హ్యూస్ట‌న్‌లో క‌రోనా బారిన‌ప‌డ్డ ముగ్గురు భార‌తీయులు.. ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం...

ABN , First Publish Date - 2020-04-03T18:59:02+05:30 IST

అమెరికాలో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ మ‌ర‌ణ మృదంగం మోగిస్తోంది.

హ్యూస్ట‌న్‌లో క‌రోనా బారిన‌ప‌డ్డ ముగ్గురు భార‌తీయులు.. ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం...

హ్యూస్ట‌న్: అమెరికాలో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ మ‌ర‌ణ మృదంగం మోగిస్తోంది. అగ్ర‌రాజ్యంలో ఇప్ప‌టివ‌ర‌కు కొవిడ్‌-19 బారిన ప‌డిన వారి సంఖ్య 2,45,373గా ఉంది. 6,095 మందిని ఈ మ‌హ‌మ్మారి పొట్ట‌న‌బెట్టుకుంది. ఒక్క న్యూయార్క్ న‌గ‌రంలోనే 93,053 మంది బాధితులు ఉండ‌గా, 2,538 మంది మర‌ణించారు. రోజురోజుకీ విజృంభిస్తున్న క‌రోనా అమెరికాను పూర్తిగా క‌మ్మేసింది. రాబోయే రోజుల్లో అగ్ర‌రాజ్యంలో భారీ సంఖ్య‌లో మ‌ర‌ణాలు న‌మోదు కానున్నాయ‌ని ఇప్ప‌టికే వైద్య నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 


ఇదిలాఉంటే టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్ట‌న్‌లో ఉండే ముగ్గురు భార‌త సంత‌తి వ్య‌క్తులు క‌రోనా బారినప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంది. బాధితుల్లో ఒక‌రు ఐటీ నిపుణుడు, మ‌రొక‌రు వైద్యుడు ఉన్నారు. రోహన్ బావాడేకర్(ఐటీ నిపుణుడు), లవంగ వేలుస్వామి(వైద్యుడు)ల‌కు వెంట‌నే... రెండు వారాల క్రితం కొవిడ్‌-19 బారిన‌ప‌డి కోలుకున్న వారి నుంచి ర‌క్తం అవ‌స‌రం ఉంద‌ని ఇరువురి కుటుంబ స‌భ్యులు తెలిపారు. రోహన్ ఇటీవ‌ల బిజినెస్ ప‌ని మీదా వేరే ప్రాంతానికి వెళ్ల‌గా క‌రోనా సోకింది. ఇత‌నికి 'A' లేదా 'AB' గ్రూపు రక్తం కావాలి. రోహన్ ద్వారా అత‌ని భార్య మాన‌సి, ముగ్గురు పిల్ల‌లకు కూడా ఈ మ‌హ‌మ్మారి సోకగా, ప్ర‌స్తుతం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నారు.


ఇక వేలుస్వామి భార్య ర‌మ‌(ఫిజిషియ‌న్‌) త‌న భ‌ర్త‌కు 'A' లేదా 'AB' గ్రూపు రక్తం కావాలని, ఎవ‌రైనా దాత‌లు ద‌య‌త‌లిస్తే త‌న భ‌ర్త బ‌త‌కుతాడ‌ని సహాయం చేయాలంటూ వేడుకుంటోంది. మూడో రోగికి ప్లాస్మా మార్పిడి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వైద్యులు తెలిపారు. ప్ర‌స్తుతం ఈ రోగికి మెమోరియల్ హర్మన్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు వారాల ముందు క‌రోనా బారిన‌ప‌డి కోలుకున్న వారు ఈ ముగ్గురికి ర‌క్త‌దానం చేస్తే బ‌తికే చాన్స్ ఉంద‌ని సెయింట్ లూక్స్ మరియు మెమోరియల్ హర్మన్ ఆస్ప‌త్రి వైద్యులు వెల్ల‌డించారు. దీంతో ఈ ముగ్గురు ఎన్నారైలు ఇప్పుడు వారికి స‌రిపోయే బ్ల‌డ్ గ్రూపు ర‌క్త దాత‌ల కోసం ఎదురుచూస్తున్నారు. వీరి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో వెంట‌నే దాత‌లు స్పందించి ర‌క్త దానం చేస్తే బ‌తికే అవ‌కాశం ఉంద‌ని కుటుంబ స‌భ్యులు పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-03T18:59:02+05:30 IST