Advertisement
Advertisement
Abn logo
Advertisement

హైదరాబాద్‌లో రెమిడెసివిర్‌ బ్లాక్‌ మార్కెట్‌ దందా..

  • ఇప్పటి వరకు 40 మంది నిందితులు.. 
  • 200 ఇంజెక్షన్లు స్వాధీనం
  • తాజాగా ముగ్గురు అరెస్టు

హైదరాబాద్‌ సిటీ : కరోనా బాధితులకు ప్రాణాధారంగా నిలిచిన రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల బ్లాక్‌ మార్కెటింగ్‌ ఆగడం లేదు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండడం లేదు. ఎక్కడో ఓ చోట ఇలాంటి ముఠాలు తమ వ్యాపారం సాగిస్తూనే ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలో మూడు కమిషనరేట్లలో 20కిపైగా కేసులు నమోదయ్యాయి. 40మందికి పైగా నిందితులు అరెస్టు అయ్యారు. 200కి పైగా రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వలపన్ని ముగ్గురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో చాలా మంది మెడికల్‌ షాపు నిర్వాహకులు, డీలర్లు లేదా కొందరు హెటిరో, ఇతర ఫార్మా కంపెనీ ఉద్యోగులు కూడా చిక్కారు.

మరో ముగ్గురి అరెస్టు

రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు బ్లాక్‌మార్కెట్‌లో విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను సెంట్రల్‌ టాస్క్‌ఫోర్స్‌పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామ్‌నగర్‌ నివాసి వై.ప్రవీణ్‌కుమార్‌ (30) నిరుద్యోగి. ఉప్పల్‌ నివాసి జి.రాజు (22) స్థానికంగా జ్యోతి మెడికల్‌ హాల్‌లో పని చేస్తున్నాడు. పార్శిగుట్ట వాసి ఎం.రాజేందర్‌ (24) కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. కొవిడ్‌-19 పేషెంట్లకు అత్యవసరంగా భావించే రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను బ్లాక్‌లో విక్రయించేందుకు సిద్ధమయ్యారు. మెడికల్‌ షాపులో పని చేసే వారి స్నేహితుడైన రాజును సంప్రదించి రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు తీసుకురావాలని కోరారు. అతను ఇంజెక్షన్లను సమకూర్చగా మిగతా ఇద్దరూ కలిసి పదింతలు ధరలు (రూ. 35వేలు) పెంచి అవసరమైన వారికి విక్రయిస్తున్నారు. నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బ్లాక్‌మార్కెటింగ్‌ సాగుతోందన్న సమాచారం అందుకున్న సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ముగ్గురు నిందితులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి నుంచి రెండు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం వారిని నల్లకుంట పోలీసులకు అప్పగించారు.

Advertisement
Advertisement