స్పందన.. ఇంతేనా?

ABN , First Publish Date - 2022-08-09T05:41:09+05:30 IST

ప్రజా సమస్యలపై‘ స్పందన’ అంతంతమాత్రంగానే ఉంది. నిర్ణీత గడువులోగా వినతులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. పలుమార్లు అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా మోక్షం లభించడం లేదు.

స్పందన.. ఇంతేనా?
స్పందనలో అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

   వేలల్లోనే అర్జీలు..  అంతంతమాత్రంగానే పరిష్కారాలు 

  కొన్ని శాఖల్లో స్పందించని అధికారులు

  అర్జీదారులకు తప్పని అవస్థలు

 (పార్వతీపురం - ఆంధ్రజ్యోతి )

 ప్రజా సమస్యలపై‘ స్పందన’ అంతంతమాత్రంగానే ఉంది. నిర్ణీత గడువులోగా వినతులు పరిష్కారానికి నోచుకోవడం లేదు.  పలుమార్లు అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా మోక్షం లభించడం లేదు. జిల్లాకేంద్రం కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి వేలల్లో వినతులు వస్తుండగా, కేవలం వందల్లోనే పరిష్కారమవుతున్నాయి. దీంతో అర్జీదారులకు నిరాశ తప్పడం లేదు. జిల్లా ఆవిర్భావం తర్వాత కలెక్టరేట్‌ స్పందనకు 2,527 వినతులు రాగా ఇందులో 428 అర్జీలను సకాలంలో పరిష్కరించారు. ఇంకా 2,099 వినతులు పరిశీలనలోనే ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా అర్జీదారులకు యాతన తప్పడం లేదు. 

జిల్లా ఆవిర్భావానికి ముందు నుంచి స్పందన కార్యక్రమానికి  ఎన్నో సమస్యలపై ప్రజలు వినతులు అందిస్తున్నారు. అయితే వాటిల్లో కొన్ని మాత్రమే పరిష్కారానికి నోచుకుంటున్నాయి. మరికొన్ని పరిశీలనకే పరిమితమవుతున్నాయి. నెలలు గడుస్తున్నా.. వాటికి పూర్తిస్థాయిలో పరిష్కార మార్గం దొరకని పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉండగా కొన్ని శాఖలకు వచ్చే అర్జీలను పూర్తిస్థాయిలో పరిష్కారించినట్లు గణంకాల్లోనే చూపిస్తున్నారు. మరికొన్ని శాఖలు వినతులను పరిష్కరించలేని పరిస్థితుల్లో ఉండడం దారుణం. కాగా కొత్తగా పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన తరువాత కలెక్టరేట్‌ స్పందన కార్యక్రమానికి ఇప్పటివరకు 2,527 దరఖాస్తులు వచ్చాయి.  ఇందులో అర్జీలు అందిన వెంటనే పరిష్కరించిన సమస్యలు 217 కాగా, కొన్ని రోజుల అనంతరం పరిష్కరించిన అర్జీలు 211 ఉన్నాయి. మిగిలిన 2,099 అర్జీలు అధికారుల పరిశీలనలో ఉన్నాయి.  అత్యధికంగా  రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌, ఈపీడీసీఎల్‌,  వైద్య విధాన పరిషత్‌, ఏపీ షెడ్యూల్డ్‌ ట్రైబ్‌ కోఆపరేటివ్‌, ఫైనాన్స్‌ కోపరేటివ్‌ శాఖలకు అర్జీలు వచ్చాయి.   ఇందులో రెవెన్యూశాఖ ద్వారా 201 అర్జీలు, పంచాయతీరాజ్‌కు 184 రాగా 42,  ఏపీ స్టేట్‌ కార్పొరేషన్‌కు 154 అర్జీలు రాగా 6 , ఈపీడీసీఎల్‌కు సంబంధించి 138 అర్జీలు రాగా 19 మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. 

  అర్జీలు అందిస్తున్నా..

   తనకు ఇంటి స్థలంతో పాటు ఇల్లును మంజూరు చేయాలని పార్వతీపురానికి చెందిన గొబ్బి పార్వతి ఇప్పటికి నాలుగు పర్యాయాలు అధికారులకు స్పందనలో అర్జీలు అందించింది. అయితే నేటికీ చర్యలు శూన్యం.   పాచిపెంట మండలం మోసూరు గ్రామ పంచాయతీ ఇందిరమ్మవలసకు చెందిన గిరిజనులు విద్యుత్‌ లైన్లు ఏర్పాట్లు చేయాలని స్పందనలో రెండోసారి అర్జీలు అందించినప్పటికీ ఆ శాఖ అధికారుల్లో స్పందన లేకుండాపోయింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలకు బిల్లులు చెల్లించడం లేదని  కాంట్రాక్టర్లు అనేకసార్లు స్పందనలో ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.  పార్వతీపురం మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన బలగ శివున్నాయుడు గతంలో ఐసీడీఎస్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసేవారు. కొన్నేళ్ల కిందట  ఉద్యోగం కోల్పోయానని, తనకు న్యాయం చేయాలని  ప్రతి సోమవారం నిర్వహించే స్పందనలో కోరుతున్నాడు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఆయన నిరీక్షిస్తున్నా.. స్పందించేవారే కరువయ్యారు. ఇలా వివిధ సమస్యలపై స్పందన కార్యక్రమంలో అనేకమంది అర్జీలు అందిస్తున్నారు. కానీ పూర్తిస్థాయిలో పరిష్కారం   కావడం లేదు.  

   వినతుల వెల్లువ

బెలగాం / పార్వతీపురం రూరల్‌, ఆగస్టు 8 : జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 88 అర్జీలు వచ్చాయి.  వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను జేసీ ఆనంద్‌, డీఆర్‌వో జె.వెంకటరావు తదితరులు స్వీకరించారు. వినతుల్లో కొన్ని ఇలా...   తమకు 12 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని పెద్దగెడ్డ జలాశయానికి చెందిన లష్కర్లు  కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.  తమను రెగ్యులర్‌ ఉద్యోగులుగా నియమించాలని వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు అర్జీ అందించారు.  గుమ్మలక్ష్మీపురం మండలం ఎగువతాడి నుంచి కప్పకల్లు వరకు బీటీ రహదారి నిర్మించాలని సర్పంచ్‌ జగ్గారావు వినతిపత్రాన్ని ఇచ్చారు.  తమకు  పొదుపు వడ్డీ డబ్బులు రావడం లేదని పార్వతీపురానికి చెందిన సాయిజ్యోతి మహిళా పొదుపు సంఘం సభ్యులు తెలిపారు. తన మనువరాలికి కేజీబీవీలో 9వ తరగతి సీటు ఇప్పించాలని  మొండెంఖల్‌ గ్రామానికి చెందిన ఎస్‌.లక్ష్మి కోరారు.  తనకు భర్తకు మూడు చక్రాల వాహనం ఇప్పించాలని  కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం గ్రామానికి చెందిన జి.చంద్రకళ వినతిపత్రం ఇచ్చారు.   కాపు నేస్తం నిధులు జమకాలేదని మక్కువ మండలం కవిరిపల్లి గ్రామానికి చెందిన జి.గంగమ్మ ఫిర్యాదు చేశారు.  గుడిసిగుడ్డి, తాడివలస గ్రామాల్లోని స్కూల్స్‌లో ఉపాధ్యాయులు లేక తమ పిల్లలు చదువులకు దూరమవుతున్నారని గుడిసిగుడ్డి సర్పంచ్‌ ఎం.ఆనందరావు, గ్రామస్థులు తెలిపారు.    తన భూమికి పట్టాదారు పాస్‌ పుస్తకం అందించాలని  పార్వతీపురం మండలం డీకే పట్నం గ్రామానికి చెందిన ఎం.సోములు కోరారు. పింఛను మంజూరు చేయాలని పార్వతీపురానికి చెందిన ఎస్‌.పాడీ అర్జీ ఇచ్చారు.  శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని పార్వతీపురానికి చెందిన ముస్లింలు కోరారు. 

 

 

Updated Date - 2022-08-09T05:41:09+05:30 IST