వెయ్యి దాటిన మహారాష్ట్ర

ABN , First Publish Date - 2020-04-08T09:26:39+05:30 IST

దేశంలో 24 గంటల్లో కొత్తగా 508 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాత్రి 10 గంటల వరకు వివిధ రాష్ట్రాలు వెల్లడించిన సమాచారం బట్టి దేశంలో మొత్తం కేసులు 5,200కు చేరాయి.

వెయ్యి దాటిన మహారాష్ట్ర

దేశంలో కరోనా కేసులు 5,000+ 

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: దేశంలో 24 గంటల్లో కొత్తగా 508 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాత్రి 10 గంటల వరకు వివిధ రాష్ట్రాలు వెల్లడించిన సమాచారం బట్టి దేశంలో మొత్తం కేసులు 5,200కు చేరాయి. మరణాల సంఖ్య 162కు పెరిగింది. అయితే, సాయంత్రం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం కేసులు 4,789, మరణాల సంఖ్య 124గా ఉంది. మహారాష్ట్రలో కరోనా కేసులు దేశంలోనే తొలిసారిగా వెయ్యి కేసులు దాటాయి. కరోనా కాటుకు పుణెలో మరో ముగ్గురు, మహారాష్ట్రలో ఇప్పటి వరకు 52 మంది బలవ్వగా ఒడిసాలో తొలి కరోనా మరణం నమోదయింది. 


ఆస్పత్రుల్ని విమర్శించిన అసోం ప్రతిపక్ష ఎమ్మెల్యే అరెస్టు

గువాహటి: కరోనా ఆస్పత్రులు, క్వారంటైన్‌ కేంద్రాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అసోం ప్రతిపక్ష ఏఐడీయూఎఫ్‌ ఎమ్మెల్యే అమినుల్‌ ఇస్లాంను పోలీసులు అరెస్టు చేశారు. ఫోన్‌లో మరో వ్యక్తితో అతని సంభాషణ ఆడియో క్లిప్‌ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. క్వారంటైన్‌ కేంద్రాలు, ఆస్పత్రుల్లో పరిస్థితులు నిర్బంధ కేంద్రాల్లో కంటే అధ్వానంగా ఉన్నాయని ఆయన విమర్శించడం ఆ క్లిప్‌లో వినిపించింది. ప్రాథమిక విచారణ తర్వాత ఆయనను అరెస్టు చేశామని రాష్ట్ర పోలీసు చీఫ్‌ భాస్కర్‌ జ్యోతి మహంతా తెలిపారు.


క్వారంటైన్‌ నుంచి పరారైన వైద్యుడి అరెస్టు

ఇంఫాల్‌/లఖ్‌నవు: మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో క్వారంటైన్‌ కేంద్రం నుంచి పరారైన వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఆస్పత్రిలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న ఆ వైద్యుడు తబ్లీగీ జమాత్‌తో లింక్‌ ఉన్న వ్యక్తికి చికిత్స చేశాడు. తర్వాత ఆ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో వైద్యుడిని, వైద్య సిబ్బందిని క్వారంటైన్‌కు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రం నుంచి వైద్యుడు తప్పించుకున్నాడు. ఇంట్లో దాక్కున్న అతన్ని అరెస్టు చేసి, తిరిగి క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌ ఆస్పత్రి నుంచి 69 ఏళ్ల కరోనా పేషెంట్‌ తప్పించుకున్నాడు. దుప్పటితో కిటికీ గాజు పలకలను బద్దలుకొట్టి పరారయ్యాడు. ఇటుక బట్టీలో దాక్కున్న అతన్ని స్థానికుల సమాచారంతో పట్టుకున్నారు. నేపాల్‌కు చెందిన ఈ వ్యక్తి తబ్లీగీ జమాత్‌కు వెళ్లొచ్చిన 24 మంది బృందంలో సభ్యుడు. బరేలీలోని ఇజత్‌నగర్‌లో పోలీసులపై దాడి చేసిన 150 మందిపై కేసు నమోదయింది. వారిలో 42 మందిని అరెస్టు చేశారు. మరోవైపు..


ఢిల్లీ స్టేట్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ (డీఎ్‌ససీఐ)లో ఇద్దరు వైద్యులు, 16 మంది వైద్య సిబ్బందికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో ఔట్‌-పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఓపీడీ)ను మూసివేశారు. ఇక అలీగఢ్‌లో ఒక మతానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన హిందూ మహాసభ ప్రధాన కార్యదర్వి పూజా షకున్‌ పాండే, ఆమె భర్త అశోక్‌ పాండేను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

Updated Date - 2020-04-08T09:26:39+05:30 IST