Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మూడు దశాబ్దాల ఆకాంక్ష

twitter-iconwatsapp-iconfb-icon
మూడు దశాబ్దాల ఆకాంక్ష

1991 నుంచి నంద్యాల జిల్లా డిమాండ్‌

చారిత్రక ప్రాధాన్యం ఉన్న పట్టణం..

జలవనరుల కేంద్రంగా గుర్తింపు 

సీమ జిల్లాలకు ఇక్కడి నుంచే సాగు, తాగునీరు 

నేటి నుంచి నంద్యాల జిల్లా పాలన

వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్న సీఎం 


నంద్యాలను జిల్లా చేయాలనే ఆకాంక్ష ఈనాటిది కాదు. మూడు దశాబ్దాల స్వప్నం. 1991లో ఆనాటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు నంద్యాల ఎంపీగా ఎన్నికయ్యారు. ఆనాడే జిల్లా చేయాలనే ఆకాంక్షకు బీజం పడింది. రాజకీయ కారణాల వల్ల అప్పుడు సాధ్యం కాలేదు. ఆ తరువాత నంద్యాల జిల్లా డిమాండ్‌ మరుగున పడింది. 2017 ఉప ఎన్నికల్లో జిల్లా డిమాండ్‌ తెరపైకి వచ్చింది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాలను జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో ప్రతిపక్ష నేతగా ఇప్పటి సీఎం జగన్‌ కూడా ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. 2019లో అధికారం చేపట్టాక వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తానని స్పష్టత ఇచ్చారు. రెండున్నరేళ్లు గడిచినా ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడక..  నంద్యాల వాసుల ఆశలు వాడిపోతున్న తరుణంలో  జనవరి 26న కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్‌ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా విశిష్టతపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. 


నంద్యాల-ఆంధ్రజ్యోతి: నంద్యాల.. నవ నందుల క్షేత్రం. రాయలసీమ ప్రాంతంలో నంద్యాలకు విశిష్టత స్థానం ఉంది. చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయంగా గుర్తింపు పొందిన ప్రాంతాల్లో ఇది ఒకటి. ఉద్యమాల చరిత్ర కూడా ఉన్న ప్రాంతం ఇది. తెల్లదొరల దాస్యశృంఖలాల నుంచి భరతమాతకు స్వేచ్ఛ అందించాలని సాగించిన స్వాతంత్య్ర ఉద్యమంలో నంద్యాల ప్రజలు పాల్గొన్నారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికంటే ముందే వలస పాలన మీద తిరుగుబాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ ప్రాంతం వారే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రాంతాలను ప్రత్యేక తెలుగు రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే ఉద్యమానికి నంద్యాల ప్రతిస్పందించి అందులో భాగమైంది. ఈ క్రమంలో 1928 నవంబరు 17, 18 తేదీల్లో ఆంధ్ర మహాసభలు నంద్యాల్లో జరిగాయి. ఆ సభల్లో రాయలసీమ ప్రత్యేక సమస్యలు ముందుకు వచ్చాయి. ఈ ప్రాంతాన్ని రాయలసీమ అని పిలవాలనే ప్రతిపాదన వచ్చి ఆమోదం పొందింది. ఆ రకంగా రాయలసీమ చరిత్రలో నంద్యాల కీలక స్థానం సంపాదించుకుంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధిలో నంద్యాల ప్రాంతం సేవలు, పెట్టుబడి పాత్ర ఉంది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కర్నూలు జిల్లాతో అనుబంధంలో ఉన్న నంద్యాల తాజా జిల్లాల పునర్విభజన వల్ల ప్రత్యేక జిల్లాగా ఏర్పడి కొత్త చరిత్రను నిర్మించుకోనున్నది. 


నంద్యాల చరిత్ర


నంది ఆలయం అనే పదం నుంచి నంద్యాల ఏర్పడిందని అంటారు. నవ నందుల ఆలయాలను నిర్మించిన శ్రీకృష్ణ దేవరాయల వంశస్థులు ఈ ప్రాంతాన్ని పాలించారని అంటారు. ‘నందిహేల’ (నంద్యాలలో జరిగే నంది పండుగ అని అర్థం) కాలక్రమేణా నంద్యాలగా మారిందనీ అంటారు. నందన చక్రవర్తి పాలించిన ప్రాంతం కాబట్టి నంద్యాల అయిందనే అభిప్రాయం కూడా ఉంది. కృష్ణదేవరాయల ఆస్థాన కవుల్లో ఒకరైన పింగళి సూరన స్వస్థలం నంద్యాల అనే చరిత్రకారులు చెబుతున్నారు. బ్రిటిష్‌ పాలకులు నంద్యాలలో అనేక భవంతులు నిర్మించారు. అవి నేటికీ ఉన్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో నంద్యాల కేంద్రంగా ఎన్నో సభలు, సమావేశాలు జరిగాయి. మహాత్మాగాంధీ, జవహర్‌ లాల్‌ నెహ్రూ, స్వాతంత్య్రం అనంతరం ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు నంద్యాలను సందర్శించారు. ఇక్కడ జరిగిన సభల్లో ఉపన్యాసించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఉమ్మడి మద్రాసు ప్రావిన్స్‌ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నివర్తి వెంకటసుబ్బయ్య నంద్యాల పట్టణవాసే. 1890లోనే నంద్యాల కేంద్రంగా రైల్వే లైన్‌ అభివృద్ధి చేశారు. పలు ప్రాంతాలకు రైలు మార్గాలను విస్తరించారు. స్వాతంత్ర్యానికి పూర్వం 1900లోనే నంద్యాలను మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. ఇక్కడ నిర్మించిన కేథడ్రల్‌ 1905లో ప్రజలకు అంకితం చేశారు. దానాల్లో చిరస్థాయిగా నిలిచిన బుడ్డా వెంగళరెడ్డిది ఈ ప్రాంతం కావడం విశేషం. 


ఈ ప్రాంతం నుంచే రాష్ట్రపతి, ప్రధాని


నంద్యాల ఎందరో రాజకీయ ఉద్దండులను దేశానికి అందించింది. 1952లో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంగా ఏర్పడింది. 1992లో జరిగిన తొలి పార్లమెంట్‌ ఎన్నికల్లో నంద్యాల నుంచి స్వతంత్ర అభ్యర్థి రాయసం శేషగిరిరావు ఎంపీగా విజయం సాధించి లోక్‌సభలో అడుగు పెట్టారు. నంద్యాల ఎంపీగా 1977లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన నీలం సంజీవరెడ్డి ఆ తరువాత రాష్ట్రపతిగా ఎంపిక అయ్యారు. దీంతో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పెండేకంటి వెంకటసుబ్బయ్య గెలిచారు. 1991లో నంద్యాల ఎంపీగా ఆళ్లగడ్డకు చెందిన గంగుల ప్రతా్‌పరెడ్డి గెలిచారు. ఆ సమయంలో పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పీవీ కోసం గంగుల రాజీనామా చేసి నరసింహారావు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పీవీ పోటీ చేశారు. తెలుగు జాతికి చెందిన పీవీ పోటీలో ఉన్నందుకు ఆనాటి టీడీపీ అధ్యక్షుడు ఎన్టీఆర్‌ తమ అభ్యర్థిని పోటీకి పెట్టలేదు. పీవీ దేశంలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. 1952 నుంచి 2019 వరకు నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గానికి 20 పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో 11 మంది ఎంపీలు లోక్‌సభకు వెళ్లారు. నంద్యాల లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న ప్రకాశం జిల్లా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో వేరు చేశారు. అప్పటి వరకు కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఉన్న డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గాన్ని నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంలో విలీనం చేశారు. 


నంద్యాలకు ఆభరణం నల్లమల


నల్లమల 3 వేల చ.కి.మీల దట్టమైన అడవులు. ఎన్నో జంతురాశులు, క్రూర మృగాలు, మరెన్నో జీవజాతుల నిలయం నల్లమల. కృష్ణా, పెన్నా నదుల మధ్యన ఉత్తర-దక్షిణ దిశగా సుమారు 150 కి.మీలు ఈ అడవులు విస్తరించాయి. నల్లమల కొండల సగటు ఎత్తు 520 మీటర్లు. భైరానీ కొండ ఎత్తు 929 మీటర్లు, గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద 903 మీటర్ల ఎత్తులో కొండలు ఉన్నాయి. శ్రీశైలం-నాగార్జున టైగర్‌ జోన్‌ ఎంతో ప్రసిద్ధి. కందనవోలు అందాలుగా ఇన్నాళ్లు గుర్తింపు పొందిన నల్లమల ఇక నంద్యాల జిల్లాకు పచ్చని ఆభరణం కానుంది. 


జలవనరుల హబ్‌


నంద్యాల జిల్లా జలవనరుల హబ్‌గా మారనుంది. తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం జలాశయం సహా రాయలసీమ జిల్లాలకు సాగు, తాగునీరు అందించే ప్రాజెక్టులు నంద్యాల జిల్లా పరిధిలోకే వస్తున్నాయి. శ్రీశైలం ఎగువన కృష్ణా జలాలు కరువు నేలకు మళ్లించే సీమ జలద్వారం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులెటర్‌, తెలుగుగంగ ప్రాజెక్టు, ఎస్‌ఆర్‌బీసీ, గాలేరు-నగరి ప్రాజెక్టు, హంద్రీ-నీవా ప్రాజెక్టు, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలు నంద్యాలకే వస్తున్నాయి. కేసీ కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ సుంకేసుల జలాశయం కర్నూలు జిల్లాలోనే ఉన్నా.. ఆయకట్టు మొత్తం నంద్యాల జిల్లా పరిధిలోనే ఉంది. డోన్‌ నియోజకవర్గం మినహా.. మిగిలిన నియోజకవర్గాల్లో సాగు, తాగునీటికి కొరత లేదు. కరువు సీమ కోనసీమగా నంద్యాలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.


టెంపుల్‌ టూరిజం


కర్నూలు జిల్లా అంటే గుర్తొచ్చేది శ్రీశైలం దేవస్థానం. జిల్లా పునర్విభజన వల్ల దక్షిణాది ఆధ్యాత్మిక కేంద్రాలు శ్రీశైలం, అహోబిలం, యాగంటి, మహానంది, కొలనుభారతి, సంగమేశ్వరం.. వంటి క్షేత్రాలు నంద్యాల జిల్లా పరిధిలోకి వెళ్తున్నాయి. దేశంలోనే ప్రసిద్ధి చెందిన బెలూం గుహలు ఈ జిల్లాలోకే వస్తాయి. టెంపుల్‌ టూరిజంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. 


జిల్లా సరిహద్దులు


నంద్యాల జిల్లాకు తూర్పున ప్రకాశం, కడప జిల్లాలు, పడమర, ఉత్తరాన కర్నూలు జిల్లా, దక్షిణాన అనంతపురం జిల్లాలు సరిహద్దులు. నంద్యాల పట్టణం కర్నూలుకు 75 కి.మీలు, కడపకు 128 కి.మీలు, ప్రకాశం జిల్లా గిద్దలూరుకు 60.1 కి.మీలు, అనంతపురానికి 182 కి.మీల దూరంలో ఉంది. 


రాజధాని అమరావతికి చేరుకోవాలంటే..


నంద్యాల నుంచి రాజధాని అమరావతి మధ్య 333 కి.మీలు దూరం ఉంది. రోడ్డు, రైల్వే మార్గాలు ఉన్నాయి. గుంతకల్లు-విజయవాడ ప్రధాన రైలుమార్గం వయా నంద్యాల మీదుగా వెళ్తుంది. విజయవాడకు వెళ్లాలంటే రైల్వే సౌకర్యం మెరుగ్గా ఉంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు, కంభం, మార్కాపురం, వినుకొండ, నరసరావుపేట, చిలకలూరుపేట, గుంటూరు మీదుగా రోడ్డు మార్గాన 6-7 గంటల వ్యవధిలో విజయవాడ చేరుకోవచ్చు. 


కల నెరవేరింది


నంద్యాల జిల్లా అవ్వాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా. ఇది జిల్లా వాసుల చిరకాల స్వప్నం. 1990వ దశకంలో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచిన అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నంద్యాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేసి జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఎట్టకేలకు ఇప్పుడు జిల్లా కావడం ఆనందంగా ఉంది. దీంతో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. 


 - చిలక శ్రీనివాసులు, నంద్యాల


విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి చేయాలి


రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకోవడంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. జిల్లాగా ఏర్పాటు చేయగానే సరిపోదు. దానికి అనుగుణంగా అన్ని సౌకర్యాలను అందుబాటులో తీసుకురావాలి. శాశ్వత జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు తగినంతమంది ఉద్యోగులను సర్దుబాటు చేయాలి. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్‌తో పాటు విశ్వవిద్యాలయ స్థాయి విద్యాసంస్థలను తీసుకురావాలి. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాలి.


- పిల్లి వెంకటేశ్వర్లు, నంద్యాల


వ్యాపార రంగం అభివృద్ధి చెందుతుంది


నంద్యాల జిల్లా కేంద్రంగా మారడంతో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. గతంలో సమస్యల పరిష్కారానికి కర్నూలుకు వెళ్లాల్సివచ్చేది. ప్రస్తుతం ఆ ఇబ్బంది ఉండదు. వివిధ ప్రభుత్వ జిల్లా అధికారుల కార్యాలయాల ఏర్పాటుతో ప్రజలకు పరిపాలన చేరువవుతుంది. అలాగే విద్య, వ్యాపారాలు, రియల్‌ ఎస్టేట్‌ రంగం అభివృద్ధి చెందుతుంది. 


- నరేంద్ర, వ్యాపారి, నంద్యాలకల సాకారమైన వేళ

నంద్యాల జిల్లా కావాలనేది నా చిరకాల స్వప్నం. 1991లో ఇక్కడి నుంచి గెలిచిన అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నంద్యాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేసి జిల్లాను చేస్తానని హామీ ఇచ్చారు. అది నెరవేరలేదు. ఎట్టకేలకు ఇప్పుడు జిల్లా కావడం ఆనందంగా ఉంది. 


- ఎస్‌.నాగరాజు, నంద్యాల


అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి


నంద్యాల జిల్లా అయితే అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటి వరకు ఏ సమస్య వచ్చినా కర్నూలు వెళ్లాల్సివచ్చేది. వ్యయ ప్రయాసలు ఉండేవి. ఇక ఆ ఇబ్బందులు ఉండవు. అలాగే విద్య, వ్యాపార రంగంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. 


 - హుసేన్‌బాషా, నంద్యాల

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.