Nupur ను బెదిరించడం మన సంస్కృతి కాదు: Uma Bharti

ABN , First Publish Date - 2022-06-09T01:00:13+05:30 IST

మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండైన నుపుర్ శర్మకు కొందరి నుంచి బెదరింపులు..

Nupur ను బెదిరించడం మన సంస్కృతి కాదు: Uma Bharti

న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండైన నుపుర్ శర్మ (Nupur sharma)కు కొందరి నుంచి బెదరింపులు వస్తుండటంపై ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి (Uma Bharati) స్పందించారు. బెదిరింపులు ఎంతమాత్రం భారతీయ సంస్కృతి కాదని అన్నారు. ''పార్టీ ప్రతినిధి (నుపర్ శర్మ)ని బీజేపీ సస్పెండ్ చేసింది. ముస్లిం దేశాల స్పందనపై భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) సమర్ధవంతంగా జవాబిచ్చింది. కానీ, నుపుర్ శర్మకు బెదిరింపులు రావడం అనేది మాత్రం భారతీయ సంస్కృతి కాదు. ఇదంతా యూపీ ఎన్నికల సమయంలో మొదలైంది. ప్రతి రాజకీయ పార్టీ విషం చిమ్ముతూ, ఉద్రిక్త పరిస్థితులు సృష్టించాయి'' అని ఉమాభారతి అన్నారు.


ఒక టీవీ  చర్చా కార్యక్రమంలో మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాన్పూర్‌లో అల్లర్లకు దారితీసింది. పలు ముస్లిం దేశాలు నుపర్ వ్యాఖ్యలను ఖండించాయి. దీంతో అన్నిమతాలను, మనోభావాలను భారత్ గౌరవిస్తుందని బీజేపీ ప్రకటన చేయడంతో పాటు నుపుర్ శర్మపై సస్పెన్షన్ వేటు వేసింది. నుపర్ సైతం బేషరతుగా తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ పలు చోట్ల నుపుర్‌పై కేసులు నమోదు కావడం, బెదిరింపులు వస్తుండటంతో నుపర్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఆమెకు భద్రత కల్పించారు.

Updated Date - 2022-06-09T01:00:13+05:30 IST