Abn logo
Jul 26 2021 @ 02:38AM

ప్రైవేటు స్కూళ్లు విలవిల!

  • అడ్మిషన్లు, ఆదాయం లేక వేల సంఖ్యలో మూత పడిన పాఠశాలలు.. 
  • సగం మందకిపైగా టీచర్ల జీతాల్లో కోత
  • ఫీజులు తగ్గలేదన్న 70శాతం పేరెంట్స్‌
  • సీఎ్‌సఎఫ్‌ స్వచ్ఛంద సంస్థ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 25: కరోనా నేపథ్యంలో విద్యారంగం విలవిల్లాడుతోంది. ముఖ్యంగా చిన్నచిన్న ప్రైవేటు స్కూళ్లు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. దేశంలో దాదాపు సగం మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలోనే చదువుతున్నారు. దీంతో ఈ పాఠశాలల్లో పనిచేసే టీచర్ల ఉపాధి, విద్యార్థుల ప్రమాణాలను కూడా కరోనా దెబ్బతీసింది. సెంట్రల్‌ స్క్వేర్‌ ఫౌండేషన్‌ (సీఎ్‌సఎఫ్‌) అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైన అంశాలు ఈ పరిస్థితులను కళ్లకుకట్టాయి. సర్వే ప్రకారం.. స్కూళ్ల ఆదాయం కనీసం 20 నుంచి 50శాతం వరకు పడిపోయింది. గతంలో మాదిరిగా పేరెంట్స్‌ ఫీజులు కట్టలేకపోవడంతో స్కూళ్లకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొత్త అడ్మిషన్లు బాగా తగ్గాయని 55శాతం స్కూళ్ల నిర్వాహకులు చెప్పారు. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాలు ఇందులో ఉన్నాయి. ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లలో కనీసం 55శాతం మందికి జీతాల్లో కోత పడింది. అధికంగా ఫీజులు వసూలు చేసే స్కూళ్లలో 37శాతం మంది టీచర్లకు జీతాలు ఇవ్వడం నిలిపేశారు. తక్కువ ఫీజులు వసూలు చేసే స్కూళ్లలో 65శాతం మంది టీచర్లకు వేతనాలు చెల్లించడం ఆపేశారు. కరోనా నేపథ్యంలో అనేక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. స్కూళ్లు ఏమాత్రం ఫీజులు తగ్గించలేదని కనీసం 70శాతం మంది పేరెంట్స్‌ సర్వేలో వాపోయారు. ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల కంప్యూటర్లు, ఇతరత్రా సౌకర్యాలు సమకూర్చుకోవడంతో తమకు ఖర్చులు పెరిగాయని 25శాతం మంది పేరెంట్స్‌ చెప్పారు. మొత్తంగా చూస్తే పిల్లల చదువుల మీద పెట్టే ఖర్చు పెరిగిందని 15శాతం మంది తల్లిదండ్రులు చెప్పడం గమనార్హం. ఐక్యరాజ్యసమితికి చెందిన యునిసెఫ్‌ కూడా ప్రైవేటు స్కూళ్లపై కరోనా ప్రభావాన్ని అధ్యయనం చేసింది. అడ్మిషన్లు లేకపోవడంతో ఇప్పటికే చిన్నచిన్న ప్రైవేటు స్కూళ్లు వేల సంఖ్యలో మూతపడ్డాయని యునిసెఫ్‌ నివేదిక పేర్కొంది. ఇంకా చాలా స్కూళ్లు ఇదేబాటలో ఉన్నాయని వెల్లడించింది. ఇలాంటి స్కూళ్లలో పనిచేసే ఎంతోమంది టీచర్లకు ఉద్యోగాలు పోయాయని తెలిపింది. జీతాల్లో కోతలు పడ్డవారు, అసలు వేతనాలే పొందని టీచర్లు కూడా అధికంగానే ఉన్నారని వెల్లడించింది. ఆన్‌లైన్‌ క్లాసులు పెట్టడంలో ఈ స్కూళ్లు ఇబ్బందులు పడుతున్నాయని, ఫలితంగా విద్యార్థులు కూడా నష్టపోతున్నారని పేర్కొంది. మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చే సమయానికి ఈ విద్యార్థుల్లో ప్రమాణాలు బాగా దిగజారవచ్చని యునిసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది.తెలంగాణలో ఉపాధి హామీ పనుల్లో టీచర్లు

తెలంగాణలో 56.17శాతం మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలోనే చదువుతున్నారు. కరోనా నేపథ్యంలో అనేక మంది ప్రైవేటు టీచర్లు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను వెతుక్కున్నారని సీఎ్‌సఎఫ్‌ నివేదిక పేర్కొంది. వ్యవసాయ పనులు, ఉపాధి హామీ పథకం, కూలి పనుల ద్వారా కొందరు టీచర్లు ఉపాధి పొందుతున్నారని తెలిపింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో మార్గనిర్గేశం కూడా కొరవడింది. ఫీజుల విషయంలో రాష్ట్రాలు వేటికవే నిర్ణయాలు తీసుకుంటున్నాయి.