మూడు జిల్లాలు నాలుగు డివిజన్లు

ABN , First Publish Date - 2022-01-27T05:33:46+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా 1970లో ఒంగోలు కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటైంది. గుంటూరు జిల్లాలోని ఒంగోలు, నెల్లూరు జిల్లాలోని కందుకూరు, కర్నూలు జిల్లాలోని మార్కాపురం డివిజన్లు కలిపి 1970 ఫిబ్రవరి 2న జిల్లా ఆవిర్భావం జరిగింది. 1972 డిసెంబర్‌లో టంగుటూరి ప్రకాశం పంతులు పేరు పెట్టారు.

మూడు జిల్లాలు  నాలుగు డివిజన్లు

ఒంగోలు కేంద్రంగా ఎనిమిది సెగ్మెంట్లతో ప్రకాశం జిల్లా

బాపట్లలోకి చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలు

నెల్లూరు జిల్లాలోకి కందుకూరు అసెంబ్లీ స్థానం

కనుమరుగుకానున్న కందుకూరు రెవెన్యూ డివిజన్‌

కొత్తగా చీరాల, పొదిలి కేంద్రాలుగా డివిజన్లు

జిల్లాల విభజనపై ప్రభుత్వ ముసాదాప్రకటన

లోపించిన హేతుబద్ధత

పశ్చిమప్రాంత ప్రజానీకానికి తప్పని ప్రయాస

ఒంగోలు, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) :

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం ప్రకటించిన ముసాయిదా ప్రకారం ప్రకాశం రూపురేఖలు మారనున్నాయి. ప్రస్తుతం ఒంగోలు కేంద్రంగా ఉన్న జిల్లాలోని పలుప్రాంతాలు మూడు జిల్లాల్లోకి వెళ్లనున్నాయి. అదేసమయంలో ఇప్పుడు జిల్లాలో ఉన్న మూడు రెవెన్యూ డివిజన్లలో కందుకూరు రద్దవుతుంది. చీరాల, పొదిలి కేంద్రాలుగా రెండు కొత్తవి ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే ఉన్న ఒంగోలు, మార్కాపురంతో కలిపి నాలుగు డివిజన్లు కానున్నాయి. అయితే తాజాప్రతిపాదనల్లో హేతుబద్దత లోపించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి భౌగోళికంగా పశ్చిమ ప్రాంత ప్రజల ప్రయాసను ఏమాత్రం తీర్చేవిధంగా లేని ఈ ప్రతిపదనపై వారు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గం ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటు అని చెప్పినా పూర్తిస్థాయిలో దాన్ని అమలు చేయలేదు. ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తే భౌగోళిక, సాంస్కృతిక, జనజీవన విధానాలను కూడా పరిగణలోకి తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  


 ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా 1970లో ఒంగోలు కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటైంది. గుంటూరు జిల్లాలోని ఒంగోలు, నెల్లూరు జిల్లాలోని కందుకూరు, కర్నూలు జిల్లాలోని మార్కాపురం డివిజన్లు కలిపి 1970 ఫిబ్రవరి 2న జిల్లా ఆవిర్భావం జరిగింది. 1972 డిసెంబర్‌లో టంగుటూరి ప్రకాశం పంతులు పేరు పెట్టారు. అలా జిల్లా ఏర్పాటు జరిగి అర్ధశతాబ్దం దాటినా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరిగిన దాఖలాలు లేకపోగా జిల్లాకేంద్రానికి వచ్చి వెళ్లేందుకు పశ్చిమప్రాంత ప్రజలు తీవ్ర వ్యయ,ప్రయాసాలు పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు అంశం అనేక సార్లు తెరపైకి వచ్చినా తాజా ప్రతిపాదనల్లోనూ వారి ఆశలు నేరవేరే పరిస్థితి లేకుండా పోయింది. 

ఆగమేఘాలపై ముసాయిదా

ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పార్లమెంట్‌ ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటును తెరపైకి తెచ్చి గతంలో కొంత కసరత్తు చేసి మధ్యలో నిలిపివేసింది. ప్రస్తుతం  ఆఘమేఘాలమీద జిల్లాల పునర్విభన, వాటి పరిధిలో రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు ముసాయిదాను మంగళవారం రాత్రి ప్రకటించింది. ఆ ప్రకారం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 12 అసెంబ్లీ సెగ్మెంట్లు మూడు జిల్లాల్లోకి వెళ్లనున్నాయి. ప్రభుత్వ ముసాయిదా ప్రకారం ఒంగోలు కేంద్రంగా ఉండే ప్రకాశం జిల్లా పరిధిలోకి ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం సెగ్మెంట్లు వస్తాయి. అలాగే చీరాల, అద్దంకి, పర్చూరు అసెంబ్లీ సెగ్మెంట్లు బాపట్ల జిల్లాలోకి, కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోకి వెళ్లనుంది. 

ఒంగోలులో సంతనూతలపాడు

జిల్లాల పునర్విభజనపై తొలినాళ్లలో చర్చ సమయంలో బాపట్ల పార్లమెంట్‌ పరిధిలో ఉన్న సంతనూతలపాడు అసెంబ్లీ స్థానాన్ని ఒంగోలు కేంద్రంగా ఉండే జిల్లాలోనే ఉంచాలని, అలాగే పశ్చిమప్రాంతాన్ని మార్కాపురం పేరుతో నూతన జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు బలంగా వినిపించాయి. పశ్చిమప్రాంతంలో పార్టీలు, ప్రజాసంఘాలు ఆందోళనలు కూడా చేపట్టగా సంతనూతలపాడు ప్రాంత ప్రజలు అధికార పార్టీ నేతలపై ఒత్తిడి తెచ్చారు. ఈక్రమంలో తాజా ప్రతిపాదనల్లో సంతనూతలపాడు స్థానాన్ని ఒంగోలు కేంద్రంలోనే ఉంచగా పశ్చిమప్రాంత ప్రజల డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదు. సంతనూలపాడు స్థానాన్ని ఒంగోలుతో కలిసి ఉంచడం పూర్తి హేతుబద్ధమే అయినప్పటికీ ఒక పార్లమెంట్‌, ఒక జిల్లా నిర్ణయం అక్కడ లెక్కతెప్పింది. 

 పశ్చిమ ప్రజల ఆశలపై నీళ్లు

పశ్చిమప్రాంత ప్రజల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఒంగోలుకు 100 నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉండే గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెంపాటు కనిగిరిలోని మండలాలను ప్రకాశం జిల్లాలో కొనసాగిస్తూ ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రానికి వచ్చి పనులు చూసుకొని వెళ్లాలంటే రెండు రోజుల సమయం పడుతూ గత 50 ఏళ్లుగా అవస్థలు పడుతున్న ఆ ప్రాంత ప్రజలకు తాజా పునర్విభజనలోనూ ఏమాత్రం ఊరట లభించకపోగా మళ్లీ అవే ఇబ్బందులు తప్పని పరిస్థితిని కల్పిస్తున్నారు. దీనిపై ఆ ప్రాంత ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండగా ప్రజాసంఘాలు ఆందోళనలు చేపట్టే యోచనలో ఉన్నాయి. ఒంగోలుకు 45కిలోమీటర్ల లోపు ఉండే కందుకూరును ఏకంగా 110 కిలో మీటర్లుపైన ఉండే నెల్లూరులో కలపడంపై కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. 

మార్కాపురం నియోజకవర్గ పరిధిలో రెండు డివిజన్‌ కేంద్రాలు 

జిల్లాలో ఇప్పటి వరకూ మూడు రెవెన్యూ డివిజన్లు ఉండగా తాజా ప్రతిపాదనల్లో రాష్ట్రంలోనే అతిపెద్ద  డివిజన్లలో రెండవదిగా ఉన్న కందుకూరు రద్దు కానుంది. చీరాల, పొదిలి కేంద్రాలుగా కొత్తవి ఏర్పాటు కానున్నాయి. మార్కాపురం నియోజకవర్గం ఏకంగా రెండు డివిజన్ల పరిధిలోకి రానుండటంతోపాటు అదే నియోజకవర్గంలో రెండు డివిజన్‌ కేంద్రాలు ఉండనున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ముసాయిదా ప్రకారం కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోకి వెళ్లనుంది. దీంతో ఇప్పటి వరకు కందుకూరు కేంద్రంగా ఉన్న రెవెన్యూ డివిజన్‌ రద్దయి కందుకూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలు కావలి డివిజన్‌లో కలవనున్నాయి. 

 తాజా ప్రతిపాదనల ప్రకారం ఆయా డివిజన్లు, వాటి పరిధిలోని మండలాల వివరాలు ఇలా ఉన్నాయి. 

 ఒంగోలు డివిజన్‌ : ఒంగోలు, కొత్తపట్నం, సంతనూతలపాడు, చీమకుర్తి, మద్దిపాడు, నాగులుప్పలపాడు, పంగులూరు, శింగరాయకొండ, కొండపి, జరుగుమల్లి, మర్రిపూడి, పొన్నలూరు మండలాలు.

చీరాల డివిజన్‌ : చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, యద్దనపూడి, మార్టూరు, పంగుళూరు, కొరిశపాడు, అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు మండలాలు.

పొదిలి డివిజన్‌ : తాళ్లూరు, ముండ్లమూరు, దర్శి, కురిచేడు, దొనకొండ, పొదిలి, కె.కె.మిట్ల, కనిగిరి, పామూరు, హెచ్‌ఎంపాడు, పి.సి.పల్లి, సి.ఎస్‌.పురం, వెలిగండ్ల మండలాలు.

మార్కాపురం డివిజన్‌ : మార్కాపురం, ఎర్రగొండపాలెం, దోర్నాల, త్రిపురాంతకం, పుల్లలచెరువు, పెద్దారవీడు, తర్లుపాడు, కంభం, అర్ధవీడు, గిద్దలూరు, కొమరోలు, రాచర్ల, బేస్తవారపేట మండలాలు. 

Updated Date - 2022-01-27T05:33:46+05:30 IST