వేల కోట్ల నిధులు తెచ్చి.. దొంగల పాలు చేయలేం

ABN , First Publish Date - 2021-06-22T07:04:46+05:30 IST

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని రంగాలను అభివృద్ధి పరిచేందుకు లక్షలాది కోట్ల నిధులను మంజూరు చేసి రాష్ర్టాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్నారని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన బీర్కూర్‌

వేల కోట్ల నిధులు తెచ్చి.. దొంగల పాలు చేయలేం
మినీ ట్యాంక్‌ బండ్‌ మ్యాపును పరిశీలిస్తున్న పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

బాన్సువాడ నియోజకవర్గానికి మరో ఐదు వేల ఇళ్ల మంజూరు

గ్రామాల అభివృదికి రూ.వంద కోట్ల నిధులు :  స్పీకర్‌ పోచారం

బీర్కూర్‌, జూన్‌ 21: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని రంగాలను అభివృద్ధి పరిచేందుకు లక్షలాది కోట్ల నిధులను మంజూరు చేసి రాష్ర్టాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్నారని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన బీర్కూర్‌ శివారులోని తెలగాణ తిరుమల దేవస్థానంలో బాన్సువాడ, నస్రుల్లాబాద్‌, బీర్కూర్‌ మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలతో ఆయా గ్రామాల్లో చేపట్టిన, చేపట్టనున్న, కొన సాగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి వేలాది కోట్ల నిధులను మంజూరు చేస్తోందన్నారు. అయితే, వేలాది కోట్ల నిధులను తీసుకుని వచ్చి దొంగల పాలు చేయలేమని ఆయన తేల్చి చెప్పారు. ఒక వ్యక్తి సొంత ఖర్చుతో ఇల్లు కట్టుకుంటే వందేళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటుందని, అదే ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే మాత్రం 20 ఏళ్లలో ఎందుకు కూలిపోతున్నాయని ప్రజా ప్రతినిధులు, అధికారులను ప్రశ్నించారు. బాన్సువాడ నియోజకవర్గంలో మరో ఐదు వేల డబుల్‌ బెడ్‌ రూంలను మంజూరు చేయించామన్నారు. కాగా, జూలై 1వ తేదీ నుంచి నిజాంసాగర్‌ జలాలను విడుదల చేసేందుకు నిర్ణయం తీసు కున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్‌, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూప, ఎఎంసీ చైర్మన్‌ ద్రోణవల్లి అశోక్‌, మైలారం సహకార సంఘం అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్‌,  తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు

బాన్సువాడ: బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని అభివృద్ది పథకాల కోసం ప్రత్యేక నిధులు మంజూరైనట్లు రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు కట్టపై కొనసాగుతున్న మరమ్మతు పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. బ్యాటరీ వాహనాన్ని నడుపుతూ పనులను పరిశీలించారు. పనులు వేగవంతం గా జరుగుతున్నాయని, మరింత వేగం పెంచి త్వరలోనే ప్రజలకు అందుబాటు లోకి తీసుకుని రావాలని అధికారులకు సూచించారు.  

అలాగే,  గ్రామగ్రామాన సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, గ్రామాలు, వార్డుల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వ యంతో పని చేసి, త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. 

Updated Date - 2021-06-22T07:04:46+05:30 IST