మూడు రోజుల్లో ఏం జరగనుంది..?

ABN , First Publish Date - 2022-05-12T17:09:52+05:30 IST

మరో మూడు రోజుల్లో రాష్ట్రంలో ఏం జరగనుందనే చర్చ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై బుధవారం

మూడు రోజుల్లో ఏం జరగనుంది..?

- అమిత్‌షాతో భేటీ తర్వాత సీఎం కీలక వ్యాఖ్యలు 

- సర్వత్రా ఉత్కంఠ 

- మార్పు నాయకత్వానికా..? పార్టీ పదవులకా..? 

 

బెంగళూరు: మరో మూడు రోజుల్లో రాష్ట్రంలో ఏం జరగనుందనే చర్చ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై బుధవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన సందర్భంలో లేవనెత్తిన అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. రాష్ట్రంలో రాజకీయ స్థితిగతుల్లో మార్పులు జరగవచ్చునని, మరో మూడు రోజుల్లోనే తేలనుందని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలసిన తర్వాత ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆలోచనను రేకెత్తిస్తున్నాయి. మంగళవారం ఢిల్లీలో గడిపిన సీఎం అగ్రనేతలను కలవలేకపోయారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అందుబాటులో లేకపోవడంతో ఇతర మంత్రులతో చర్చించారు. బుధవారం అమిత్‌షాతో కలసినా మంత్రివర్గ అంశంపై తుది ప్రకటన వెలువడలేదు. పైగా ఎవరి పేర్లనూ సిఫారసు చేయలేదని, ప్రత్యేకించి జాబితాను అమిత్‌షాకు ఇవ్వలేదని ము ఖ్యమంత్రి వెల్లడించారు. కానీ మార్పులు అనివార్యమనే వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. మార్పులంటే నాయకత్వంలోనా, పార్టీలోనా అనే చర్చలు నడుస్తున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ను మార్పు చేస్తారనే చర్చ ఐదారు నెలలుగా సాగుతోంది. కొత్త అధ్యక్షుడిని ఖరారు చేయలేదు. ఇక ఇటీవలే ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన బసవరాజ్‌ బొమ్మై మార్పు కూడా తరచూ ప్రస్తావనకు వస్తోంది. వారం క్రితం బెంగళూరు పర్యటనకు అమిత్‌షా వచ్చిన సందర్భంలో సీఎం మార్పు అంశం హల్‌చల్‌ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి నివాసానికి అమిత్‌షా భోజనానికి వెళ్లడం, ప్రత్యేకించి రెండుగంటలపాటు అక్కడే ఉండేలా షెడ్యూల్‌ ఉండడం కూడా చర్చకు కారణమైంది. షా పర్యటన ముగించే వేళ ముఖ్యమంత్రి మార్పు అంశం లేదంటూ దాటవేసి వెళ్లారు. కేబినెట్‌ విస్తరణ అంశం ఆరు నెలలుగా వాయిదాలు పడుతూ వస్తోంది. జనవరి రెండోవారంలో అమిత్‌ షా, జేపీ నడ్డా బెంగళూరులో రెండు రోజులు గడిపి మంత్రివర్గ ప్రక్షాళన చేయాలని తీర్మానించారు. ఈలోగానే ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో వారి పర్యటన వాయిదా పడింది. మూడు నెలలపాటు ఎన్నికలంటూ దాటవేసిన అగ్రనేతలు ఆ తర్వాత రెండు నెలలు కూడా కేబినెట్‌ విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు. జేపీ నడ్డా, అమిత్‌ షా ఇటు రాష్ట్ర పర్యటనకు వచ్చారు. అటు ఢిల్లీకి సీఎం మూడునాలుగుసార్లు వెళ్లారు. అయినా విస్తరణకు అనుమతి ఇవ్వకపోవడం కూడా అనుమానాలకు దారితీస్తోంది. బీజేపీ జాతీయ సంఘటనా కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో నాయకత్వాన్ని మార్పు చేసే శక్తి బీజేపీకి ఉందనే వ్యాఖ్యలతోపాటు పార్టీ వివాదాస్పద నేత బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ ఈనెల 10 తర్వాత రాష్ట్రంలో మార్పులు ఉంటాయనే ప్రకటన నాయకత్వ మార్పు అంశానికి బలాన్నిస్తోంది. కేబినెట్‌ విస్తరణను మూడు రోజుల్లో తేలుస్తామని అమిత్‌షా ప్రకటించి ఉంటే ఇదే అభిప్రాయాన్ని సీఎం మీడియాకు వివరించేవారు. కానీ రాష్ట్ర రాజకీయ స్థితిగతులకు ఆధారంగా మార్పులు ఉంటాయనే అంశం సీఎం లేవనెత్తడం మరింత ఆసక్తికర అంశమైంది. ఒకవేళ నాయకత్వ మార్పు ఉంటే..? కొత్తవారు ఎవరు?, కేబినెట్‌లో చేరేవారు ఎవరు, సిట్టింగ్‌లందరికీ అవకాశాలు ఉంటాయా.. అనే కొత్త అంశాలు విధానసౌధలో చక్కర్లు కొట్టాయి. మూడు రోజుల తర్వాత ఏం జరుగుతుందో అ నేది బీజేపీ వర్గాలకే కాకుండా ప్రతిపక్ష కాంగ్రెస్‌, జేడీఎస్ లోనూ కుతూహలం రేకెత్తిస్తోంది. 

Read more