మూడు బస్సులు మారాలి

ABN , First Publish Date - 2022-01-29T05:17:09+05:30 IST

కొత్త జిల్లాలు ఏర్పాటైతే ఆ గ్రామాల ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. జిల్లా కేంద్రానికి వెళ్లాంటే మూడు బస్సులు మారాలి. 130 కిలోమీటర్లు ప్రయాణించాలి.

మూడు బస్సులు మారాలి
నల్లమేకలపల్లి ఏరియల్‌ వ్యూ

130 కి.మీ. దూరంలో కొత్త జిల్లా కేంద్రం
కొండమీది గ్రామాల ప్రజల తీవ్ర అసంతృప్తి


కొత్త జిల్లాలు ఏర్పాటైతే ఆ గ్రామాల ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. జిల్లా కేంద్రానికి వెళ్లాంటే మూడు బస్సులు మారాలి. 130 కిలోమీటర్లు ప్రయాణించాలి. పోయేటప్పుడు పర్వాలేదుగానీ.. తిరిగి వచ్చేటప్పుడు నరకం కనిపిస్తుంది. కారణం సరైన రవాణా సౌకర్యం లేకపోవడమే. ప్యాపిలి మండలంలోని కొండమీది గ్రామాల కష్టాలు ఇవి. ఇప్పుడు విభజనలో ప్రభుత్వం వీటిని నంద్యాలలో చేరుస్తోంది.

డోన్‌, జనవరి 28: పాలనా సౌకర్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు కావాలి. జిల్లా కేంద్రం అందుబాటులోకి రావాలి. సేవలు మరింత దగ్గరవ్వాలి. రాజకీయ ప్రయోజనాల కోసమే జిల్లా విభజన చేపడితే అంతా అస్తవ్యస్తం అవుతుంది. జిల్లాలో అదే జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నంద్యాల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే తాము ఇబ్బందిపడాల్సి వస్తుందని డోన్‌ నియోజకవర్గంలోని ప్యాపిలి మండలవాసులు అంటున్నారు. ముఖ్యంగా నల్లమేకలపల్లి గ్రామస్థులకు సంకటంగా మారనుంది. ఇప్పుడు ఆ ఊరి వాళ్లు జిల్లా కేంద్రం కర్నూలుకు రావాలంటే 95 కి.మీ. ప్రయాణిస్తున్నారు. ప్యాపిలికి వచ్చి అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి ఒకే బస్సులో చేరుకుంటున్నారు. కొత్త జిల్లా నంద్యాలకు వెళ్లాలంటే 130 కి.మీ. ప్రయాణించాలి. మండలంలోని చాలా ఊళ్ల జనాలకు ఈ ఇబ్బంది ఎదురవుతుంది.

కొండ మీది గ్రామాలకు కొత్త కష్టాలు

ప్యాపిలి మండలంలోని కొండమీది గ్రామాలకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేదు. రాచర్ల, బూరుగల, నేరేడిచెర్ల, బోంచెర్వుపల్లి, సిద్దనగట్టు తదితర గ్రామాల ప్రజల ప్రయాణ కష్టాలు చెప్పనలివి కావు. గతంలో కొండమీది గ్రామాల ప్రజలు ప్యాపిలికి వచ్చి హైవే మార్గంలో కర్నూలు చేరుకునే వారు. నంద్యాల జిల్లాలో చేర్చితే ఆ పరిస్థితి ఉండదు. ప్యాపిలికి వచ్చి అక్కడి నుంచి డోన్‌కు రావాల్సి ఉంటుంది. డోన్‌ నుంచి నంద్యాలకు రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే. జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే.. ఎన్ని బస్సులు ఎక్కి దిగాలో అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు రెండు గంటల్లో సులభంగా జిల్లా కేంద్రానికి చేరుకునే తాము.. నంద్యాల జిల్లా అయితే నాలుగు గంటలపైనే పడుతుందని అంటున్నారు. తిరుగు ప్రయాణంలో రవాణా సదుపాయం ఉండదని, అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నల్లమేకలపల్లి, మామిళ్లపల్లి, డి.రంగాపురం, రాచవాండ్లపల్లి, రాంపురం, కౌలుపల్లి, బోయవాండ్లపల్లి తదితర గ్రామాలకు కర్నూలు జిల్లా కేంద్రం 95 కి.మీ. దూరంలో ఉంది. కొత్తగా నంద్యాల జిల్లా ఏర్పడితే ఈ దూరం భారీగా పెరుగుతుంది. జిల్లా కేంద్రానికి పనుల నిమిత్తం వెళ్లాలంటే 130 కి.మీ. ప్రయాణించాలి. అందులోనూ రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే. దీనివల్ల ఆర్థిక భారమేగాక రాకపోకలకు ఇబ్బందిపడాల్సి వస్తుందని వారు అంటున్నారు.

కర్నూలులోనే ఉంచాలి

మా ఊరి నుంచి నంద్యాల వెళ్లాలంటే మూడు బస్సులు మారాలి. ఇక్కడ నుంచి ప్యాపిలికి ఒక బస్సులో వెళ్లాలి. అక్కడి నుంచి మరో బస్సులో డోన్‌కు వెళ్లాలి. అక్కడి నుంచి రైలు లేదా మరో బస్సులోనో నంద్యాల చేరుకోవాలి. ప్యాపిలి మండలాన్ని కర్నూలు జిల్లాలోనే ఉంచాలి.

- సోమశేఖర్‌, నల్లమేకలపల్లి గ్రామం

120 కి.మీ. ఎలా వెళ్లాలి?

మా ఊరి నుంచి నంద్యాల దాదాపు 120 కి.మీ. దూరంలో ఉంది. రవాణా సౌకర్యాలు ఏ మాత్రం లేవు. ఇలాంటప్పుడు నంద్యాలకు వెళ్లాలంటే ఎలా? మా మండలాన్ని కర్నూలు జిల్లాలోనే ఉంచితే మంచిది.

- ఈశ్వర్‌ రెడ్డి, రాచర్ల గ్రామం

డోన్‌ను కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలి

డోన్‌(రూరల్‌), జనవరి 28: డోన్‌ నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ధర్మవరం రంగనాయకులు హెచ్చరించారు. శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ధర్మవరం రంగనాయకులు మాట్లాడుతూ డోన్‌కు 50 కి.మీ. ఉన్న కర్నూలును కాదని 120 నుంచి 140 కి.మీ. ఉన్న నంద్యాల జిల్లాలో డోన్‌ను కలుపుతూ నిర్ణయం తీసుకోవడం అసంబద్ధంగా ఉందన్నారు. దీంతో డోన్‌, ప్యాపిలి మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతారన్నారు. తమకు విద్య, వైద్యం, మార్కెటింగ్‌ సదుపాయాలు కర్నూలు జిల్లాలోనే అనువుగా ఉంటాయన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ సత్యదీప్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రైతుకూలీ సంఘం నాయకులు దొరపల్లిరాజు, ఐఎఫ్‌టీయూ నాయకులు చిన్నస్వామి, మల్లికార్జున, జయరాముడు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T05:17:09+05:30 IST