ప్రియుడ్ని తాళ్లతో కట్టేసి.. ప్రియురాలిపై..

ABN , First Publish Date - 2021-06-21T06:13:14+05:30 IST

ప్రియుడ్ని కట్టేసి..

ప్రియుడ్ని తాళ్లతో కట్టేసి.. ప్రియురాలిపై..

యువతిపై సామూహిక అత్యాచారం

ప్రియుడ్ని తాళ్లతో కట్టేసి యువకుల ఘాతుకం

సీతానగరం పుష్కరఘాట్ల వద్ద ప్రేమజంటపై దాడి

గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలు

దారుణానికి పాల్పడింది బ్లేడ్‌బ్యాచేనని పోలీసుల అనుమానం


తాడేపల్లి టౌన్‌: ప్రియుడ్ని కట్టేసి ప్రియురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కరఘాట్ల వద్ద శనివారం రాత్రి జరిగింది. విజయవాడ నగరానికి చెందిన ఓ ప్రేమ జంట శనివారం రాత్రి 9 గంటల సమయంలో సీతానగరం పుష్కరఘాట్ల వద్దకు వచ్చింది. నదీ తీరంలోని మెట్ల మీద కొద్దిసేపు గడిపిన తరువాత రైలు వంతెన సమీపంలో ఇసుక తిన్నెలపై నడుస్తూ వెళ్తున్నారు. వీరిని గుర్తించిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. ప్రేమజంటను బెదిరించారు. ప్రియుడిని తాళ్లతో కట్టేసి, ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నది ఒడ్డున మత్స్యకారులకు చెందిన పడవలో అవతలి వైపు వెళ్లినట్టు సమాచారం. ఆ తర్వాత తేరుకున్న బాధితులు అర్ధరాత్రి సమయంలో తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.


బాధితురాలిని పోలీసులు వైద్యపరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి పోలీసులు నది తీరంలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు తాడేపల్లి ఎస్‌ఐ వినోద్‌ తెలిపారు. బ్లేడ్‌ బ్యాచ్‌ ఈ ఘటనకు పాల్పడి ఉంటుందని  పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని ఆదివారం సాయంత్రం అర్బన్‌ అడిషనల్‌ ఎస్పీ ఈశ్వరరావు, డీఎస్పీ దుర్గాప్రసాద్‌, సీఐ శేషగిరిరావు, ఎస్‌ఐలు వినోద్‌, బాలకృష్ణతో పాటు విజయవాడ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పరిశీలించారు.


అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఘాట్లు

సీతానగరం నది పుష్కరఘాట్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఇక్కడ నిత్యం మందుబాబులకు, గంజాయి తాగే బ్లేడ్‌ బ్యాచ్‌లకు అడ్డాగా మారింది. సాయంత్రమైతే చాలు నది మెట్ల మీద బహిరంగంగానే మందుబాటిళ్లు పెట్టుకుని యువకులు జల్సా చేస్తున్నారు. విజయవాడ వైపు నుంచి వచ్చే బ్లేడ్‌ బ్యాచ్‌ గ్యాంగ్‌ రైలు వంతెనల కింద అర్ధరాత్రుల దాకా పాగా వేసి గంజాయి తాగుతూ రోడ్లమీదకు వచ్చి స్థానికులను భయభ్రాంతులకు గురి చేయడం పరిపాటిగా మారింది. నదీ తీరానికి వచ్చే ప్రేమ జంటలు, ఒంటరి వ్యక్తులపై దాడులు చేయడం, ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడం వంటివి చేస్తున్నారు. అలాగే ప్రకాశం బ్యారేజి వైపు నుంచి సీతానగరం మీదగా  మహానాడు వెళ్లే ముఠా కార్మికులను కొట్టి వారి నుంచి నగదు, ఫోన్లను లాక్కొంటున్న ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. కొద్ది నెలల క్రితం ఆగి ఉన్న గూడ్సు రైలు మహిళా గార్డుపై దాడి చేసి, నగదు, బంగారు గొలుసు దోచుకెళ్లారు. ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు లేక కృష్ణానదికి వరద వచ్చిన సమయాల్లో తప్ప ఈ నదీఘాట్లవద్ద పోలీసుల సంచారం అంతగా ఉండదు.


నిందితుల కోసం ప్రత్యేక బృందాలు : అర్బన్‌ ఎస్పీ  

గుంటూరు: కృష్ణానది పుష్కరఘాట్‌ వద్ద యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ తెలిపారు. నిందితులను గుర్తించేందుకు పోలీసు బృందాలు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నాయన్నారు. నిందితులు బ్లేడ్‌ బ్యాచ్‌గా వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ నిందితులను పట్టుకుంటేకానీ ఎవరనేది చెప్పలేమన్నారు. నిందితులకు సంబంధించిన ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. 

Updated Date - 2021-06-21T06:13:14+05:30 IST