మూడు రాజధానులతో సీమకు అన్యాయం: మాజీ మంత్రి అఖిలప్రియ

ABN , First Publish Date - 2020-08-07T13:17:29+05:30 IST

మూడు రాజధానుల పేరుతో రాయలసీమ వాసులకు వైసీపీ ప్రభుత్వం..

మూడు రాజధానులతో సీమకు అన్యాయం: మాజీ మంత్రి అఖిలప్రియ

ఆళ్లగడ్డ(కర్నూలు): మూడు రాజధానుల పేరుతో రాయలసీమ వాసులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి అఖిలప్రియ ఆరోపించారు. ఆమె గురువారం ఫోన్‌లో మాట్లాడుతూ రాయలసీమలోని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేశామని వైసీపీ ప్రజాప్రతినిధులు సంబరాలు జరుపుకున్నారని అన్నారు. కర్నూలుకు హైకోర్టు ప్రకటిస్తూనే విజయవాడ, విశాఖ పట్టణంలో హైకోర్టు బెంచ్‌లు మంజూరు చేస్తున్నారని, అప్పుడు  కర్నూలు జూడీషియల్‌ రాజధాని ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. మూడు రాజధానులతో రాయలసీమకు ప్రభు త్వం తీవ్ర నష్టం చేస్తోందని అన్నారు. కర్నూలుకు హైకోర్టు ఇస్తే పార్టీలకు అతీతంగా అందరం సంతోషించే వారమని, కానీ రాయలసీమలోని సాగునీటి పథకాలు,  ఓర్వకల్లు విమానాశ్రయం, సీడు హబ్‌లను ప్రభు త్వం నిలిపి వేసిందని అన్నారు. వాటిని తిరిగి ప్రారంభించాలని ఆమె డిమాండ్‌ చేశారు.


రాయలసీమలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే నష్ట పరిహారం ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. పోతిరెడ్డి పాడు ద్వారా  790 అడుగుల నుంచి రాయలసీమకు నీరు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, దీనిపై తెలంగాణ ప్రభుత్వం  సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంటే ముఖ్యమంత్రి, మంత్రులు నోరు మెదపడం లేదని అన్నారు. రాయలసీమపై ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో దీన్నిబట్టి చెప్పవచ్చన్నారు.   తెలంగాణ ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను 790 అడుగుల వద్ద ఏర్పాటు చేసుకున్నప్పుడు రాయలసీమకు అదే నీటి మట్టం నుంచి నీరు ఇచ్చేందుకు ఎందుకు ప్రయత్నించకూడదని ప్రశ్నించారు. ఈవిషయంపై వైసీపీ ప్రజా ప్రతినిధులు ఎందుకు మాట్లాడటం లేదని ఆమె ప్రశ్నించారు. 


Updated Date - 2020-08-07T13:17:29+05:30 IST