Kashmir: ఉగ్ర దాడిలో ముగ్గురు పౌరుల మృతి

ABN , First Publish Date - 2021-10-06T12:42:27+05:30 IST

జమ్మూకశ్మీరులో తాజాగా జరిగిన వేర్వేరు ఉగ్ర దాడుల్లో ముగ్గురు పౌరులు మరణించారు...

Kashmir: ఉగ్ర దాడిలో ముగ్గురు పౌరుల మృతి

శ్రీనగర్ : జమ్మూకశ్మీరులో తాజాగా జరిగిన వేర్వేరు ఉగ్ర దాడుల్లో ముగ్గురు పౌరులు మరణించారు.జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక ఫార్మసీ యజమాని, ఓ వీధి వ్యాపారి, మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయారు.శ్రీనగర్ నగరంలో ప్రముఖ ఫార్మసీ యజమాని మఖన్ లాల్ బింద్రూ అనే కశ్మీర్ పండిట్ ను ఉగ్రవాదుల కాల్చి చంపారు. శ్రీనగర్ లోని మదీనా చౌక్ లాల్ బజార్ సమీపంలో జరిగిన మరో ఘటనలో ఉగ్రవాదులు వీధి వ్యాపారి వీరేంద్ర పాశ్వాన్ ను కాల్చి చంపారు.మృతుడు వీరేంద్ర బీహార్ రాష్ట్రంలోని భాగల్పూర్ నివాసి అని అతను ఆలంగారి బజార్ జాదిబాల్ ప్రాంతంలో నివశిస్తున్నాడని పోలీసులు చెప్పారు. 


మూడో ఉగ్రదాడిలో ఉత్తరకశ్మీరులోని బందిపోరా జిల్లాలో మరో పౌరుడిని కాల్చిచంపారు.బందిపోరా లోని షాగుండ్ ప్రాంతంలో నాయద్ కాయ్ నివాసి మొహమ్మద్ షఫీని ఉగ్రవాదులు చంపారు.ఈ ఉగ్ర దాడులతో అప్రమత్తమైన కేంద్ర భద్రతా బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు. ‘‘ఉగ్రవాదులు మదీనా చౌక్ లాల్ బజార్ సమీపంలో పానీపూరీలు విక్రయిస్తున్న పేద వ్యాపారిని కాల్చి చంపడాన్ని ఖండిస్తున్నాను, వ్యాపారి ఆత్మకు శాంతి కలుగుగాక’’ అని మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. 


ఉగ్రవాదుల కాల్పులను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు. ‘‘ఉగ్ర దాడులను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అమాయక ప్రజలను చంపడం అనాగరిక చర్య, మానవత్వానికి విరుద్ధం.’’ అని మనోజ్ సిన్హా ట్వీట్ చేశారు. ఉగ్రదాడుల్లో మరణించిన కుటుంబాలకు లెఫ్టినెంట్ గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యల్లో విజయం సాధించలేరని సిన్హా వ్యాఖ్యానించారు.


Updated Date - 2021-10-06T12:42:27+05:30 IST