Canada: మూతపడ్డ మూడు కాలేజీలు రీఓపెన్.. భారత విద్యార్థులకు భారీ ఉపశమనం!

ABN , First Publish Date - 2022-04-03T17:21:01+05:30 IST

కెనడాలో ఈ ఏడాది ప్రారంభంలో మూడు కళాశాలలు ఉన్నట్టుండి దివాలా పేరుతో మూతపడ్డ విషయం తెలిసిందే. దీంతో ఆ కాలేజీల్లో చదువుతున్న సుమారు 2వేల మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ మూడు కళాశాలలు రీఓపెన్ అయినట్లు తెలుస్తోంది. టొరంటోకు చెందిన ఓ విద్యా సంస్థ..

Canada: మూతపడ్డ మూడు కాలేజీలు రీఓపెన్.. భారత విద్యార్థులకు భారీ ఉపశమనం!

ఒట్టావా: కెనడాలో ఈ ఏడాది ప్రారంభంలో మూడు కళాశాలలు ఉన్నట్టుండి దివాలా పేరుతో మూతపడ్డ విషయం తెలిసిందే. దీంతో ఆ కాలేజీల్లో చదువుతున్న సుమారు 2వేల మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ మూడు కళాశాలలు రీఓపెన్ అయినట్లు తెలుస్తోంది. టొరంటోకు చెందిన ఓ విద్యా సంస్థ వీటిని కొనుగోలు చేసిందని సమాచారం. దాంతో క్లాసులు కూడా ప్రారంభం అయ్యాయి. ఇది మన విద్యార్థులకు భారీ ఉపశమనం అనే చెప్పాలి. అయితే, ఈ 2వేల మందిలో 502 మంది విద్యార్థులు కరోనా కారణంగా స్వదేశంలో ఉంటూ దాదాపు ఏడాదిన్నర పాటు ఆన్‌లైన్ ద్వారా క్లాసులు విన్నారు. ఇప్పుడు కరోనా పరిస్థితులు సద్దుమణగడంతో తిరిగి కెనడా వెళ్లి క్యాంపస్‌లో ఉంటూ కాలేజీలకు వెళ్లాలని అనుకున్నారు. కానీ, వీరిలో చాలా మందికి స్టడీ వీసాలు దొరకడం లేదట. దీంతో భారత్‌లో చిక్కుకున్న విద్యార్థులు తాము చెల్లించిన ఫీజులు తిరిగి ఇవ్వాలని, లేనిపక్షంలో తమను స్పెషల్ వీసాలపై కెనడా తీసుకెళ్లి తమ కోర్సులు పూర్తి అయ్యేలా చూడాలని కాలేజీల యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇక కాలేజీలు మూతపడ్డ తర్వాత విద్యార్థులు భారీ స్థాయిలో నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే. 


ఇదిలాఉంటే.. ఉన్నత విద్య కోసం ఏటా వేలాది మంది భారతీయ విద్యార్థులు కెనడా వెళ్తూ ఉంటారు. ఇలా ఉన్నత చదువుల కోసం వెళ్లిన 2వేల మంది విద్యార్థులను మూడు కెనడా కాలేజీలు మోసం చేశాయి. మాంట్రియల్‌లోని రైజింగ్ ఫీనిక్స్ ఇంటర్నేషనల్ ఇంక్ ఎం కాలేజ్, షెర్‌బ్రూక్‌లోని సీఈడీ కాలేజ్, క్యూబెక్‌లోని లాంగ్యూయిల్‌లోని సీసీఎస్‌క్యూ కాలేజీలు ఒక్కసారిగా మూతపడ్డాయి. విద్యార్థుల నుంచి ముందుగానే భారీగా ఫీజులను వసూలు చేసిన కళాశాలల యాజమాన్యాలు.. ఆ తర్వాత దివాలా పేరుతో కాలేజీలను మూసేశాయి. కోర్సులు పూర్తి కాకముందే కాలేజీలు మూతపడటంతో భారతీయ విద్యార్థులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 16న రోడ్లపై నిరనలు తెలిపారు. కెనడా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇతర కాలేజీల్లో తమ కోర్సులు పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. కాలేజీలు మూసివేసే ముందు తమ నుండి లక్షల రూపాయాలు ఫీజులు వసూలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా విద్యార్థులు తెలియజేశారు.

Updated Date - 2022-04-03T17:21:01+05:30 IST