Abn logo
Jul 16 2020 @ 00:40AM

బీసీ రిజర్వేషన్లకు ముప్పు

కేంద్ర ప్రభుత్వోద్యోగాలలో ఓబీసీల ప్రాతినిధ్యం నేటికీ 21 శాతమే. ఐఐటీ, ఐఐఎం మొదలైన ఉన్నత విద్యా సంస్థలలో ఓబీసీ కోటా 27% భర్తీ కావడం లేదు. 52% జనాభా కలిగిన ఓబీసీల ప్రాతినిధ్యం విద్యా ఉద్యోగాలలో 27% శాతానికి చేరుకోలేదనేది స్పష్టం. కేవలం ఆదాయ పరిమితి ప్రాతిపదికన లక్షలాది ఓబీసీలను రిజర్వేషన్ల పరిధి తొలగించడం రాజ్యాంగ స్ఫూర్తికి, న్యాయస్థానాల తీర్పులకు విరుద్ధం కాదా? ఓబీసీలకు న్యాయం జరగాలంటే తక్షణమే బీపీ శర్మ కమిటీ రిపోర్టును రద్దు చేయాలి.


వెనుకబడిన కులాల (బీసీ) వారి రిజర్వేషన్లకు ముప్పు ముంచుకొస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2019 లో బి.పి. శర్మ అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో నియమించిన నిపుణుల కమిటీ నివేదికతో ఈ ముప్పు వాటిల్లనున్నది. ఆ నివేదిక ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 12 లక్షలు దాటినట్లయితే ఉద్యోగ హోదాతో సంబంధం లేకుండా లక్షలాది బీసీ విద్యార్థులు, యువజనులు రిజర్వేషన్లకు దూరం కానున్నారు. సదరు కమిటీలో ఒక్క బీసీ సభ్యుడూ లేకపోవడం గమనార్హం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 15(4), 15(5), 16(4) ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల (ఓబీసీ)కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు అమలు పరుస్తున్నాయి. ఆర్థిక వెనుకబాటుతనం ఆ రిజర్వేషన్లకు ప్రాతిపదిక కాదు. 


కేంద్ర ప్రభుత్వం 1993 నుండి ఉద్యోగాలలోనూ, 2008 నుండి కేంద్రీయ విద్యాసంస్థలలోనూ ఓబీసీ లకు (సంపన్న శ్రేణి వారిని మినహాయించి) 27% రిజర్వేషన్లు అమలు పరుస్తున్నారు. సుప్రీమ్ కోర్టు సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం 1993లో జస్టిస్ రామ్ నందన్ ప్రసాద్ అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వారు ఓబీసీలలో సంపన్న శ్రేణివారిని శాస్త్రియబద్ధంగా గుర్తించి సామాజికంగా వృద్ధి చెందిన వారిని రిజర్వేషన్ల పరిధి నుండి తొలగించారు. బీసీ రిజర్వేషన్లు కులపరమైనవి కావని, అవి వర్గపరమైనవని, ఓబీసీ / బిసి జాబితాలలో కొత్త కులాలను చేరుస్తున్నారు కావున ఆయా కులాల్లో సామాజికంగా వృద్ధి చెందిన వారిని రిజర్వేషన్ల నుండి తొలగించాలని ఆ కమిటీ చెప్పింది, సదరు కమిటీ ఓబీసీలలో ఆరు వర్గాలవారి పిల్లలను సంపన్న శ్రేణిగా గుర్తించింది. వారిని రిజర్వేషన్ల నుంచి తొలగించారు. ఈ తొలగింపును అప్పటి ప్రభుత్వం ఆమోదించింది. ఆ ఆరు వర్గాలు: (1) రాజ్యాంగ పదవులలో ఉన్నవారు; (2) తల్లిదండ్రులు గ్రూప్-1, గ్రూపు-2 ఉద్యోగాలలో ఉన్నవారు; (3) ఆర్మీలో కల్నల్ స్థాయి ఆ ఫై ఉద్యోగంలో వారు; (4) పారిశ్రామిక వేత్తలు; (5) ఆస్తులు కలిగినవారు; (6) ఆదాయ పరిమితి. ఆదాయ పరిమితిని 1993లో వార్షిక ఆదాయం ఒక లక్షగా నిర్దారిస్తూ ఇందులో ఉద్యోగుల జీత భత్యాలను, వ్యవసాయ ఆదాయాన్ని మినహాయించారు. అదే విధంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఆదాయ పరిమితిని పెంచాలని పేర్కొంటూ అవసరమైతే రూపాయి విలువ హెచ్చుతగ్గులను బట్టి ముందే ఆదాయ పరిమితిని పెంచాలని సూచించారు.


ఓబీసీ రిజర్వేషన్లు అమలులోకి వచ్చి 27 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయితే ఇప్పటివరకు కేవలం నాలుగు సార్లు మాత్రమే ఆదాయ పరిమితిని పెంచారు. ప్రస్తుతం వార్షిక ఆదాయ పరిమితి ఎనిమిది లక్షలుగా నిర్ణయించి, అందులో జీతభత్యాలు, వ్యవసాయ ఆదాయాలను మినహాయించి ఓబీసీ రిజర్వేషన్లను అమలుపరుస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాయి. మండల్ కమిషన్ సిఫారసుల తీర్పులో సుప్రీమ్ కోర్టు నొక్కి చెప్పిన అంశం: ‘The basis of exclusion should not merely be economic, unless of course the economic advancement is so high that it necessarily means Socially Advancement’ దీనిని బట్టి కుటుంబాల ఆర్ధిక పరిస్థితి కాలంతో సంబంధం లేకుండా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. సంపన్న శ్రేణి నిబంధనలకు అనేక సందర్భాలలో (Indra Sawhaney Vs Union of India [W.P(C) No.699/1995 ], Ashok Kumar Thakur Vs State of Bihar [1995 SCC (5) 403]) సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. జీత భత్యాలతో కాక ఉద్యోగ హోదాతో మాత్రమే సామాజిక గౌరవం పెరుగుతుందనేది స్పష్టం. ఒకవేళ కేంద్రం నిబంధనల ప్రకారం ఇప్పటివరకు తొమ్మిది సార్లు వార్షిక ఆదాయాన్ని పెంచినట్లయితే ఆ ఆదాయ పరిమితి ప్రస్తుతం రూ.30 లక్షలుగా ఉండేది. దీన్ని బట్టి కేంద్రంలోని ప్రభుత్వాలు ఓబీసీ రిజర్వేషన్ల అమలు పై ఎంత నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నాయో అర్ధమవుతుంది. 


కేంద్ర ప్రభత్వ నివేదికల ప్రకారం కేంద్ర ఉద్యోగాలలో ఓబీసీల ప్రాతినిధ్యం నేటికీ 21 శాతంగా మాత్రమే ఉంది. కేంద్ర విద్యా సంస్థలైన ఐఐటీ, ఐఐఎం మొదలగు వాటిలో ఓబీసీ కోటా 27% కూడా భర్తీ కావడం లేదు ఒకవైపు 52% జనాభా కలిగిన ఓబీసీల ప్రాతినిధ్యం విద్యా ఉద్యోగాలలో నేటికీ 27%కి కూడా చేరుకోలేదు. అలాంటప్పుడు లక్షలాది ఓబీసీ విద్యార్థులను, నిరుద్యోగులను కేవలం ఆదాయ పరిమితిని ప్రాతిపదికన రిజర్వేషన్ల పరిధి నుంచి తొలగించడం రాజ్యాంగ స్ఫూర్తికి, న్యాయస్థానాల తీర్పులకు విరుద్ధం కాదా?


ఇటీవల కేంద్ర ప్రభుత్వం అగ్రకులాలలోని పేదలకు Economically Weaker Sections (EWS) పేరిట 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15(6), 16(6) ద్వారా 10% రిజర్వేషన్లను కేంద్ర విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది అందుకు కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షలు. ఈ పరిమితిని ఇతర నిబంధనలతో అమలు చేస్తున్నారు. దీన్ని సాకుగా తీసుకుని బీపీ శర్మ కమిటీ ఓబీసీ రిజర్వేషన్లను కూడా ఆర్థిక పరిమితితో ముడిపెట్టి లక్షలాది ఓబీసీలను రిజర్వేషన్లకు దూరం చేసి, భర్తీ కానీ ఉద్యోగాలను, విద్యాసంస్థల్లో సీట్లను ఓపెన్ కేటగిరి పేరుతో అగ్రకులాల పరం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. 


కేంద్ర ప్రభత్వం 102వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 338Bని చేరుస్తూ జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తిని 2018 నుండి కల్పించి 2019లో ఒక ప్రత్యేక కమిషన్ ను నియమించింది అంటే 2018 నుండి ఓబీసీ/బీసీల రిజర్వేషన్ల అంశాలను ఇకనుండి జాతీయ బీసీ కమిషన్ మాత్రమే పరిశీలించి నివేదిక ఇవ్వాలి. అంటే బీపీ శర్మ కమిటీ నివేదికకు చట్ట బద్ధత కానీ రాజ్యాంగ బద్ధత లేదని స్పష్టమవుతుంది. ఇప్పటికే తమిళనాడు డి.యమ్.కే పార్టీ బీపీ శర్మ కమిటీ రిపోర్టును రద్దు చేయాలని కేంద్రాన్ని కోరింది. అదే విధంగా అన్ని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు సదరు కమిటీ రిపోర్టును ఆమోదించకుండా ఓబీసీలకు న్యాయం చేయాలనీ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే కేంద్ర ప్రభుత్వం బీపీ శర్మ కమిటీ రిపోర్టును రద్దు చేయాలి. బీసీ ఉద్యోగుల జీతభత్యాలను సంపన్న శ్రేణి లెక్కింపులో కలపాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. పాత విధానంలో వార్షిక ఆదాయాన్ని ముప్పై లక్షలకు పెంచాలి. అదే విధంగా రాజ్యాంగ సవరణల ద్వారా (1) ఓబీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి; (2) బీసీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్ విధానాన్ని రద్దు పరిచి రిజర్వేషన్లను 27% నుండి 50% కు పెంచాలి; (3) రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 15(5), 340, 338B, 342A, 366 of 26(C), ఇతర అధికరణలలో పేర్కొన్న Socially and Educationally Backward Classesను Socially and Educationally Backward Castesగా మార్చాలి; (4) అత్యాచార నిరోధక చట్టాన్ని బీసీలకు సైతం వర్తింప చేయాలి; (5) 2021 లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీ కుల గణన చేయాలి; (6) ఓబీసీలకు చట్ట సభలలో 50 % రిజర్వేషన్లు కల్పించాలి; (7) ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించాలి; (8) జాతీయ స్థాయి 15% మెడికల్ సీట్ల భర్తీలో ఓబీసీ రిజర్వేషన్లను అమలు పరచాలి; (9) జాతీయ స్థాయిలో ఓబీసీ కులాలను నాలుగు గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు అమలు పరచాలి; (10) ఓబీసీలకు కేంద్ర స్థాయిలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, జనాభా దామాషా పద్ధతిలో బడ్జెట్ కేటాయింపులు చేయాలి. ఇవి జరగని పక్షంలో బీజేపీ పార్టీ రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదు.

కోడెపాక కుమార స్వామి

రాష్ట్ర అధ్యక్షులు, 

తెలంగాణ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘంAdvertisement
Advertisement
Advertisement