మళ్లీ ముప్పు!

ABN , First Publish Date - 2022-06-10T05:26:56+05:30 IST

కొన్నాళ్ల విరామం అనంతరం ఉమ్మడి జిల్లాలో మళ్లీ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి.

మళ్లీ ముప్పు!


  • పెరుగుతున్న కొవిడ్‌ కేసులు
  • ఫోర్త్‌వేవ్‌గా మారే అవకాశం 
  • మళ్లీ అమల్లోకి ఆంక్షలు 
  • ఎయిర్‌పోర్టులో అప్రమత్తం 
  • విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన

కొన్నాళ్ల విరామం అనంతరం ఉమ్మడి జిల్లాలో మళ్లీ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ కేసులు గణనీయంగా పెరుగుతుండడంతో ఫోర్త్‌వేవ్‌కి ఇది సంకేతాలుగా చెబుతున్నారు. అదే స్థాయిలో ఇక్కడ కేసులు పెరుగుతున్నాయి. మే నెలలో కనిష్ఠ స్థాయిలో నమోదైన కేసులు జూన్‌ ఆరంభం నుంచి క్రమంగా పెరుగుతున్నాయి.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, జూన్‌ 9) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రంగారెడ్డిజిల్లాలో 7వ తేదీ గరిష్టంగా 21 కేసులు నమోదు కావడం గమనార్హం. అలాగే మేడ్చల్‌ జిల్లాలో కూడా రోజూ 5 నుంచి 10 కేసులు వరకు నమోదవుతున్నాయి. గడిచిన మే నెలలో దాదాపు కొవిడ్‌ కేసులు రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌లో కనుమరుగయ్యాయి. తిరిగి జూన్‌ ఆరంభం నుంచి కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 299 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రతి రోజూ దాదాపు వేయికిపైగా టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా హైకోర్టు టెస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించడంతో ఈమేర అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలాఉంటే దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కూడా తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలను అలర్ట్‌ చేసింది. తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, జనసమూహానికి దూరంగా ఉండాలని సూచించింది. పదేళ్లలోపు వారు, 60 ఏళ్లకుపైబడిన వారు అనవసరంగా  ఇళ్ల బయటకు వెళ్లవద్దని, మాస్క్‌లు లేకుండా బయటకు వెళితే జరిమానా విధిస్తామని తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలాఉంటే అధికారిక లెక్కల ప్రకారం కొవిడ్‌ ఆరంభం నుంచి ఇప్పటివరకు రంగారెడ్డిజిల్లాలో 1,33,058 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 71,462 కేసులు కాగా జీహెచ్‌ఎంసీ మినహా ఇతర ప్రాంతాల్లో 61,596 కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం  299 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన

ఇదిలాఉంటే దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు గణనీయంగా పెరుగుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. కొవిడ్‌ కారణంగా గడిచిన రెండేళ్లుగా స్కూల్‌ నడవని విషయం తెలిసిందే. విద్యార్థులంతా ఆన్‌లైన్‌ క్లాస్‌లకే పరిమితమయ్యారు. గడిచిన మూడు నెలలుగా కేసులు తగ్గుముఖం పట్టడంతో విద్యార్థులు స్కూళ్లకు వెళ్లి పరీక్షలకు హాజరయ్యారు. వేసవి సెలవుల అనంతరం స్కూళ్లకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. విద్యార్థులు పుస్తకాలు, యూనిఫాంలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే స్కూళ్లు పునఃప్రారంభంకానున్న సమయంలో మళ్లీ కొవిడ్‌ పెరుగుతున్న వార్తలు తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే రెండేళ్లపాటు  విద్యార్థులు స్కూళ్లకు దూరంగా ఉన్నారు. ఆన్‌లైన్‌ క్లాస్‌ల వల్ల పూర్తిస్థాయిలో చదువుకోలేకపోయారు. అలాగే దీర్ఘకాలికంగా స్కూళ్లకు వెళ్లకపోవడం విద్యార్థుల మానసిక పరిస్థితిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఏడాదైనా విద్యార్థులు గట్టెక్కుతారని భావిస్తున్న తరుణంగా కొవిడ్‌ కేసులు పెరుగుతుండడం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. 

ఎయిర్‌పోర్టులో అప్రమత్తం

దేశంలో కొవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో విమాన ప్రయాణికులపై ఆంక్షలు మొదలయ్యాయి. విమాన ప్రయాణికులందరూ కచ్చితంగా మాస్క్‌లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని విమానయానశాఖ తాజాగా ఆంక్షలు జారీ చేసింది.  మాస్క్‌లు ధరించని ప్రయాణికులను వెనక్కి పంపాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది. దీంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అధికారులు అప్రమత్తమయ్యారు. దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో తిరిగి ఆంక్షలు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ఈమేరకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మాస్క్‌లు తప్పనిసరి చేశారు. క్యూలైన్లలో సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలాఉంటే తాజా పరిణామాలు విమానయానంపై మళ్లీ ప్రభావంపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొవిడ్‌ తరువాత ఇప్పుడిప్పుడే  విమానయాన రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న  సంగతి  తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా మళ్లీ కేసులు పెరుగుతుండడంతో ప్రయాణి కులపై ఆంక్షలు మొదలయ్యాయి. కొందరూ ప్రయాణికులు వాయిదా వేసుకుంటున్నారు.  ప్రస్తుతం హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి సగటు రోజుకు 60వేల మందికిపైగా ప్రయాణికులు (దేశీయ, అంతర్జాతీయ) రాకపోకలు సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో రికార్డు స్థాయిలో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. మళ్లీ కొవిడ్‌ హెచ్చరికలతో రద్దీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. 

కరోనా కేసుల వివరాలు

తేది రంగారెడ్డి జిల్లా   మేడ్చల్‌ జిల్లా

1     07        05

2     16        09

3     16        02

4     10        03

5      8                04

6     19        06

7     21        04

8     18        06

Updated Date - 2022-06-10T05:26:56+05:30 IST