వేల కోట్ల రాణులు!

ABN , First Publish Date - 2020-09-17T05:30:00+05:30 IST

ఐదుగురు భారతీయ మహిళల ఆస్తి ఎంతో తెలుసా? అక్షరాలా 1,32,511 లక్షల కోట్లు! ఫోర్బ్స్‌ రియల్‌టైమ్‌ బిలియనీర్ల జాబితా వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం వారి ఆస్తి విలువ ఇది...

వేల కోట్ల రాణులు!

ఐదుగురు భారతీయ మహిళల ఆస్తి ఎంతో తెలుసా? అక్షరాలా 1,32,511 లక్షల కోట్లు! ఫోర్బ్స్‌ రియల్‌టైమ్‌ బిలియనీర్ల జాబితా వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం వారి ఆస్తి విలువ ఇది. మరి ఆ మహిళా శ్రీమంతులు ఎవరు? వారు  సమర్థంగా నిర్వహిస్తున్న వ్యాపార సంస్థలు ఏవి? ఇదిగో... ఆ వివరాలు.


ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్‌ మేగజైన్‌ ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. మరి ఆ జాబితాలో మన దేశం నుంచి ఎంతమంది ఉన్నారో తెలుసా? 118 మంది ఉన్నారు. వీరిలో అధికులు పురుషులే! అయితే ఐదుగురు మహిళలూ ఆ జాబితాలో స్థానం సంపాదించారు. అత్యంత ధనవంతురాలైన భారతీయ మహిళగా సావిత్రి జిందాల్‌ గుర్తింపు పొందారు. ఊహించినట్టుగానే రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ అధిపతి ముఖేష్‌ అంబానీ మొదటి స్థానం దక్కించుకున్నారు. 88.6 బిలియన్‌ డాలర్ల నికర ఆస్తితో అంబానీ ఆసియాలోనే అత్యంత ధనికుడిగా మొదటి స్థానాన్నీ, ప్రపంచంవ్యాప్త ధనికుల్లో ఐదో స్థానాన్నీ దక్కించుకున్నారు.


1. సావిత్రీ జిందాల్‌!

ఆస్తి విలువ: 50 వేల కోట్ల రూపాయలు

వయసు: 70

వ్యాపారం :  స్టీల్‌

ఫోర్బ్స్‌ ఎంపిక చేసిన ఐదుగురు మహిళా ధనవంతుల్లో మొదటిస్థానం 70 ఏళ్ల సావిత్రీ జిందాల్‌కు దక్కింది. మల్టీబిలియన్‌ డాలర్ల విలువ చేసే మిశ్రమ వ్యాపార సంస్థల అధిపతిగా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మనదేశంలోని ధనవంతుల్లో ఆమెది 12వ స్థానం. ఆమె భర్త, దివంగత ఒ.పి జిందాల్‌, జిందాల్‌ గ్రూప్‌ సంస్థల స్థాపకుడు. 2005లో హెలికాప్టర్‌ ప్రమాదంలో భర్త అకాలమరణంతో సంస్థకు అధిపతిగా సావిత్రీ వ్యాపార పగ్గాలు చేపట్టారు.


2. కిరణ్‌ మజూందార్‌ షా!

ఆస్తి విలువ: 30 వేల కోట్ల రూపాయలు

వయసు: 67

వ్యాపారం : బయోటెక్‌

బయోఫార్మసూటికల్‌ సంస్థ బయోకాన్‌తో స్వతంత్రంగా ఎదిగిన మహిళ కిరణ్‌ మజూందార్‌ షా! ఈమె మహిళా ధనవంతులలో రెండో స్థానంలో ఉంది. 1978లో బయోకాన్‌ను స్థాపించారు. ఇండియాలో అతిపెద్ద బయోఫార్మాసూటికల్‌ సంస్థ ఇది. 


3. లీనా తివారి!

ఆస్తి విలువ: 21 వేల కోట్ల రూపాయలు

వయసు: 63

వ్యాపారం : ఫార్మసూటికల్స్‌

యు.ఎస్‌.వి అనే ముంబయిలోని ఫార్మసూటికల్‌ కంపెనీ అధిపతి లీనా తివారి. లీనా తండ్రి స్థాపించిన ఈ కంపెనీ వార్షిక ఆదాయం 449 మిలియన్‌ డాలర్లు. ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ ఫార్మసూటికల్‌ కంపెనీ ప్రధానంగా మధుమేహం, హృద్రోగ ఔషధాలను తయారుచేస్తుంది.


4. స్మితా కృష్ణా గోద్రెజ్‌!

ఆస్తి విలువ: 16 వేల కోట్ల రూపాయలు

వయసు: 70 

వ్యాపారం : కన్స్యూమర్‌ గూడ్స్‌

భారతీయులకు పరిచయం చేయనక్కర్లేని పేరు గోద్రెజ్‌. గృహోపకరణాలు, ఫర్నిచర్‌ మొదలైన వినియోగ వస్తువుల తయారీ సంస్థ ఇది. స్మితా గోద్రెజ్‌ ఈ వ్యాపార సంస్థ బాధ్యతలు చూసుకుంటున్నారు. 4.7 బిలియన్‌ డాలర్ల ఖరీదైన ఈ సంస్థలో స్మితాకు ఐదో వంతు వాటా ఉంది. ఈవిడ నౌరోజీ గోద్రెజ్‌ సెంటర్‌ ఫర్‌ ప్లానెట్‌ రీసెర్చ్‌ రాప్టార్‌ రీసెర్చ్‌ అండ్‌ కన్సర్వేషన్‌ ఫౌండేషన్‌కు అధిపతి కూడా!


5. రాధా వేంబు!

ఆస్తి విలువ: 8 వేల కోట్ల రూపాయలు

వయసు: 48

వ్యాపారం :  టెక్నాలజీ

జోహో కార్ప్‌ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో రాధా వేంబు పెద్ద వాటాదారు. ఈ కంపెనీని రాధా వేంబు సోదరుడు శ్రీథర్‌ వేంబు 1996లో స్థాపించారు. వేంబు ఈ-మెయిల్‌ సర్వీస్‌, జోహో మెయిల్‌లకు ప్రొడక్ట్‌ మేనేజర్‌గా, కార్పస్‌ ఫౌండేషన్‌కు డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Updated Date - 2020-09-17T05:30:00+05:30 IST