West Bengal Police: కరెన్సీ బస్తాలతో పట్టుబడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2022-07-31T19:05:28+05:30 IST

జార్ఖండ్ (Jharkhand)కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారీ నగదు

West Bengal Police: కరెన్సీ బస్తాలతో పట్టుబడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

కోల్‌కతా : జార్ఖండ్ (Jharkhand)కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారీ నగదు కట్టలతో పశ్చిమ బెంగాల్ పోలీసులకు పట్టుబడ్డారు. హౌరా జిల్లాలో శనివారం ఈ సంఘటన జరిగింది. జార్ఖండ్‌లోని జేఎంఎం, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. గిరిజనులకు బహుమతులు కొనడానికి వెళ్ళారని ఓ ఎమ్మెల్యేల సోదరుడు చెప్తున్నారు. ఈ మొత్తం సంఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలని టీఎంసీ డిమాండ్ చేస్తోంది. 


పశ్చిమ బెంగాల్ పోలీసులు (West Bengal Police) తెలిపిన వివరాల ప్రకారం, ముగ్గురు జార్ఖండ్ (Jharkhand) Congress ఎమ్మెల్యేలు - ఇర్ఫాన్ అన్సారీ (జమ్‌‌‌తారా), రాజేశ్ కచ్చప్ (ఖిజ్రి), నామన్ బిక్సల్ కొంగరి ( కొలెబిర) - ప్రయాణిస్తున్న కారులో భారీగా నగదు ఉందని సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హౌరా (Howrah) జిల్లాలోని 16వ నెంబరు  జాతీయ రహదారిపై రాణిహటి వద్ద తనిఖీలు నిర్వహించారు. పెద్ద ఎత్తున నగదు కనిపించడంతో, ఆ నగదును స్వాధీనం చేసుకుని, ముగ్గుర్నీ అరెస్టు చేశారు. 


జార్ఖండ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర : కాంగ్రెస్

ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడంతో  ఆ పార్టీ ఘాటుగా స్పందించింది. జార్ఖండ్‌లోని జేఎంఎం, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించింది. ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు జరుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ ఠాకూర్ (Rajesh Thakur) ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ప్రభుత్వాలను కూల్చేందుకు అస్సాం (Assam) ప్రధాన కార్యక్షేత్రంగా మారిందనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. 15 రోజులపాటు నాటకీయ పరిణామాల తర్వాత మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం కూలిపోయిందన్నారు. జార్ఖండ్ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు కుట్ర జరుగుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. రాబోయే రోజుల్లో అన్ని విషయాలు స్పష్టమవుతాయన్నారు. డబ్బుతో పట్టుబడిన ఎమ్మెల్యేల విషయంలో దర్యాప్తు పూర్తయ్యే వరకు మాట్లాడటం సమంజసం కాదన్నారు. కానీ దేశంలో పరిస్థితిని చూసినపుడు, పట్టుబడిన ఈ ఎమ్మెల్యేలే ఈ విషయాన్ని బాగా వివరించగలరని చెప్పారు. అయితే ఈ సంఘటన చాలా బాధాకరమని తెలిపారు. తమ పార్టీ అధిష్ఠానానికి ఓ నివేదికను సమర్పిస్తామని చెప్పారు. ఈ సంఘటనలో ప్రమేయం ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోమని తెలిపారు. 


జార్ఖండ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు టిర్కే ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, తమది కాని ప్రభుత్వాన్ని అస్థిరపరచడం బీజేపీ స్వభావమని ఆరోపించారు. అదే ప్రయత్నం ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతోందన్నారు. ప్రభుత్వాన్ని కూల్చడానికే ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చిందన్నారు. 


కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ (Jairam Ramesh) ఇచ్చిన ట్వీట్‌లో, బీజేపీ జార్ఖండ్‌లో చేపట్టిన ‘ఆపరేషన్ కమలం’ (Operation Lotus)  హౌరాలో బయటపడిందన్నారు. ఢిల్లీలోని ‘మేమిద్దరం’ గేమ్ ప్లాన్ మహారాష్ట్రలో ఈ-డీ ద్వయాన్ని వినియోగించి చేసినదానిని జార్ఖండ్‌లో చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. 


మహారాష్ట్రలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శివసేన, ఎన్‌సీపీ నేతలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. చివరికి శివసేనలో చీలిక వచ్చి, ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని ఎమ్మెల్యేలు, బీజేపీ కలిసి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 


గిరిజనులకు బహుమతులిచ్చేందుకే...

ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ సోదరుడు ఇమ్రాన్ మాట్లాడుతూ, తన సోదరుడిని అక్రమంగా ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతి సంవత్సరం గిరిజనులకు బహుమతులు ఇస్తూ ఉంటామని, అదే విధంగా ఈ సంవత్సరం కూడా కోల్‌కతా బడా బజార్‌కు వెళ్ళారని చెప్పారు. బడా బజార్‌లో చీరలు కొని, గిరిజనులకు పంపిణీ చేయడం తన సోదరునికి అలవాటని చెప్పారు. వీరివద్ద పట్టుబడిన సొమ్ము రూ.కోట్లలో ఏమీ లేదన్నారు. తాను ఉదయం నుంచి వారిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నానని, తనకు అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. 


కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలి : బీజేపీ

ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వచ్చిందో వివరణ ఇవ్వాలని జార్ఖండ్ బీజేపీ చీఫ్ దీపక్ ప్రకాశ్ ఈ ఎమ్మెల్యేలను డిమాండ్ చేశారు. జార్ఖండ్‌లోని గొడ్డ నిజయోజకవర్గం ఎంపీ నిశికాంత్ దూబే  (బీజేపీ) మాట్లాడుతూ, ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి నగదును స్వాధీనం చేసుకున్న సంఘటనపై సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖల చేత దర్యాప్తు చేయించాలన్నారు. తనకు తెలిసినంత వరకు  కాంగ్రెస్‌ను ముక్కలు చేయాలని ప్రస్తుత జార్ఖండ్ ప్రభుత్వం కుట్ర పన్నినట్లు భావిస్తున్నానని తెలిపారు. జార్ఖండ్‌లో టెండర్లను మేనేజ్ చేయడం కోసం ఈ సొమ్మును ఇచ్చి ఉంటారన్నారు. 


క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలి : టీఎంసీ

ఈ ఎమ్మెల్యేలకు ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలని పశ్చిమ బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత శశి పంజా డిమాండ్ చేశారు. జార్ఖండ్‌లోని జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చేయడం కోసం బేరసారాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ నగదు పట్టుబడిందని టీఎంసీ ఓ ట్వీట్‌లో గుర్తు చేసింది. 


Updated Date - 2022-07-31T19:05:28+05:30 IST