వారం వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన మూడు శవాలు వేర్వేరు ప్రాంతాలలో లభ్యం.. పోలీసులు కేసుని ఎలా ఛేదించారంటే..

ABN , First Publish Date - 2022-01-23T09:10:17+05:30 IST

మూడు శవాల ఫొటోలు గుర్తింపు కోసం న్యూస్ పేపర్‌లో వేయించగా చనిపోయిన ఆ ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారు అని పోలీసులకి తెలిసింది...

వారం వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన మూడు శవాలు వేర్వేరు ప్రాంతాలలో లభ్యం.. పోలీసులు కేసుని ఎలా ఛేదించారంటే..

పోలీసులకు జనవరి 6న ఒక యువకుని శవం రోడ్డుపై లభించింది. శవం వద్ద గుర్తింపు పత్రాలు ఏమీ లభించక పోవడంతో పోలీసులు దర్యప్తు మొదలుపెట్టారు. మళ్లీ జనవరి 8న ఒక వృద్ధురాలి శవం మరోచోట దొరికింది. ఆ మృతదేహం వద్ద కూడా ఏ గుర్తింపు ఆధారాలు దొరకలేదు. అలాగే జనవరి 13న మరో వృద్ధుడి  మృతదేహం లభించింది. ఈ సారి కూడా శవం వద్ద ఏ ఆధారాలు దొరకులేదు. మూడు శవాల గొంతు కోసి హత్య చేసినట్టు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.


కానీ ఈ మూడు శవాల ఫొటోలు గుర్తింపు కోసం న్యూస్ పేపర్‌లో వేయించగా చనిపోయిన ఆ ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారు అని పోలీసులకి తెలిసింది. ఈ ఘటన జమ్మూ కశ్మీర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే..


జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని రామ్‌బన్ పట్టణంలో పోలీసులకు ఏడు రోజుల వ్యవధిలో మూడు శవాలు వేర్వేరు ప్రాంతాల్లో లభించాయి. ఆ మూడు శవాలు ఒకే కుటుంబానికి చెందినవి పోలీసులకు తెలిసింది. చనిపోయిన ఆ ముగ్గురిలో ఒకరు ఇండియన్ ఆయిల్ కంపెనీ రిటైర్డ్ అధికారి మహమూద్ అలీ కాగా మిగతా ఇద్దరిలో ఒకరు ఆయన భార్య, కుమారుడు షావేజ్ అని పోలీసుల విచారణలో తెలిసింది.


ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లఖ్‌నవుకు చెందిన మహమూద్ అలీ కుటుంబం జమ్మూ కశ్మీర్‌లో ఎలా చనిపోయిందని పోలుసులు విచారణ చేపట్టారు. మహమూద్ అలీ కుటుంబంలో ఆయన పెద్ద కుమారుడు సర్ఫరాజ్‌ను పోలీసులు జరిగిన హత్యల గురించి సమాచారం కోసం ప్రశ్నించారు. అప్పుడు సర్ఫరాజ్ పొంతన లేని సమాధానాలతో వణకడం చూసి పోలీసులు అతడిపై అనుమానం వచ్చింది. సర్ఫరాజ్‌ని పోలీసులు తమ పద్ధతిలో ప్రశ్నించగా.. అతడు జరిగిన నిజం చెప్పాడు.


పోలీసుల కథనం ప్రకారం.. ఇండియన్ ఆయిల్ సంస్థ రిటైర్డ్ అధికారి అయిన మహమూద్ అలీకి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సర్ఫరాజ్(31) ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి జడ్జి కావాలని పరీక్షలు రాస్తున్నాడు. కానీ తండ్రి మహమూద్ అలీకి తన కుమారుడు కూడా ఇండియన్ ఆయిల్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేయాలని కోరుకున్నాడు. అందుకు సర్ఫరాజ్ ఒప్పుకోకపోవడంతో ఇంట్లో గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మహమూద్ అలీ తన చిన్న కుమారుడు షావేజ్‌కు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. అంతే కాదు పెద్ద కుమారుడు సర్ఫరాజ్‌తో కోపంగా ఉండేవాడు. ఆస్తి మొత్తం చిన్న కొడుకు పేరిట రాస్తానని బెదిరించాడు. 


ఇదిలా ఉండగా.. మహమూద్ అలీ కుటుబమంతా విహారయాత్రకు జమ్మూకశ్మీర్‌లోని రామ్‌బన్ వెళ్లారు. అక్కడ జనవరి 5న రాత్రి అందరూ భోజనం చేశారు. ఆ భోజనంలో సర్ఫరాజ్ నిద్ర మాత్రలు కలిపేశాడు. అందరూ నిద్రలో ఉండగా.. సర్ఫరాజ్ తన మిత్రడు అనిల్ యాదవ్ సహాయంతో తన తండ్రి, తల్లి, తమ్ముడిని గొంతుకోసి హత్య చేశాడు. ముగ్గురి శవాలను వేర్వేరు ప్రాంతాలలో దాచి పెట్టి.. మరుసటి రోజు ఉదయం ఉత్తర్ ప్రదేశ్ చేరుకున్నాడు. పోలీసుల విచారణలో సర్ఫరాజ్ తన నేరం ఒప్పుకున్నాడు. తన తండ్రి ఎక్కడ చెప్పినట్లు ఆస్తి మొత్తం తమ్ముడి పేరు మీద రాస్తాడోనని భయపడి హత్యలు చేశానని సర్ఫరాజ్ చెప్పాడు. 


పోలీసులు సర్ఫరాజ్, అతని స్నేహితుడు అనిల్ యాదవ్‌పై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Updated Date - 2022-01-23T09:10:17+05:30 IST