మ్యుటేషన్‌కు ముప్పుతిప్పలు..!

ABN , First Publish Date - 2022-04-24T04:40:39+05:30 IST

రైతుల భూముల క్రయ, విక్రయాలు, భాగ పరిష్కారం అనంతరం రెవెన్యూ రికార్డుల్లో చేసుకునే మ్యుటేషన్‌ విషయంలో రెవెన్యూ అధికారుల తీరు మారడం లేదు.

మ్యుటేషన్‌కు ముప్పుతిప్పలు..!

తీరు మారలేదు.. రైతుకు తిప్పలు తప్పలేదు

భారీగా క్లయిమ్‌ల తిరస్కరణ

ఆర్‌వోఆర్‌ చట్టానికి తహసీల్దార్ల తూట్లు

పైసలొచ్చే ఫైళ్లకు ఓకే.. సామాన్యుడికి చుక్కలు


రైతుల భూముల క్రయ, విక్రయాలు, భాగ పరిష్కారం అనంతరం రెవెన్యూ రికార్డుల్లో చేసుకునే మ్యుటేషన్‌ విషయంలో రెవెన్యూ అధికారుల తీరు మారడం లేదు. అయిన వారికి ఓ విధంగా కాని వారికి మరో విధంగా వ్యవహరిస్తున్నారు. క్లయిమ్‌ల పరిష్కారంలో రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. పైసలొచ్చే వాటిని అప్పటికప్పుడే పరిష్కరిస్తుండగా, సామాన్య రైతులను నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 



మదనపల్లె, ఏప్రిల్‌ 23: ఆర్‌వోఆర్‌ చట్టం ప్రకారం మ్యుటేషన్‌ క్లయిమ్‌ను నిర్ణీత గడువులోగా (30 రోజులు) పరిష్కరించాలి. మీ-సేవా కేంద్రం, గ్రామ సచివాలయం సర్వీసుల్లో ఫారం-6 (క్లయిమ్‌) దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోపు రైతుకు ఫారం-8 నోటీసు జారీ చేయాలి. ఒక క్లయిమ్‌ విచారణ ప్రారంభంలో ఇది మొదటి ప్రక్రియ. తర్వాత విచారణ చేపట్టాలి. కానీ ఇవేమీ జరగడం లేదు. ఫారం-8 జారీ చేయకుండానే ఎక్కువ క్లయిమ్‌లు తిరస్కరిస్తున్నారు. అంటే విచారణ మొదలు పెట్టకుండానే అనుకున్న పని ముగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రైతుకు ఏమాత్రం సమాచారం ఇవ్వడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. డ్యాష్‌బోర్డులో పెండెన్సీని తగ్గించుకోవడానికి జిల్లా అధికారుల సమీక్ష సమావేశాల్లో అంకెల గారడీ ప్రదర్శిస్తున్నారు. కలెక్టర్‌ సమీక్షల్లో తహసీల్దార్లకు తలంటుతున్నా..వారిలో మార్పు రావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.


ఎవరిది ఎంత పాత్ర

మ్యుటేషన్‌ క్లయిమ్‌ వచ్చిన వెంటనే డిప్యూటీ తహసీల్దార్‌...తహసీల్దార్‌ లాగిన్‌లో ఫారం-8 జనరేట్‌ చేసి వీఆర్వో ద్వారా రైతుతో పాటు సంబంధిత వ్యక్తులకు జారీ చేయాలి. తహసీల్దార్‌ కార్యాలయంలో డీటీ ఎక్కడా ఆ పనిచేయడం లేదు. ప్రైవేటు కంప్యూటర్‌ ఆపరేటర్‌తో తహసీల్దార్‌ కార్యాలయంలో ఆ పనులు కానిస్తున్నారు. క్లయిమ్‌లను వీఆర్వో, ఆర్‌ఐ, సర్వేయర్‌ విచారణ చేసి తహసీల్దార్‌కు క్లయిమ్‌ ఫైలు అందజేయాలి. కానీ సకాలంలో విచారణ చేసి ఇవ్వడం లేదనే కారణం చూపుతూ తహసీల్దార్లు వాటిని తిరస్కరిస్తున్నారు.


ఎస్‌ఎల్‌ఏ చెబుతోంది ఇదేనా?

మ్యుటేషన్‌ క్లయిమ్‌లను తిరస్కరించడంతో పాటు కొన్నింటిని కనీసం చూడకుండానే నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారు. దీంతో సర్వీసు లెవల్‌ అగ్రిమెంటు (ఎ్‌సఎల్‌ఏ) వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. మీ-సేవ, గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లించి క్లయిమ్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. నిర్ణీతకాలం (30 రోజులు) పూర్తయి 360 రోజులు దాటినా ఆ సర్వీసు అర్జీదారునికి అందడం లేదు. ఇక ఎక్కడి లోపమన్నది రెవెన్యూ సర్వీసులపై నిత్యం సమీక్షిస్తున్న ఉన్నతాధికారులే చెప్పాలి.


విచారణ లేదు..ఎండార్స్‌మెంట్‌ లేదు...

ఒక మ్యుటేషన్‌ క్లయిమ్‌కు ఫారం-8 జారీ అనంతరం విచారణ పూర్తి చేయాలి. ఇందులో అర్హత కలిగిన అభ్యంతరాలు వచ్చినప్పుడు మాత్రమే క్లయిమ్‌ను తిరస్కరించాలి. లేదా క్లయిమ్‌దారుడు సరైన భూమిపత్రాలు (డాక్యుమెంట్లు) గడువులోగా సమర్పించకుంటే ఆర్‌వోఆర్‌ చట్టం ప్రకారం ఎండార్సుమెంట్‌ తయారు చేసి క్లయిమ్‌దారునికి జారీ చేయాలి. కానీ క్లయిమ్‌దారుడైన రైతుకు ఫారం-8 జారీ చేయకుండా, విచారణ చేపట్టకుండా ఆన్‌లైన్‌లో పెండింగ్‌ పెడుతున్నారు. మరోవైపు సహేతుకమైన కారణం లేకుండా తహసీల్దార్‌ తిరస్కరించిన క్లయిమ్‌లలో 25 శాతం ఆర్డీవో, సబ్‌ కలెక్టర్‌ పరిశీలించాలని ఇటీవల సీసీఎల్‌ఏ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు కేసులు, కుటుంబ వివాదాలు ఉన్నాయని, ఈసీ, పాత పట్టాదారు పాసుపుస్తకం (అమ్మినవారు) ఇవ్వలేదని తహసీల్దార్లు క్లయిమ్‌లను తిరస్కరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. చట్టంలోని లోపాలు, లొసుగులను ఆసరాగా చేసుకున్న కొందరు రెవెన్యూ సిబ్బంది కోర్టు కేసులను తమకు అనుకూలంగా మలుచుకుని నాలుగురాళ్లు వెనుకేసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. 


సమీక్షలో అంకెల గారడీ

రెవెన్యూ సర్వీసులపై జిల్లా ఉన్నతాధికారులు నిర్వహించే సమీక్ష సమావేశంలో ఆయా తహసీల్దార్లు అంకెల గారడీ ప్రదర్శిస్తున్నారు. ఎక్కువ క్లయిమ్‌లను తిరస్కరించకూడదనే నిబంధనతో కలెక్టర్‌, జేసీలు సమీక్ష నిర్వహిస్తుండగా, కొందరు రెవెన్యూ అధికారులు అందుకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. పైగా ఒక నెల గడువు (కటా్‌ఫ)గా తీసుకుని సమీక్షిస్తుండటం కూడా వీరికి కలిసొస్తోంది. దీంతో ఆ నెలకు కావాల్సిన డేటా ఫ్రొఫార్మాలో ఉండేటట్లు జాగ్రత్త పడుతున్నారు. ఉదాహరణకు మూడు నెలల వ్యవధిలో మ్యుటేషన్ల క్లయిమ్‌లు 300 వచ్చాయనుకుంటే, వీటిలో 30 పరిష్కరించి, పదింటిని తిరస్కరిస్తున్నారు. మిగిలిన వాటిలో 30 రోజుల గడువు సమయం కాలంలోనికి కొన్ని, మరికొన్ని నెలలు, ఏళ్ల తరబడి ఉన్న పెండెన్సీ కాలంలోకి తోసేస్తున్నారు. సమీక్షలో ఒకనెల వ్యవధిని ప్రామాణికంగా తీసుకుంటుండటంతో వచ్చే నెల సమీక్షకు కావాల్సిన డేటాను పరిష్కారానికి గడువు ఉన్న, గడువు మీరిన కాలంలోని అంకెలతో కాకిలెక్కలు చూపిస్తున్నారు.


తలంటుతున్న కలెక్టర్‌

సేవల్లో ముఖ్యంగా మ్యుటేషన్‌ క్లయిమ్‌ల పరిష్కారంలో వెనుకబడిన తహసీల్దార్లకు సమీక్ష సమావేశాల్లో కలెక్టర్‌ తలంటుతున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు నెలల క్రితం జరిగిన సమీక్షలో కలెక్టర్‌ హరినారాయణన్‌ ముగ్గురు తహసీల్దార్లకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. అప్లికెంట్‌ నీ దగ్గరికి వచ్చి కలవలేదనా? ఇన్ని క్లయిమ్‌లు తిరస్కరించావ్‌, పెండింగ్‌ పెట్టావ్‌ అంటూ గట్టిగా మందలించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అలాగే తిరుపతి జిల్లాలో ఇటీవల జరిగిన సమీక్షలో కలెక్టర్‌ మ్యుటేషన్‌ క్లయిమ్‌ల తిరస్కరణలో తొమ్మిదిమంది తహసీల్దార్లుకు షోకాజ్‌ నోటీసులు జారీకి ఆదేశాలిచ్చారు.


ఉదాహరణకు తీసుకుంటే

కురబలకోట మండలంలో మొత్తం ఆరు రెవెన్యూ గ్రామాల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు రైతుల నుంచి మొత్తం 310 క్లయిమ్‌లు వచ్చాయి. వీటిలో 29 పరిష్కారం కాగా 11 తిరస్కరించారు. మిగిలిన వాటిలో 103 క్లయిమ్‌లు పరిష్కారం గడువులో ఉండగా, 167 క్లయిమ్‌లపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా పెండింగ్‌లో ఉన్నాయి. అంటే ఎస్‌ఎల్‌ఏ నిబంధన ప్రకారం 30 రోజుల్లో పరిష్కరించకుండా, తిరస్కరించకుండా, కనీసం పరిశీలించకుండా...ఇలా నెలల తరబడి పెండెన్సీలో పెట్టేశారు. వీటిలో కురబలకోటలో 15 క్లయిమ్‌లు, ముదివేడులో 52, మట్టివారిపల్లె, అంగళ్లులో 28, తెట్టులో 20, పిచ్చలవాండ్లపల్లె రెవెన్యూ గ్రామంలో అయిదు క్లయిమ్‌లు పెండింగ్‌ జాబితాలో ఉన్నాయి. అలాగే మదనపల్లె డివిజన్‌లోని మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. ముఖ్యంగా క్లయిమ్‌ల తిరస్కరణ, ముడుపుల వసూళ్ల వ్యవహారం ఎక్కువగా కనిపిస్తోంది. సొమ్ములిచ్చిన వారికి రోజుల్లోనే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తుండగా, సామాన్యులకు కొర్రీలు పెడుతూ చుక్కలు చూపిస్తున్నారనే ఆరోపణలున్నాయి.


అర్హత క్లయిమ్‌లను స్వీకరిస్తాం

-ఎం.ఎస్‌.మురళి, ఆర్డీవో, మదనపల్లె

భూమి హక్కు బదలాయింపులో భాగంగా అర్హత కలిగిన క్లయిమ్స్‌ను పరిగణనలోకి తీసుకుంటాం. నమోదవుతున్న క్లయిమ్స్‌లో చాలా వాటికి సరైన పత్రాలు ఉండటం లేదు. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్న వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తహసీల్దార్లకు సమీక్ష సమావేశాల్లో ఆదేశించా. గడువులోగా పరిష్కరించడం లేదా ఎండార్స్‌మెంట్‌ ఇవ్వాలని సూచించా. ఉద్దేశపూర్వకంగా తిరస్కరించిన, ఏ నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టిన తహసీల్దార్‌లపై చర్యలు తీసుకుంటా.

Updated Date - 2022-04-24T04:40:39+05:30 IST