బుల్డోజర్ న్యాయానికి వ్యతిరేకంగా వేలాదిమంది ముస్లింల ఆందోళన

ABN , First Publish Date - 2022-06-17T00:07:47+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న ‘బుల్డోజర్ న్యాయం’పై సర్వత్ర ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. బుల్డోజర్ న్యాయం పేరుతో

బుల్డోజర్ న్యాయానికి వ్యతిరేకంగా వేలాదిమంది ముస్లింల ఆందోళన

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న ‘బుల్డోజర్ న్యాయం’పై సర్వత్ర ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. బుల్డోజర్ న్యాయం పేరుతో కేవలం ముస్లింల ఇళ్లు, వ్యాపారాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. శుక్రవారం హింసాత్మకంగా మారిన ముస్లింల ఆందోళనతో సంబంధం ఉందన్న కారణంతో ఆదివారం యూపీలోని జావెద్ అహ్మద్ అనే వ్యక్తి ఇంటిని అధికారులు కూల్చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మరో రెండు నగరాల్లోనూ ఆందోళనకారుల ఆస్తులను బుల్డోజర్లతో ధ్వంసం చేశారు. ఏప్రిల్‌లో ఢిల్లీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. మతహింస కేసుల దాదాపు 12 మంది అరెస్ట్ అయిన తర్వాత ముస్లింల దుకాణాలను అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. ఇలాంటి ఘటనలే ఇతర రాష్ట్రాల్లోనూ జరిగాయి. ఝార్ఖండ్‌లో నుపుర్ శర్మ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు జరిపిన కాల్పులు ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.   


యూపీలో శుక్రవారం నాటి అల్లర్లకు సంబంధించి 300 మందికిపైగా అరెస్టయ్యారు. వీరికి సంబంధించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం కూల్చేసిన జావెద్ ఇల్లు కూడా అక్రమ కట్టడమేనని అధికారులు చెబుతుండగా జావెద్ కుటుంబ సభ్యులు, ఆయన తరపు లాయర్ ఖండించారు. ఒకవేళ అవి నిజంగా అక్రమ కట్టడాలే అయితే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎంఐఎం నేత షౌకత్ అలీ ప్రశ్నించారు.  


శనివారం ఆదిత్యనాథ్ మీడియా సలహాదారులు ఓ బుల్డోజర్ ఫొటోను ట్వీట్ చేస్తూ.. అల్లర్లకు పాల్పడేవారు ప్రతి శుక్రవారం, ఆపై శనివారం గుర్తుంచుకోవాలంటూ ఆ తర్వాత జరగబోయే పరిణామాలను హెచ్చరించారు. ఈ ట్వీట్‌పై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా గొంత్తెత్తే వారికి ముప్పు పొంచి ఉందని మానవ హక్కులపై విజిలెన్స్ కమిటీ నేత లెనిన్ రఘువంది ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, బుల్డోజర్ న్యాయం పేరుతో ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలపై దాడులు పెరిగిపోతున్నాంటూ దేశవ్యాప్తంగా వేలాదిమంది ముస్లింలు ఆందోళనలు చేస్తున్నారు. 

Updated Date - 2022-06-17T00:07:47+05:30 IST