అదానీ గ్రూపునకు.... మార్చి నాటికి రూ. 2 లక్షల కోట్ల అప్పు

ABN , First Publish Date - 2022-05-19T20:54:16+05:30 IST

గౌతం అదాని... దేశంలో ప్రస్తుతం మార్మోగుతున్న పేరిది. ఈయన సారధ్యంలోని అదానీ గ్రూపు... తాజాగా పలు రంగాల్లోకి ప్రవేశిస్తోంది.

అదానీ గ్రూపునకు....   మార్చి నాటికి రూ. 2 లక్షల కోట్ల అప్పు

* అయినా తగ్గని దూకుడు

* కొ్త్త రంగాలపై దృష్టి

న్యూఢిల్లీ : గౌతం అదాని... దేశంలో ప్రస్తుతం మార్మోగుతున్న పేరిది. ఈయన సారధ్యంలోని అదానీ గ్రూపు... తాజాగా పలు రంగాల్లోకి ప్రవేశిస్తోంది. వీటిలో కీలక సెక్టార్లు కూడా ఉన్నాయి. గుజరాత్ సిమెంట్స్ తో పాటు ఏసీసీ సిమెంట్స్ లో కూడా వాటాలు కొనుగోలు చేసిన నేపథ్యంలో... అదానీ గ్రూపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదానీ గ్రూపు డేటా సెంటర్లతోపాటు విమానాశ్రయాల నిర్వహణలో కూడా అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను కూడా చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.


కాగా... అదానీ గ్రూపునకు ఈ(2022) ఏడాది మార్చి నాటికి రూ. 2.2 లక్షల కోట్ల అప్పులున్నాయన్న విషయం ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. అయితే ‘అప్పు’ ఇంత భారీగా ఉన్నప్పటికీ కూడా... రుణాల చెల్లింపుల్లో మాత్రం ఎక్కడా లోటు జరగనివ్వడంలేదు. అదానీ గ్రూపు ఆదాయాలు మెరుగ్గానే ఉండడంతోపాటు కోవిడ్ కారణంగా గత రెండేళ్ళుగా వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం కూడా ఈ గ్రూపునకు కలిసొస్తున్నట్లుగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక వ్యాపార విస్తరణలో భాగంగా ఆయా రంగాల్లో అదానీ గ్రూపు భారీగా అప్పులు చేస్తూనే వస్తోంది. ఇప్పుడు... కొత్తగా కొన్ని సిమెంట్ కంపెనీలను టేకోవర్ చేయాలని నిర్ణయించిన క్రమంలో... అదానీ గ్రూపు రుణభారం మరింతగా పెరగనుంది. ఇదే సమయంలో దేశంలో భారీగా ద్రవ్యోల్బణం, నేపథ్యంలో సంక్లిష్టంగా మారుతోన్న ఆర్ధిక పరిస్థితులు ఏమాత్రం ఆశాజనంగా లేకపోవడంతోపాటు మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రానున్న రోజుల్లో వడ్డీ రేట్లను మరింతగా పెంచనున్నట్లు సంబంధిత వర్గాల నుంచి వినవస్తోంది.


ఇదే జరిగితే అదానీ గ్రూపు రానున్న రోజుల్లో ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశమున్నట్లు ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. మొత్తంమీద ఈ పరిణామాల నేపథ్యంలో కార్పొరేట్ వర్గాల్లో అదానీ గ్రూపునకు సంబంధించి పలు రకాల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. అయితే... అదానీ గ్రూపు నుంచి ఇన్వెస్టర్లకు మాత్రం మంచి లాభాలే వస్తున్నాయని చెబుతుండడం గమనార్హం. మెంత్తంమీద అత్యధికంగా అప్పులున్న కార్పొరేట్ గ్రూపుల్లో అదానీ గ్రూపు ఒకటని నిపనుణులు చెబుతున్నారు. అయితే వ్యాపారరంగాలన్నీ ప్రోత్సాహకరంగానే ఉండడంతో అదానీ గ్రూపునకు వచ్చిన ఇబ్బందేమీ లేదని కూడా ఆర్ధికరంగాల నిపుణులు చెబుతుండడం విశేషం. ఇదిలా ఉంటే... అదానీ గ్రూపు తాజాగా మీడియా రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు వార్తలొస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే దుబాయ్ కు చెందిన కొన్ని ప్రముఖ సంస్థలు కూడా అదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తుండడం గమనార్హం. మొత్తంమీద... భారతదేశంలో గతంలో ఏ కార్పొరేట్ గ్రూపు కూడా విస్తరించనంత వేగంగా ఇప్పుడు అదానీ గ్రూపు విస్తరిస్తుండడం విశేషం. ఇక రాజకీయపక్షాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ... అదానీ గ్రూపు ఇవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగుతుండడం విశేషం. 

Updated Date - 2022-05-19T20:54:16+05:30 IST