Chitrajyothy Logo
Advertisement

హీరోలు ముగ్గురు... చేతిలో పదహారు!

twitter-iconwatsapp-iconfb-icon

కరోనా.. లాక్‌ డౌన్‌... ఈ రెండు పదాలు ప్రపంచాన్ని ఎంతగా వణికించాయో... అంతకంటే ఎక్కువగా చిత్రసీమని భయపెట్టాయి. థియేటర్లు మూతబడ్డాయి. షూటింగులు ఆగిపోయాయి. పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త సద్దుమణుగుతున్నా, ఇది వరకటి మెరుపుల్లేవు. ఇక మీదట చిత్ర సీమ మరింత నెమ్మదిస్తుందని, నిర్మాతలు పెద్ద సినిమాలు తీయడానికి అస్సలు సాహసించరని ట్రేడ్‌ పండితులు జోస్యం చెప్పారు. కానీ అదేం విచిత్రమో... టాలీవుడ్‌లో ఇదివరకెప్పుడూ లేని స్పీడు కనిపిస్తోంది. స్టార్‌ హీరోలు ఇదివరకటి కంటే వేగంగా సినిమాలు చేస్తున్నారు. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే, మరో రెండు మూడు కథలకు ఓకే చెప్పి, వాటినీ సమాంతరంగా పట్టాలెక్కించేందుకు అగ్ర కథానాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు. లాక్‌ డౌన్‌ తరవాత.. ఇలాంటి స్పీడు చూడడం కాస్త వింతగానే ఉంది.


ముఖ్యంగా చిరంజీవి, ప్రభాస్‌, రవితేజ చేతిలోనే ఏకంగా 16 సినిమాలున్నాయి. సినిమాల్ని ఒప్పుకోవడంలో ఈ ముగ్గురి పంథా వేరు. ‘ఒకదాని తరవాత మరోటి’ అనే చందాన కథల్ని ఒప్పుకునే ఈ హీరోలు ఒకేసారి రెండు మూడు సినిమాల్ని సెట్స్‌పైకి తీసుకెళ్లడం, అవి చిత్రీకరణ దశలో ఉండగానే మరిన్ని కథలు సిద్ధం చేసుకోవడం మార్కెట్‌ వర్గాలకు మరింత ఉత్సాహాన్ని అందిస్తున్నాయి.


చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్‌ దాదాపుగా పూర్తయ్యింది. 2022 ఫిబ్రవరి 4న ఈ చిత్రం విడుదల కానుంది. ‘ఆచార్య’ పనులు ఇంకా మిగిలి ఉండగానే, ‘గాడ్‌ ఫాదర్‌’కి కొబ్బరికాయ కొట్టారు చిరు. ఇటీవలే ‘భోళా శంకర్‌’ పనులూ మొదలయ్యాయి. రెండ్రోజుల క్రితమే బాబి సినిమాకి క్లాప్‌ కొట్టారు. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయో తెలీదు. అయితే వీటిమధ్య మారుతి ఓ కథ వినిపించాడని టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. మారుతి కూడా ‘చిరంజీవిగారితో ఓ సినిమా ఉంటుంది. ఇప్పటికే లైన్‌ వినిపించేశా. పూర్తి స్థాయి కథని సిద్ధం చేయాలి’ అని చెప్పేశారు. మరోవైపు త్రివిక్రమ్‌ సైతం చిరుతో సినిమా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడని సమాచారం అందుతోంది. అంటే.. చిరు చేతిలో అరడజను ప్రాజెక్టులు ఉన్నాయన్నమాట.


తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత స్పీడులో సాగుతోంది రవితేజ బండి. ఆయన నటించిన ‘ఖిలాడి’ రిలీజ్‌ కి రెడీ అయ్యింది. ‘ధమాకా’, ‘టైగర్‌ నాగేశ్వరరావు’, ‘రావణాసుర’, ‘రామారావు ఆన్‌ డ్యూటీ’... ఇదీ రవితేజ లైనప్‌. ఈమధ్యన ఇంకెన్ని కొత్త కథల్ని ఒప్పుకుంటారో..?  కొంతకాలంగా రవితేజ ఖాతాలో పెద్దగా హిట్లేమీ పడలేదు. అయితే ఈ యేడాది ‘క్రాక్‌’తో ఫామ్‌లోకి వచ్చారాయన. అప్పటి నుంచీ... ఈ బండికి అడ్డు లేకుండా పోతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా... కొత్త సినిమాలు ఒప్పుకోవడమే కాదు, సినిమా సినిమాకీ ఆయన పారితోషికం పెరుగుతూనే ఉందన్నది ట్రేడ్‌ వర్గాల టాక్‌.


ఇక ప్రభాస్‌ సంగతి చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్‌ ‘ఊ..’ అంటే చాలు, అడ్వాన్స్‌ చేతిలో పెట్టేద్దామని ఎదురు చూస్తున్నారు నిర్మాతలు. ప్రభాస్‌ రెడీ అంటే... అగ్ర దర్శకులు సైతం క్యూ కట్టేస్తారు. ఎందుకంటే ప్రభాస్‌ స్టార్‌ డమ్‌ అలా వుంది. భారతదేశంలోనే అత్యంత క్రేజీ స్టార్‌గా ప్రభాస్‌ అవతరించేశాడు. ‘రాధేశ్యామ్‌’ ఈ సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఆ తరవాత.. ‘సలార్‌’ వస్తుంది. ఈలోగా ‘ఆదిపురుష్‌’నీ పూర్తి చేయాలని చూస్తున్నాడు. నాగ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ప్రాజెక్ట్‌ కె’పై కూడా భారీ అంచనాలున్నాయి. వీటితో పాటు సందీప్‌రెడ్డి వంగాతో ‘స్పిరిట్‌’ అనే సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్‌ నుంచి ప్రభాస్‌కి మరిన్ని అవకాశాలు వస్తునాయని, కొత్త కథలు వినిపించడానికి దర్శకులు సిద్ధంగా ఉన్నా, బిజీ షెడ్యూల్‌ వల్ల ప్రభాస్‌ ఆసక్తి చూపించడం లేదని సమాచారం. 


అగ్ర కథానాయకులు బిజీగా ఉండడం పరిశ్రమకు ఎప్పుడూ మంచిదే. ఎందుకంటే... వసూళ్ల వర్షం కురిపించగల సామర్థ్యం వీరి సొంతం. బాక్సాఫీసు దగ్గర కాసుల గలగలలు వినిపిస్తుంటే, కొత్తగా చిత్రసీమలోకి అడుగుపెడుతున్న నిర్మాతలకు కొండంత మనోధైర్యం వస్తుంది. అందుకే ఈ స్పీడు ఇలానే కొనసాగాలి.. ఈ రేసులో మిగిలిన హీరోలు వచ్చి చేరిపోవాలి!

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement