పాపం పసివారు.. కారు డోర్ లాక్‌పడి..

ABN , First Publish Date - 2020-08-07T16:27:19+05:30 IST

రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు. కూలీ కోసం రాష్ట్రాలు దాటుకుని..

పాపం పసివారు.. కారు డోర్ లాక్‌పడి..

సరాదాగా ఆడుకోడానికి వెళ్లి అనంతలోకాలకు..

మృతులంతా కూలీల పిల్లలే..

మూడు కుటుంబాల్లో విషాదం

బాపులపాడు మండలం రేమల్లెలో ఘటన


హనుమాన్‌ జంక్షన్‌(కృష్ణా): రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు. కూలీ కోసం రాష్ట్రాలు దాటుకుని వచ్చారు. కష్టాన్ని నమ్ముకుని కాసులు కూడగట్టుకుని పిల్లల్ని చదివిద్దామనుకున్నారు. కారు రూపంలో వచ్చిన మృత్యువు తమ కంటిపాపలను చంపేస్తుందని తెలుసుకోలేకపోయారు. బాపులపాడు మండలం రేమల్లెలో మోహన్‌ స్పింటెక్స్‌ స్పిన్నింగ్‌ మిల్లు క్వార్టర్స్‌లో ఆరేళ్ల వయసు కలిగిన ముగ్గురు చిన్నారులు గురువారం మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన షాజహాన్‌, ఆలీ కుమార్తె హప్సానా (6), అసోంకు చెందిన అమీనాబేగం కూతురు రింపా యాస్మిన్‌ (6), షేక్‌ రైరన్‌, హసీమ కుమార్తె సుహానా పర్విన్‌ (6)లు మృతిచెందారు. 


ఆడుకుందామని వెళ్లి.. 

బాపులపాడు మండలం రేమల్లెలో మోహన్‌ స్పింటెక్స్‌ స్పిన్నింగ్‌ మిల్లు క్వార్టర్స్‌ సమీపంలో పార్కింగ్‌ చేసిన కారులో కూర్చుని సరదా తీర్చుకోవాలని ఆ ముగ్గురు చిన్నారులు ఆశపడ్డారు. ఆడుకుంటూ వెళ్లి కారు డోర్‌ తెరిచారు. కారులో కూర్చుని డోర్‌ వేసుకోగానే లాక్‌ పడిపోయింది. మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన పిల్లలు సాయంత్రమైనా తిరిగి రాలేదని అందరూ కలిసి వెతికారు. చివరికి కారులో విగతజీవులుగా పడి ఉన్న తమ పిల్లలను చూసి బోరున విలపించారు. క్వార్టర్స్‌లో దాదాపు 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, అసోం, ఒడిశాకు చెందిన 600 మంది  కార్మికులు, ఇతర సిబ్బంది ఉన్నారు. కారు యజమాని దాదాపు 15 రోజులుగా కారు తీయకపోవడంతో లాక్‌ వేసి ఉందనే నమ్మకంతో  ఉన్నారు.


వెనుక సైడు డోర్‌ సరిగ్గా పడి ఉండదని, డోర్‌ తెరిచి.. వేసిన తరువాత లాక్‌ పడి ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ చూడకపోవడంతో కారులోనే దాదాపు నాలుగైదు గంటలు మృత్యువుతో పోరాడి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయి ఉంటారని అనుకుంటున్నారు.సంఘటనాస్థలిని నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు గురువారం సందర్శించారు. హనుమాన్‌ జంక్షన్‌ సీఐ డీవీ రమణ ఆధ్వర్యంలో  వీరవల్లి  ఎస్‌ఐ చంటిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Updated Date - 2020-08-07T16:27:19+05:30 IST