లైపోప్రొటీన్లతో గుండెకు ముప్పు

ABN , First Publish Date - 2022-01-18T05:30:00+05:30 IST

లైపోప్రొటీన్‌(ఎ) పరీక్షతో రక్తంలోని లైపోప్రొటీన్ల మోతాదు తెలుస్తుంది.

లైపోప్రొటీన్లతో గుండెకు ముప్పు

గుండెపోటు కారకాల్లో లైపోప్రొటీన్లు ప్రధానమైనవి. కాబట్టి వాటి మీద ఓ కన్నేసి ఉంచాలి. రిస్క్‌ ఉన్నవాళ్లు ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి.


లైపోప్రొటీన్‌ మోతాదు 30 మిల్లీగ్రామ్‌/డెసిలీటర్‌ను మించితే, గుండెపోటు, కొరొనరీ హార్ట్‌ డిసీజ్‌ అవకాశాలు పెరుగుతాయి. లైపోప్రొటీన్‌ మోతాదు 50 మిల్టీగ్రామ్‌/డెసిలీటర్‌ను మించితే, ఇస్ఖిమిక్‌ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి.


లైపోప్రొటీన్‌(ఎ) పరీక్షతో రక్తంలోని లైపోప్రొటీన్ల మోతాదు తెలుస్తుంది. రక్తం గుండా కొలెస్ట్రాల్‌ను సరఫరా చేసే లైపోప్రొటీన్లు ప్రొటీన్‌, కొవ్వుతో తయారై ఉంటాయి. లైపోప్రొటీన్‌(ఎ) అనేది చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డిఎల్‌). దీని మోతాదు పెరిగితే గుండె జబ్బుకు గురయ్యే అవకాశాలూ పెరుగుతాయి. 


పరీక్ష ఎవరికి?

ఇది రొటీన్‌ పరీక్ష కాదు. గుండెపోటు, లేదా గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఉన్న వారికి మాత్రమే ఈ పరీక్షను వైద్యులు సూచిస్తారు. కుటుంబ చరిత్రలో గుండెజబ్బులు ఉన్నవాళ్లు ఈ పరీక్ష చేయించుకోవడం అవసరం.


ఇతరత్రా లిపిడ్‌ పరీక్షల ఫలితాలు నార్మల్‌గానే ఉన్నప్పటికీ, గుండె జబ్బుకు లోనైనవాళ్లు ఈ పరీక్ష చేయించుకోవాలి.

ఆరోగ్యకరమైన ఆహార, జీవనశైలులు అనుసరిస్తున్నప్పటికీ కొలెస్ర్టాల్‌ అదుపులోకి రాకపోతున్నా ఈ పరీక్ష చేయించుకోవడం అవసరం.

కుటుంబ చరిత్రలో... గుండె జబ్బులు ఉన్నా, మరీముఖ్యంగా 40 ఏళ్లలోపు గుండెజబ్బుకు లోనైనవాళ్లు ఉన్నా, లేదా గుండెజబ్బుతో హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయిన వాళ్లు ఉన్నా, ఆ కుటుంబసభ్యులు తప్పనిసరిగా ఈ పరీక్ష చేయించుకోవాలి. 


లైపోప్రొటీన్ల అదుపు ఇలా....

గుండెకు మేలు చేసే జీవనశైలిని అలవరుచుకోవాలి.

క్రమం తప్పక వ్యాయామం చేయాలి. వ్యాయామంతో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి, మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది.

శరీర బరువు అదుపులో ఉంచుకోవాలి. 3 నుంచి 5% శరీర బరువును తగ్గించుకున్నా మంచి కొలెస్ట్రాల్‌ పెరిగి, చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.

విపరీతమైన ఒత్తిడితో చెడు కొలెస్ర్టాల్‌ పెరుగుతుంది

ధూమపానం మానేయాలి, మద్యపానం పరిమితం చేయాలి.

గుండె, రక్తనాళాలు రికవర్‌ కావడానికీ, రిపేర్‌ చేసుకోవడానికీ కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి అని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సిడిసి) పేర్కొంది. 

మోనోశాచురేటెడ్‌ కొవ్వులు లైపోప్రొటీన్‌ మోతాదులను తగ్గిస్తాయి. కాబట్టి ఆ కొవ్వులు ఉండే బాదం తింటూ ఉండాలి.

ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లతో కూడిన చేప నూనెలు లైపోప్రొటీన్‌ మోతాదులను తగ్గిస్తాయి. కాబట్టి ఆ సప్లిమెంట్లను తింటూ ఉండాలి.


చికిత్స ఇదే!

స్టాటిన్స్‌, ఫేబ్రేట్స్‌ మొదలైన సంప్రదాయ మందులకు సాధారణంగా లిపిడ్‌ మోతాదులు అదుపులోకి రావు. లిపిడ్స్‌ను అదుపులోకి తీసుకురాగల ప్రతిభావంతమైన ఏకైక మందుగా నయాసిన్‌ నిరూపించుకుంది. అందుకోసం అధిక మోతాదుల్లో రోజుకు రెండు నుంచి మూడు గ్రాముల నయాసిన్‌ను తీసుకోవలసి ఉంటుంది. అయితే అధిక మోతాదుల్లో నయాసిన్‌ తీసుకోవడం వల్ల తలనొప్పి, కాలేయంలో టాక్సిన్లు పెరగడం లాంటి దుష్ప్రభావాలు చోటు చేసుకునే అవకాశాలుంటాయి. కాబట్టి ఈ చికిత్స వైద్యుల పర్యవేక్షణలో సాగాలి. ఈస్ట్రోజన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ వల్ల కూడా లైపోప్రొటీన్‌ తగ్గుతుంది. అయితే ఈ చికిత్స పోస్ట్‌ మెనోపాజ్‌ దశకు చేరుకున్న మహిళలకు మాత్రమే పరిమితం. 


ఆరోగ్య సమస్యలతో....

కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా లైపోప్రొటీన్‌ మోతాదును పెంచుతాయి. అవేంటంటే...

హైపోథైరాయిడిజం

అదుపు తప్పిన మదుమేహం

మూత్రపిండాల వ్యాధులు


ఆహారంతో తగ్గించవచ్చు

ఒమేగా3 ఫ్యాటీ ఆయిల్స్‌, నట్స్‌, ఆలివ్‌ ఆయిల్‌ వాడకం పెంచాలి.

ఎక్కువ నట్స్‌, కూరగాయలు, పండ్లు తినాలి

అవిసె గింజలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఒమేగా3తో పాటు పీచు అధికంగా ఉంటుంది.

Updated Date - 2022-01-18T05:30:00+05:30 IST