వైరస్‌.. టెర్రర్‌!.. ఒక్కరోజే 176

ABN , First Publish Date - 2020-07-05T10:17:53+05:30 IST

జిల్లాల కరోనా కలకలం రేపుతోంది. శనివారం ఒక్కరోజే మొత్తం 176 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య

వైరస్‌.. టెర్రర్‌!.. ఒక్కరోజే 176

మొత్తం 2050కు చేరిక కేసులు సంఖ్య

పదిరోజుల్లోనే వెయ్యి పాజిటివ్‌ కేసులు

గుంటూరు నగరాన్ని వణికిస్తున్న కరోనా

ప్రజల నిర్లక్ష్యంతోనే వైరస్‌ వ్యాప్తి అంటున్న అధికారులు


ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, జూలై 4: జిల్లాల కరోనా కలకలం రేపుతోంది. శనివారం ఒక్కరోజే మొత్తం 176 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2050కు చేరింది. కరోనా ప్రారంభం అయ్యాక 90 రోజులకు వెయ్యి కేసులు నమోదైతే కేవలం పది రోజుల్లోనే మరో వెయ్యి కేసులు నమోదయ్యాయి. శనివారం నమోదైన కేసుల్లో గుంటూరు నగరంలోని విష్ణునగర్‌, మంగళ్‌దాస్‌నగర్‌, లాంచెస్టర్‌రోడ్‌, మిర్చియార్డు, శ్యామలానగర్‌, నల్లపాడు, వెంకటరమణకాలని, తుఫాన్‌ నగర్‌, శ్రీనివాసరావుతోట, లక్ష్మీపురం, సుబ్బారెడ్డి నగర్‌, రాజేంద్రనగర్‌, అంకిరెడ్డి పాలెంలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. వీటితోపాటు సంగడిగుంటలో 14, నల్లచెరువ 7, పాతగుంటూరులో 2, సంపత్‌నగర్‌ రెండు, డీఎస్‌నగర్‌లో రెండు, ఏటుకూరు రోడ్డులో 4, ఏటీ అగ్రహారంలో 3, స్తంభాలగరువులో 2, చౌత్రాలో రెండు, ఆనందపేటలో 2, కేవీపీ కాలనిలో 2, డొంకరోడ్డులో 2 కేసులు వెలుగు చూశాయి. వీటితో పాటు జిల్లాలో నమోదైన కేసులు వివరాలు ఇలా ఉన్నాయి. 


ప్రత్తిపాడులో ఇటీవల మరణించిన ఓ టీ దుకాణదారుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతను నాలుగురోజుల క్రితం అనారోగ్యంతో వైద్యశాలలో చికిత్స పొందుతూ మరణించాడు. ప్రత్తిపాడులో అంతిమ సంస్కారం నిర్వహించారు. అతని కరోనా పరీక్షల ఫలితాలు శనివారం వెలువడ్డాయి. పాజిటివ్‌ రావడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు.  


చిలకలూరిపేట పట్టణంలోని పద్మసాలిపేటలో ఓ వృద్ధురాలు, ఆమె కుమారునికి  కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు నోడల్‌ వైద్యాధికారి గోపినాయక్‌ శనివారం తెలిపారు. 

 

కాకుమాను పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. గుంటూరులో నివాసం ఉంటున్న ఇతను నిత్యం అక్కడి నుంచి స్టేషన్‌కు వస్తుంటాడు. 


పొన్నూరు పట్టణంలోని 21వార్డులో వస్త్రవ్యాపారి భార్యకు పాజిటివ్‌ నమోదైందని అధికారులు తెలిపారు. కంటోన్మెంట్‌ జోన్‌ను తహసీల్దారు డి.పద్మనాభుడు, మున్సిపల్‌ కమిషనరు వెంకటేశ్వరరావు, మెడికల్‌ ఆఫీసరు డాక్టర్‌ పి.రత్నబాబు, అర్బన్‌ సీఐ పేర్లి ప్రేమయ్య  సందర్శించి  స్థానికులకు పలు సూచనలు చేశారు. 


పిడుగురాళ్ల పట్టణంలో మరో ఆరుగురికి వైరస్‌ సోకింది. పదిరోజుల క్రితం కూరగాయల వ్యాపారికి కరోనా రాగా అతని కాంట్రాక్ట్స్‌కు పరీక్షలు చేయగా వారిలో ఐదుగురికి వైరస్‌ ఉన్నట్లు రిపోర్టులు అందాయి. రామాలయం సమీపంలో ఉంటున్న మరో వ్యక్తికి కూడా కరోనా వైరస్‌ సోకినట్లు వైద్యాధికారిణి వెల్లడించారు.  


మంగళగిరి పట్టణంలో శనివారం ఒక్కరోజే ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు కొవిడ్‌-19 వైద్యుడు అంబటి వెంకటరావు తెలిపారు. దేవస్థానం రోడ్డులోని పోలీసు క్వార్టర్స్‌లో వుంటున్న ఏపీఎస్పీ ఆర్‌ఎస్‌ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లు వున్నట్టు చెప్పారు. ఎయిమ్స్‌లోలో పనిచేస్తూ మంగళగిరి న్యూ బ్యాంకు కాలనీలోని అపార్టుమెంటులో నివాసం వుంటున్న వ్యక్తితోపాటు పాతమంగళగిరి ఎన్‌సీసీ రోడ్డులో నివాసం వుంటున్న మరో వ్యక్తికి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. మంగళగిరి మండలంలోని ఆత్మకూరులో నివాసముంటూ వార్డు సచివాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగికి, కాజ గ్రామంలో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు.  

 

సత్తెనపల్లి పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌లో ఓ మహిళకు, 25వ వార్డులో ఓ యువకుడికి పాజిటివ్‌ నిర్థారణ అయింది. 

 

కొల్లూరులో నివాసం ఉంటూ గుంటూరు మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తహసీల్దార్‌ జాన్‌పీటర్‌ తెలిపారు. మహిళ నివాసం ఉంటున్న ప్రాంతాన్ని వైద్యాధికారి రవిబాబు, ఎస్‌ఐ ఉజ్వల్‌కుమార్‌ పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై చుట్టుపక్కల వారికి వివరించారు. సెకండరీ కాంటాక్టుగా 13 మందిని గుర్తించడం జరిగిందని, వారికి కూడా కొవిడ్‌ పరీక్షలు చేయనున్నట్లు ఆయన వివరించారు. 


గుంటూరు మండల పరిషత్‌ కార్యాలయంలో ఏడుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. గత నెల 26న మండల కార్యాలయంలోని ఉద్యోగులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శనివారం విడుదల చేశారు.  డ్వామా జిల్లా కార్యాలయంలో ఓ మహిళా అధికారికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.  


పిడుగురాళ్లలో ఎమ్మెల్యే కారు డ్రైవర్‌కు కరోనా సోకింది.  రొంపిచర్ల మండలం బుచ్చిపాపన్నపాలెం గ్రామంలో రెండవ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  పెదనందిపాడు మండలంలోని నాగులపాడు  ఓ ఫైనాన్స్‌ సంస్థలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులకు, పాలపర్రులో ఓ వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో శనివారం అధికారులు అప్రమత్తమయ్యారు.  


Updated Date - 2020-07-05T10:17:53+05:30 IST