హద్దుమీరితే ఎన్‌కౌంటరే..!

ABN , First Publish Date - 2022-03-10T16:01:22+05:30 IST

హత్యలు, దోపిడీలకు పాల్పడే రౌడీలను ఉక్కు పాదంతో అణిచివేయాలని గ్రేటర్‌ చెన్నై పోలీసు శాఖ వ్యూహం సిద్ధం చేసింది. రాజధాని నగరం చెన్నైలో నేరాలను అరికట్టేందుకు పోలీసు శాఖ పలు చర్యలు

హద్దుమీరితే ఎన్‌కౌంటరే..!

- వెయ్యిమంది రౌడీల చిట్టా రెడీ

- చెన్నై పోలీసుల తాజా వ్యూహం


పెరంబూర్‌(చెన్నై): హత్యలు, దోపిడీలకు పాల్పడే రౌడీలను ఉక్కు పాదంతో అణిచివేయాలని గ్రేటర్‌ చెన్నై పోలీసు శాఖ వ్యూహం సిద్ధం చేసింది. రాజధాని నగరం చెన్నైలో నేరాలను అరికట్టేందుకు పోలీసుశాఖ పలు చర్యలు చేపట్టింది. గతంలో నగరాన్ని గడగడలాడించిన అయోధ్య కుప్పం వీరమణి సహా పలువురు పేరుమోసిన రౌడీలు ఎన్‌ కౌంటర్‌కు గురయ్యారు. నేరాల అదుపుకు పోలీసులు చర్యలు చేపడుతున్నా, మరోవైపు రౌడీల సంఖ్య పెరుగుతూనే ఉంది. రౌడీల ఏరివేతలో భాగంగా పోలీసులు తనిఖీలు చేపడుతున్న ప్రతిసారి, వారు అజ్ఞాతంలోకి వెళ్లడం, తిరిగి వచ్చి రౌడీయిజం చేయడం సాధారణమవుతోంది. ముఖ్యంగా, దక్షిణ చెన్నై, మధ్య చెన్నై, ఉత్తర చెన్నై తదితర ప్రాంతాల్లో చిన్నవయసులోనే నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల నగరంలో జరిగిన పలు హత్యానేరాల్లో నిందితులు మైనర్లు కావడం పోలీసులను దిగ్ర్భాంతికి గురి చేస్తోంది. ఇటీవల ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల్లో మడిపాక్కం ప్రాంతంలో డీఎంకే ప్రముఖుడు సెల్వంను బాలురు చుట్టుముట్టి దారుణంగా హత మార్చిన ఘటన సంచలనం రేపింది. ఈ క్రమంలో, హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, అరాచకాలకు పాల్పడే వారు, అజ్ఞాతంలో ఉన్న రౌడీల జాబితా సిద్ధం చేయాలని పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ ఉత్తర్వులతో, పోలీసులు నగరంలో సుమారు వెయ్యి మంది రౌడీల జాబితా సిద్ధం చేశారు. జైళ్లలో ఉంటూ ఇటీవల విడుదలైన రౌడీల పేర్లు కూడా జాబితాలో చేర్చాలని ఇన్స్‌పెక్టర్‌లకు సహాయ కమిషనర్లు ఆదేశించారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ‘రౌడీల చరిత్రతో కూడిన రిజిస్టర్లు’ ఏర్పాటయ్యాయి. ఈ జాబితాలో ఉన్న వారిలో ఎంతమంది జైళ్లలో ఉన్నారు? ఎంతమందిపై హత్యాకేసులున్నాయి? అజ్ఞాతంలో ఉన్నవారెందరు? ఇలా పూర్తి వివరాలు ఉండాలని ఆదేశించారు.. రౌడీలను ఏ ప్లస్‌, ఏ, బి, సి అనే నాలుగు విభాగాలుగా విభజించారు. ఈ విభాగాల్లో ఉన్న ప్రతి ఒక్కరి కదలిక పరిశీలించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదే సమయంలో తాము నివసిస్తున్న ప్రాంతాల్లో ‘దాదా’ కావాలని భావించిన మైనర్‌ బాలురు అల్లర్లకు పాల్పడి గుర్తింపు పొందుతున్నారు. ఇలాంటి వారిపై ప్రత్యేక నిఘా వేయాలని, అవసరమైతే తీవ్ర నేరాలకు పాల్పడే వారిని ఎన్‌కౌంటర్‌ చేసి నేరాలు అదుపుచేసే ఆలోచనలో నగర పోలీసు శాఖ ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2022-03-10T16:01:22+05:30 IST