సర్పంచ్‌ల శిక్షణ వెలవెల

ABN , First Publish Date - 2022-06-25T05:20:37+05:30 IST

జడ్పీ కార్యాలయ ఆవరణలోని డీపీఆర్‌సీ భవనంలో ప్రకృతి వ్యవసాయంపై గ్రామ సర్పంచ్‌లకు శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమం వెలవెలబోయింది.

సర్పంచ్‌ల శిక్షణ వెలవెల
పూర్తిస్ధాయిలో సర్పంచ్‌లు లేక ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు

అరకొరగా హాజరు 

సమస్యలపై ఏకరువు పెట్టిన సర్పంచ్‌లు 


కడప రూరల్‌, జూన్‌ 24 :  జడ్పీ కార్యాలయ ఆవరణలోని డీపీఆర్‌సీ భవనంలో ప్రకృతి వ్యవసాయంపై  గ్రామ సర్పంచ్‌లకు శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమం వెలవెలబోయింది. చింతకొమ్మదిన్నె, వల్లూరు, పెండ్లిమర్రి, చెన్నూరు, సిద్దవటం, ఒట్టిమిట్ట మండలా నుం చి 48 మంది సర్పంచ్‌లు శిక్షణకు హాజరు కావాల్సి ఉండగా 30 మంది మాత్రమే హాజరయ్యారు. ఉదయం 10గంటలకు శిక్షణ ప్రారం భ ఉపన్యాసం జిల్లా అధికారులు మొదలు పెట్టగానే సర్పంచ్‌లు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. గ్రామ పంచాయతీలకు నిధులు లేక అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. అధికారులు తగు సమాధానం చెప్పలేక గాబరాపడుతూ ప్రసంగాన్ని పూర్తి చేసి నిష్క్రమించారు. తరువాత సర్పంచ్‌లు కూడా శిక్షణ నుంచి ఒక్కొక్కరే బయటికి వెళ్లిపోయారు. దీంతో శిక్షణలో ఉదయం 12 గం టలకే సగానికి పైగా ఖాళీ కుర్చీలు దర్శినమిచ్చాయి. మధ్యహ్నం భోజనం తరువాత సర్పంచ్‌ల హాజరుశాతం మరింత తగ్గిపోయింది. 


నీరుగారిన ప్రభుత్వ లక్ష్యం

అధికారుల నామమాత్రపు చర్యల వలన ప్రకృతి వ్యవసాయ సాగును గణనీయంగా పెంచాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. ప్రతి రైతు తన మొత్తం భూమిలో ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించడంతో పాటు పశువులను వ్యవసాయంలో అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావించి, ఇందుకు గ్రామ సర్పంచ్‌లకు శిక్షణను ఇచ్చి వారి ద్వారా రైతులను చైతన్య పరచాలని భావించింది. ఈమేరకు కడప జిల్లాలో నాలుగు విడతలుగా జూన్‌ 24న కడప డీపీఆర్‌సీ భవనంలో, 25న బద్వేల్‌, 28న ప్రొద్దుటూరు, 29న పులివెందులలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి వంద శాతం సర్పంచ్‌లు శిక్షణకు హాజరయ్యేలా చూడాలని జిల్లా అధికారులకు ఆదేశాలు పంపింది. ఈమేరకు జిల్లా అధికారులు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు), డివిజనల్‌ అభివృద్ధి అధికారులు, డివిజనల్‌ పంచాయతీ అధికారులు పార్వర్డ్‌చేసి చేతులు దులిపేసుకుంది. దీంతో శుక్రవారం కడప డీపీఆర్‌సీ భవనంలో నిర్వహించిన మొదటి విడత శిక్షణా కార్యక్రమం సర్పంచ్‌లు లేక వెలవెలబోయింది. కాగా శిక్షణ పేరుతో లక్షల ప్రభుత్వ నిధు లు అప్పనంగా ఖర్చువుతున్నాయనే మిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి 

ప్రకృతి వ్యవసాయంపై ఇచ్చే శిక్షణను సర్పంచ్‌లు సద్వినియోగం చేసుకొని... రైతులకు అవగాహన కల్పించి... ప్రకృతి వ్యవసాయ సాగును గణనీయంగా పెంచాలని జడ్పీ సీఈవో ఎం.సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్ర అనుభవాలు, ఉత్తమ పద్దతులు, అధిక సాగు ఖర్చు(విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు), తీవ్రమైన నీటికొరత, బోరుబావులు ఎండిపోవడం, చిన్న, సన్నకారు, కౌలురైతుల సమస్యలు, వలసలు, కరువులు, తుఫాన్లు, వరదలు, అకాల వర్షాలు, మార్కెట్ల అనిశ్చితి, నేల క్షీణత, నేల కోత, నీటికొరత, నీటి ప్రమాద పరిస్ధితి, వేడిగాలులు, భూతాపం, జీవ వైవిద్య నష్టాలు, తదితర వాటిపై ఇచ్చే సందేశాలను శిక్షణలో తెలుసుకొని రైతులకు వివరించాలన్నారు. కార్యక్రమంలో కడప డీఎల్‌డీవో ప్రతాప్‌, డీఎల్‌పీవో మస్తాన్‌వల్లి, డీపీఆర్‌సీ జిల్లా కో-ఆర్డినేటర్‌ సురేష్‌, రైతు సాధికార సంస్ధ ట్రైనర్స్‌, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-25T05:20:37+05:30 IST