కాలేజీ క్యాంపస్ కు వచ్చి నినాదాలు చేశారు. ముగ్గురు విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు జగదీష్‌పురా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ప్రవీణ్ కుమార్ సింగ్ తెలిపారు. అయితే ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విద్యార్థులను దేశం నుంచి బహిష్కరించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.మూడో సంవత్సరం సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి అర్షద్ యూసుఫ్, నాలుగో సంవత్సరం విద్యార్థులు ఇనాయత్ అల్తాఫ్ షేక్, షౌకత్ అహ్మద్ గనాయ్‌లను సస్పెండ్ చేసినట్లు ఆర్‌బీఎస్ ఇంజినీరింగ్ డీన్ దుష్యంత్ సింగ్ తెలిపారు. 


హాస్టల్ కమిటీ కూడా ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. విచారణ కమిటీ తన నివేదికను సమర్పించిన తర్వాత ఈ వ్యవహారంపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు.అఫ్జల్, కసబ్ లాంటి ఉగ్రవాదులను కూడా ఆరాధించే విద్యార్థులను దేశం నుంచి తరిమి కొట్టాలని బీజేపీ బ్రజ్ క్షేత్ర యువమోర్చా కార్యదర్శి గౌరవ్ రజావత్ డిమాండ్ చేశారు. భారత్‌లో ఉంటూ పాకిస్థాన్‌పై ప్రేమ చూపే వారిని అస్సలు సహించబోమన్నారు. ఆ సంస్థ నగర అధ్యక్షుడు శైలూ పండిత్‌ మాట్లాడుతూ పాకిస్థాన్‌కు మద్ధతు ఇచ్చే వారు దేశ వ్యతిరేకులని, వారిపై యూఏపీఏ కింద కేసులు నమోదు చేయాలని సూచించారు.



Updated Date - 2021-10-27T12:57:19+05:30 IST