దోపిడీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-10-04T05:30:00+05:30 IST

బంగారు నగలు కుదువ పెడతామని నమ్మబలికి రూ.4.5 లక్షల దోచుకెళ్లిన నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు మదనపల్లి రూరల్‌ సీఐ శివాంజనేయులు, బి.కొత్తకోట ఎస్‌ఐ రామ్మోహన్‌ తెలిపారు. బి.కొత్తకోటలో మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

దోపిడీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్‌
నిందితుల అరెస్ట్‌ చూపుతున్న పోలీసులు

రూ.4.5 లక్షల నగదు స్వాధీనం

బి.కొత్తకోట, అక్టోబరు 4: బంగారు నగలు కుదువ పెడతామని నమ్మబలికి రూ.4.5 లక్షల దోచుకెళ్లిన నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు మదనపల్లి రూరల్‌ సీఐ శివాంజనేయులు, బి.కొత్తకోట ఎస్‌ఐ రామ్మోహన్‌ తెలిపారు. బి.కొత్తకోటలో మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బి.కొత్తకోటలోని వెంకటప్ప అనే వ్యక్తి నుంచి నగదు దోచుకెళ్లిన సత్యసాయి జిల్లా కదిరికి చెందిన టి.వెంకట్రమణ (38), శరవణ్‌ కుమార్‌ (19), మోహన్‌కుమార్‌ (18)లను అరెస్ట్‌ చేసి నిందితుల నుంచి 4.5 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. సత్యసాయి జిల్లా కదిరికి చెందిన తమ్మినేని వెంకట్రమణ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇతడికి ఆనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఏదో విధంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో తన భార్య అక్క కుమారులైన శరవణ్‌కుమార్‌, మోహన్‌కుమార్‌లతో కలసి బి.కొత్తకోటకు చేరుకున్నారు. స్థానిక మెయిన్‌ బజారు సమీపంలో కుదువ వ్యాపారి వద్ద పనిచేస్తున్న వెంకటప్పతో ఎక్కువ విలువ కలిగిన బంగారు నగలు కుదువ పెడతామని నమ్మబలికారు. వెంకటప్ప వద్ద నుంచి రూ.4.5 లక్షలు దోచుకుని పారిపోయారు. వెంకటప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి మల్లెల క్రాస్‌ వద్ద నిందితులను ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2022-10-04T05:30:00+05:30 IST