ఇచ్చి పుచ్చుకోవడం మీదే మానవ సమాజం నడుస్తోంది. ఇవ్వవలసిన చోట ఇవ్వాలి. తీసుకోవలసిన చోట తీసుకోవాలి. దాచుకోవలసిన చోట దాచుకోవాలి. ‘ఎవరికి ఇవ్వాలి? ఎవరి దగ్గర తీసుకోవాలి? ఎవరి దగ్గర దాచుకోవాలి?’ అనే విషయాలను ధార్మిక కోణంలో బుద్ధుడు ఇచ్చిన సందేశాన్ని తెలిపే కథ ఇది.
పూర్వం హిమాలయ ప్రాంతంలో విశాలమైన పంట పొలాలు ఉండేవి. ఆ పొలాల మధ్య పెద్ద దేవదారు వృక్షం ఉంది. దాని మీద వందలాది చిలుకలు చేరి నివసిస్తూ ఉండేవి. ఆ చిలుకలకు ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు వృద్ధులైన తల్లితండ్రులు ఉన్నారు. చిలుకల రాజు తన సమూహంతో కలిసి ఆహారం కోసం వెళ్ళేవాడు. తిరిగి వచ్చేటప్పుడు ధాన్యం
కంకులను ముక్కున కరచి తెచ్చేవాడు. ఆ ధాన్యం గింజలను తన రెక్కలు రాని పిల్లలకు, ఎగురలేని తన ముదుసలి తల్లితండ్రులకూ పెట్టేవాడు. ఇంకా మిగిలిన గింజలను ఆహారం సంపాదించుకోలేని పక్షులకు అందిస్తూ ఉండేవాడు.
ఒక రోజు చిలుక రాజు తన పరివారాన్ని తీసుకొని, మగధ రాజ్యం సమీపానికి వెళ్ళాడు. అక్కడ బాగా పండిన వరి పొలాలను చూశాడు. తన దండును ఆ పొలంలో దించాడు. చిలుకలు కడుపు నిండా తిన్నాయి. కావలసినన్ని కంకులను నోట కరచుకొని పోయాయి. ఇలా రెండు మూడు రోజులు జరిగింది. కావలి కాసే వ్యక్తి ఈ విషయాన్ని యజమానికి చెప్పాడు. యజమాని ఆ పొలంలో ఉచ్చులు పన్నించాడు.
మరునాడు చిలుకల దండు వచ్చింది. యథాప్రకారం చిలుకల రాజు పొలంలో వాలి, ఉచ్చులో చిక్కుకున్నాడు. తన స్థితిని గమనిస్తే తోటి పక్షులు ఆకలితోనే ఉండిపోవాల్సి వస్తుందని తెలిసిన రాజు ‘‘మీరు దూరంగా వెళ్ళి వాలండి’’ అన్నాడు. పక్షులు అక్కడ వాలాయి. కడుపు నిండా తిన్నాయి.
అప్పుడు తాను ఉచ్చులో పడ్డట్టు తెలియజేసి, ‘‘మీరు ఎగిరిపోండి’ అని అరిచాడు రాజు. పక్షులన్నీ ఆకాశంలోకి లేచాయి. కావలివాడు వచ్చాడు. చిలుక రాజును పట్టుకున్నాడు. యజమాని దగ్గరకు తీసుకుపోయాడు.
యజమాని ఆ చిలుకను పట్టుకొని ‘‘ఓ చిలుకా! ధాన్యం గింజలను నీ పొట్ట నిండే వరకూ తినవచ్చు. కానీ, అత్యాశతో కంకులను కూడా ముక్కున కరచుకొని పోతున్నావు, ఎందుకని?’’ అని ప్రశ్నించాడు.
అప్పుడు ఆ చిలుక ‘‘ఋణం ఇవ్వడానికి, ఋణం తీర్చుకోవడానికి. తరగని నిధిని చేకూర్చుకోవడానికి’’ అంది.
యజమాని ఆశ్చర్యపడి - ‘‘ఎవరికి ఋణం ఇవ్వడానికి? ఎవరి ఋణం తీర్చుకోవడానికి? ఏ నిధిని సమకూర్చుకోవడానికి?’’ అని ప్రశ్నించాడు.
‘‘అయ్యా! నా నివాసంలో ముక్కుపచ్చలారని నా బిడ్డలు ఉన్నారు. వారికి ఆహారం నేనే పెట్టాలి. పిల్లలకు పెట్టడమే ఋణం ఇవ్వడం. అలాగే వృద్ధులైన తల్లితండ్రులున్నారు. వారికి పెట్టాలి. అది నేను ఋణం తీర్చుకోవడం. ఇక నా ఇరుగు పొరుగున నిస్సహాయులున్నారు. వారికి పెట్టడం వల్ల నాకు ‘పుణ్యం’ అనే నిధి చేకూరుతుంది. ఈ మూడు విధుల కోసమే మేత గింజలను తీసుకుపోతాను’’ అన్నాడు చిలుక రాజు.
ఆ మాటలకు సంతోషపడిన యజమాని - ‘‘రేపటి నుంచి నీవు నిర్భయంగా నా పొలం మీద వాలి, కావలసినన్ని గింజలను తినవచ్చు. తీసుకుపోవచ్చు’’ అని చిలుకల రాజు వెన్ను నిమిరి వదిలిపెట్టాడు.
ఈ చిన్న కథ ద్వారా బిడ్డల పట్ల, వృద్ధులైన తల్లితండ్రుల పట్ల, తోటివారి పట్ల ఎలా ఉండాలో బుద్ధుడు తెలియజేశాడు.
బొర్రా గోవర్ధన్