మంచు తుపాను దెబ్బకు అగ్రరాజ్యం గజగజ.. వేలాది విమానాలు రద్దు..!

ABN , First Publish Date - 2022-01-30T17:43:02+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాను మంచు తుపాను గజగజ వణికిస్తోంది. భారీగా కురుస్తున్న మంచు, శీతలగాలుల కారణంగా యూఎస్‌పై మంచు దుప్పటి కప్పేసింది.

మంచు తుపాను దెబ్బకు అగ్రరాజ్యం గజగజ.. వేలాది విమానాలు రద్దు..!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను మంచు తుపాను గజగజ వణికిస్తోంది. భారీగా కురుస్తున్న మంచు, శీతలగాలుల కారణంగా యూఎస్‌పై మంచు దుప్పటి కప్పేసింది. ప్రధానంగా న్యూయార్క్‌, బోస్టన్‌, ఫిలడెల్ఫియా, న్యూజెర్సీ నగరాల్లోని రహాదారులపై రెండు అడుగులమేర మంచు పేరుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. శనివారం వేలాది విమానాలు రద్దు అయ్యాయి. దేశవ్యాప్తంగా సుమారు 3,400 అంతర్రాష్ట్ర విమానాలు క్యాన్సిల్ అయినట్లు ఫ్లైట్ ట్రాకర్ 'ఫ్లైట్‌ అవేర్' వెల్లడించింది. అలాగే శుక్రవారం నాడు 1,450 వరకు విమానాలు క్యాన్సిల్ అయ్యాయని పేర్కొంది. కరోలినాస్ నుండి అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన భీకర తుపాను ఆ తరువాత ఈస్ట్ కోస్ట్‌ వైపు మళ్లీంది. దాంతో వారాంతంలో ఏకంగా 5వేల విమానాల రద్దు, 8వేల కంటే ఎక్కువ విమానాలు ఆలస్యంగా నడిచాయి. న్యూయార్క్‌, చికాగో, బోస్టన్‌ రాష్ట్రాల్లో విమానాశ్రయాలు పూర్తిగా మంచుతో నిండిపోయాయి. 


ఇక మంచు తుపాను ప్రభావం అంతకంతకు పెరుగుతుండడంతో ముందజాగ్రత్త చర్యలో భాగంగా న్యూయార్క్‌లో అధికారులు ఉప్పు యంత్రాలు, స్నోప్లోలు సిద్ధంగా ఉంచారు. న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఒక అడుగు(30 సెంటీమీటర్లు)మేర మంచు కురిసే అవకాశం ఉందని ట్వీట్ చేశారు. "ప్రకృతి తల్లికి ఆమె కోరుకున్నది చేసే ధోరణి ఉంది" అని ఈ సందర్భంగా మేయర్ హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇక శీతలగాలుల తీవ్రతతో ఈ హిమపాతం మరో 4రెట్లు పెరిగే అవకాశం ఉందని యూఎస్ వాతావరణ విభాగం అంచనావేసింది. తుపాను కారణంగా అత్యవసర సేవలు మినహా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. అటు మేరీల్యాండ్, మసాచుసెట్స్, న్యూజెర్సీ గవర్నర్‌లు కూడా అత్యవసర పరిస్థితులను ప్రకటించారు. అలాగే విద్యుత్తు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు గాబరా పడొద్దని కోరారు. సాధ్యమైనంత వరకు జనాలు రోడ్లపైకి రాకపోవడమే మంచిదని సూచించారు. కాగా, ఈ మంచు తుపాను ధాటికి దాదాపు 70 లక్షల మంది ప్రభావితమైనట్లు సమాచారం.  

Updated Date - 2022-01-30T17:43:02+05:30 IST