‘తుప్పు’ వదిలించరా?

ABN , First Publish Date - 2022-07-05T04:45:20+05:30 IST

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో స్టేషన్‌ వద్ద వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలు నెలల తరబడి ఆరుబయటే ఉంచిన తరువాత వేలం వేస్తున్నారు. అప్పటికే అవి పాడవ్వడంతో వేలంలో సరైన ధర పలకడం లేదు. దీంతో నెలలు తరబడి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పుపడుతున్నాయి.

‘తుప్పు’ వదిలించరా?

ఎస్‌ఈబీ స్టేషన్‌ ప్రాంగణాల్లో వేలాది వాహనాలు
ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ..
నిషేధిత వస్తువుల రవాణాల్లో పట్టుబడుతున్న వైనం
వేలం వేయడంలో తీవ్ర జాప్యం
(ఇచ్ఛాపురం రూరల్‌)

మరమ్మతులకు గురైన వాహనాలు ఇలా మూలకు చేర్చినట్టుంది కదూ పై దృశ్యం. కాదండీ ఇచ్ఛాపురం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో స్టేషన్‌ వద్ద వివిధ కేసుల్లో పట్టుబడినవి ఇవి. మద్యం, సారాతో పాటు నిషేధిత వస్తువులు తరలిస్తుండగా పట్టుబడిన 140 వాహనాలను సీజ్‌ చేసి ఇలా స్టేషన్‌లో ఉంచారు. వీటిని వేలం వేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. దీంతో నెలలు తరబడి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఇలా తుప్పుపడుతున్నాయి.
.. ఇది ఒక ఇచ్ఛాపురం ఎస్‌ఈబీ స్టేషన్‌ వద్ద పరిస్థితే కాదు. జిల్లావ్యాప్తంగా ఉన్న 12 స్టేషన్లలో వేలాది వాహనాలు ఇలానే పడి ఉన్నాయి. పట్టుబడిన వాహనాలు నెలల తరబడి ఆరుబయటే ఉంచిన తరువాత వేలం వేస్తున్నారు. అప్పటికే అవి పాడవ్వడంతో వేలంలో సరైన ధర పలకడం లేదు. సారా, మద్యం, గంజాయి, గుట్కా వంటి నిషేధిత వస్తువులు రవాణా చేసే క్రమంలో చాలా మంది పట్టుబడుతున్నారు. అటువంటి వారిపై కేసు నమోదు చేసి.. రవాణాకు వినియోగించే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, జీపులు, కార్లను సీజ్‌ చేస్తున్నారు. ఇసుక, కలప రవాణాకు ఉపయోగించే వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఈ వాహనాలను వేలం వేయాలి. కానీ ఉన్నతాధికారుల నుంచి అనుమతి వచ్చేటప్పటికి నెలల తరబడి సమయం పడుతోంది. ఒక్కోసారి ఏళ్లు దాటుతోంది. ఈలోగా వాహనాలు పూర్తిగా పాడవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రెండు వేల వరకూ వాహనాలు స్టేషన్ల ప్రాంగణంలో ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

సరిహద్దు ప్రాంతాల్లో..
ప్రధానంగా సరిహద్దు ప్రాంతాలైన ఇచ్ఛాపురం, సోంపేట, మందస, మెళియాపుట్టి, పాతపట్నం, కొత్తూరు మండలాల్లో నిషేధిత వస్తువులు రవాణా చేస్తూ నెలకు పదుల సంఖ్యలో వాహనాలు పట్టుబడుతున్నాయి. వీటితో పాటు అటవీ శాఖ తనిఖీల్లో అక్రమ కలప రవాణా చేస్తూ ట్రాక్టర్లు, టిప్పర్లు సైతం పట్టుబడుతుంటాయి. వీటిని ఆయా శాఖ అధికారులు జప్తు చేస్తారు. బాధ్యులపై కేసులు నమోదు చేస్తారు. కానీ సకాలంలో వాహనాలకు పై అధికారుల నుంచి క్లియరెన్స్‌ రావడం లేదు. దీంతో అవి పాడవుతుండగా.. కొన్ని వాహనాల్లో టేపు రికార్డులు, బ్యాటరీలు, ఇతర విలువైన భాగాలు మాయమవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రవాణాశాఖ అధికారులను సంప్రదించి సదరు వాహనాల విలువ తెలుసుకున్నాక వేలం వేయాలి. ఈ ప్రక్రియలేవీ సజావుగా సాగకపోవడంతో కోట్లాది రూపాయలు విలువ చేసే వాహనాలు తప్పు పట్టి పాడైపోతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ వాహనాలను వేలం వేసి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చూడాల్సిన అవసరముంది.

వేలం వేస్తున్నాం
వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఎప్పటికప్పుడు వేలం వేస్తున్నాం. కోర్టు నుంచి క్లీయరెన్స్‌ రావడమే తరువాయి. ఈ విషయంలో శాఖపరమైన జాప్యం లేదు. ఇటీవలే కొన్ని వాహనాలను వేలం వేశాం. తద్వారా ప్రభుత్వానికి రూ.6 లక్షల ఆదాయం సమకూరింది. అయితే ప్రధానంగా గంజాయితో పట్టుబడిన వాహనాలకు మాత్రం క్లీయరెన్స్‌ రావడంలో జాప్యమవుతోంది.
- కె.గోపాల్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌, ఎస్‌ఈబీ.

 

Updated Date - 2022-07-05T04:45:20+05:30 IST