ముచ్చటగా మూడు

ABN , First Publish Date - 2020-08-15T05:22:20+05:30 IST

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిర్మాణం జరిగిన నాటి నుంచి జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉన్న నీటి పారుదల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌

ముచ్చటగా మూడు

ఉమ్మడి పాలమూరు జిల్లాకు మూడు సీఈ కార్యాలయాలు

గద్వాల సీఈ కార్యాలయం వనపర్తికి బదలాయింపు

మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో అదనంగా మరో రెండు

నడిగడ్డ నుంచి కార్యాలయంపై తరలింపు వ్యక్తమవుతున్న నిరసనలు

సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్యెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి


గద్వాల, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిర్మాణం జరిగిన నాటి నుంచి జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉన్న నీటి పారుదల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయాన్ని వనపర్తి జిల్లాకు తరలించడాన్ని అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆ శాఖలోని కొందరు ఉద్యోగులే ఈ కార్యాలయం తరలింపు సబబు కాదని చెబుతుండగా, వనపర్తి, గద్వాలలో కాకుండా పెబ్బేరుకు కార్యాలయాన్ని తరలిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని మరి కొందరి నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది.


వనపర్తికి తరలింపు ఎందుకు?

వనపర్తి జిల్లాలో ఏ ప్రాజెక్టు లేదు. పెద్ద పెద్ద రిజర్వాయర్లు లేవు. జూరాల ప్రాజెక్టు ఎడవ కాల్వ ద్వారానే ఆ జిల్లాకు నీరు అందుతుంది. ఈ తరుణంలో ఏ రకమైన భవనాలు, సౌకర్యాలు లేని వనపర్తి ప్రాంతానికి సీఈ కార్యాలయాన్ని తరలించాల్సిన అవసరం ఏముందనే విషయంపై మంత్రి నిరంజన్‌రెడ్డితో పాటు రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ అధికారులు సమాధానం చెప్పాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. అయితే, వనపర్తికి సీఈ కార్యాలయం తరలించడంపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశాడు. తాజాగా అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం, జడ్పీ చైర్‌పర్సన్‌ సరితతో పాటు అధికార పార్టీకి చెందిన జిల్లా నాయకులు సీఎంతో పాటు మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు సన్నద్ధమవుతున్నారు. అలాగే మాజీ మంత్రి డీకే అరుణ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. 


నీటి పారుదల శాఖ ముసాయిదా ఇలా..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రాజెక్టుల సీఈ (గద్వాల) స్థానంలో మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో కొత్త సీఈ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నీటి పారుదల శాఖ ముసాయిదాలో పేర్కొన్నది. గద్వాల సీఈ కార్యాలయాన్ని వనపర్తి సీఈ పరిధిగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మహబూబ్‌నగర్‌ సీఈ పరిధిలో దేవరకద్ర, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, షాద్‌నగర్‌ నియోజకవర్గాలను చేర్చి, దీని పరిధిలో 6.80 లక్షల ఎకరాల ఆయకట్టును, నాగర్‌కర్నూల్‌ సీఈ పరిధిలో అచ్చంపేట, దేవరకొండ, కల్వకుర్తి, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గాలు, దీని పరిధిలో 5.55 లక్షల ఎకరాల ఆయకట్టును, వనపర్తి సీఈ కార్యాలయం పరిధిలో అలంపూర్‌, గద్వాల, మక్తల్‌, వనపర్తి నియోజకవర్గాలను, 8.08 లక్షల ఎకరాల ఆయకట్టును చేర్చింది. అయితే, జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన నీటి ప్రాజెక్టుల పెత్తనం అంతా వనపర్తి పరిధిలోకి చేర్చడంపై అధికార పార్టీ నాయకులతో పాటు ప్రతిపక్ష నాయకుల నుంచి వ్యతిరేకత వస్తోంది.

Updated Date - 2020-08-15T05:22:20+05:30 IST